TTD Brahmotsavam 2022: తిరుమలకు రంగనాథుడు అలా వచ్చాడు!

TTD Brahmotsavam 2022: Arrival King Sri Ranganatha Tirumala 13th Century - Sakshi

1328వ సంవత్సరంలో శ్రీరంగంపై ముస్లింల దండయాత్ర జరిగింది. ఆ సమయంలో శ్రీరంగంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవమూర్తులను ఉదయమే కావేరి నదికి తీసుకువెళ్ళి నది మధ్యలో తిరుమంజనాది సేవలను భక్తుల సమక్షంలో నిర్వహించేవారు. సాయంత్రం వరకు స్వామి వారికి సేవలు నిర్వహించి అటు తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకునేవారు.

ఇలా శ్రీరంగనాథుడి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ అశ్విక సేనలు అకస్మాత్తుగా కన్ననూరు వైపు నుంచి కావేరి ఒడ్డుకు చేరుకున్నాయి. దీనితో సైన్యం వీరిదగ్గరకు చేరుకునేలోపు స్వామివారి విగ్రహాలను రక్షించాలని భావించిన భక్తులు బలిష్ఠుడైన లోకాచారి అనే యువకుడి సారథ్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి చిన్నపల్లకిలో స్వామివారిని వేంచేపు చేసి రహదారి గుండా పుదుక్కొటై్ట్టకి పంపారు. దారిలో తిరుమలకు వెళ్తే సురక్షితమని భావించి అటు వైపుగా బయలుదేరాలనుకున్నాడు లోకాచారి. అయితే నేరుగా తిరుపతికి వెళ్తే ముస్లింల బారిన పడతామన్న భయంతో తెరుకనంబి, మైసూరు మీదుగా చుట్టూ తిరిగి ముఖ్య రహదారులలో కాకుండా అడ్డదారులలో ప్రయాణం చేస్తూ తిరుపతికి చేరుకున్నాడు.

ఆ సమయంలో తిరుపతి సింగమనాయకుడు పాలనలో వుండేది. అలా తిరుమల చేరుకున్న శ్రీరంగనాథుడు శ్రీవారి ఆలయంలో ఆగ్నేయంగా వున్న మండపంలో విడిది చేసి శ్రీవారి అతిథిగా సేవలందుకున్నారు. శ్రీనివాసునికి వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహిస్తూ వుంటే శ్రీరంగనాథునికి పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించేవారు. దీనితో శ్రీవైష్ణవులే కాక దక్షిణాది భక్తులందరూ శ్రీనివాసుని శ్రీరంగనాథుని దర్శనానికి పెద్దసంఖ్యలో తిరుమలకు తరలి రావడం మొదలుపెట్టారు. అదేరోజులలో హిందూరాజులు, సామంతులు చేతులు కలిపి మథుర సుల్తానులపై దండెత్తి వారిని ఓడించారు.

అదే సమయంలో హరిహర బుక్కరాయల నాయకత్వంలో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు మొదలయ్యాయి. 1370 సంవత్సరానికి తిరుమల–తిరుపతి ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యం బలంగా ఏర్పడింది. దక్షిణ దేశమంతా కూడా వీరి పరిపాలనలో సుభిక్షం, సురక్షితమైంది. దీనితో హిందువులలో ధైర్యం, శాంతిభద్రతలపై నమ్మకం ఏర్పడ్డాయి.

1371లో అంటే 43 సంవత్సరాల తరువాత తిరుమల నుంచి శ్రీరంగానికి శ్రీరంగనాథన్‌ తిరుగు ప్రయాణం వైభవంగా జరిగింది. అంత గొడవల్లో కూడా ముస్లింల విధ్వంసానికి గురికాని దేవాలయం ఏదైనా వుంది అంటే అది తిరుమల ఆలయం మాత్రమే. ముస్లింలు కొండవైపు కూడా రాలేదు. దీనికి కారణం స్వామివారి మహిమే అన్న భావన భక్తులందరిలో కలిగింది. తమిళ ప్రాంతం నుంచి భక్తులు తిరుమలకు రావడం అప్పటి నుంచే మొదలైంది. ఆధ్యాత్మిక భావాలకు తిరుమల ఒక ఆసరాగా నిలిచిపోయింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top