ఈ స్టవ్‌కు గ్యాస్‌ అక్కర్లేదు! | Udaipur Man Builds Stove That Cooks For 25 People In 30 Minutes | Sakshi
Sakshi News home page

ఈ స్టవ్‌కు గ్యాస్‌ అక్కర్లేదు!

Mar 29 2026 1:14 AM | Updated on Mar 29 2026 1:14 AM

Udaipur Man Builds Stove That Cooks For 25 People In 30 Minutes

ఈ గ్యాస్‌ కష్టాల ఎండకాలంలో... ‘శతకోటి ప్రాబ్లమ్స్‌కు అనంతకోటి ఐడియాస్‌’ అనుకోవడం ధైర్యాన్ని ఇస్తుంది. ఎల్‌పీజీ గ్యాస్‌ అక్కర్లేని ‘విశ్వగురు స్టవ్‌’లాంటి స్టవ్‌లు మరింత ధైర్నాన్ని ఇస్తాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన షేర్‌ఖాన్‌ అనే సామాన్యుడు ఒకేసారి మూడు రకాల వంటలు చేసుకునే స్టవ్‌ను రూపొందించాడు. ఈ స్టవ్‌కు చాలా తక్కువ కట్టెలు మాత్రమే అవసరం అవుతాయి. పొగ సమస్య పెద్దగా ఉండదు...

షేర్‌ఖాన్‌ ఎనిమిదవ తరగతి మాత్రమే చదువుకున్నాడు. వంటలు వండడానికి మహిళలు గంటల తరబడి సమయం వెచ్చిస్తూ కష్టపడే దృశ్యాలు చూసిన తరువాత... వారి పని సులువు చేయడానికి ఏదైనా చేయాలని అదేపనిగా ఆలోచించాడు.

అతడి ఆలోచనల్లో నుంచి పుట్టిందే... విశ్వగురు స్టవ్‌.
వంట చేసే సమయాన్ని తగ్గించడం, కట్టెల వినియోగాన్ని తగ్గించడం, పొగను కనిష్ఠ స్థాయికి తీసుకురావడం లక్ష్యంగా ఖాన్‌ తయారుచేసిన స్టవ్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఈ పొయ్యి లేదా స్టవ్‌ను మూడు పొరల(లేయర్స్‌)తో ప్రత్యేకంగా రూపొందించాడు. దీనిలో ఒకేసారి రకరకాల వంటకాలు చేసుకోవచ్చు.పై పొరలో రొట్టెలు, బ్రెడ్, పిజ్జాలాంటివి కాల్చవచ్చు.మధ్య పొరలో కూరగాయలు, మాంసాన్ని ఫ్రై చేసుకోవచ్చు లేదా గ్రిల్‌ చేసుకోచ్చు. కింది పొరలో పప్పు, సూప్‌ లేదా కూరలు ఉండకబెట్టవచ్చు. ఈ స్టవ్‌ వంటకాలు త్వరగా పూర్తి అయ్యేలా చేస్తుంది. తద్వారా సమయం ఆదా అవుతుంది. అట్టే కష్టపడనక్కర్లేదు.

ఇక ఇంధనం విషయానికి వస్తే....
సంప్రదాయ పొయ్యిలో పదికిలోల కట్టెలు వాడితే, ఈ పొయ్యిలో మాత్రం రెండు కిలోల కట్టెలు వాడితే సరిపోతుంది. పొగ సమస్య పెద్దగా ఉండదు. సంప్రదాయ రాజస్థానీ వంటకాల నుంచి అంతర్జాతీయ బ్రెడ్‌లు, పిజ్జాల వరకు ఈ పొయ్యిపై ఏ వంటకాన్ని అయినా వండవచ్చు అంటున్నాడు ఖాన్‌. స్టవ్‌ రూపొందించిన తరువాత ఇండ్లలో, రోడ్డు పక్కన హోటల్స్‌లో పరీక్షించాడు. ఆ తరువాత దీనిపై పేటెంట్‌ తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈ స్టవ్‌లు వేల సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఇండ్లతో పాటు ధాబాలు, చిన్న చిన్న హోటల్స్‌లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

30 నిమిషాల వ్యవధిలో 25–30 మందికి సరిపడా భోజనాన్ని తయారుచేసే ఈ స్టవ్‌ గేమ్‌ చేంజర్‌గా మారింది. వృత్తిరీత్యా కమ్మరి అయిన షేర్‌ఖాన్‌ తన 3–ఇన్‌–1 స్టవ్‌తో దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు. సోషల్‌ మీడియాలో ఖాన్‌ షేర్‌ చేసిన డెమో వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement