ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్‌ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా?

Tips to Keep Your Lungs Healthy  - Sakshi

మనిషి శ్వాస తీసుకుంటేనే ప్రాణాలతో ఉంటాడు. శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు ఎంతో కీలకం. మనిషి సాధారణంగా ఒక్క రోజులో దాదాపు 25,000 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్, నత్రజని, తక్కువ మొత్తంలో ఇతర వాయువులు, తేలియాడే బ్యాక్టీరియా, వైరస్, వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను శరీరం అంతా పంపిణీ చేస్తాయి.

ఆధునిక జీవనశైలి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమై ఊపిరి తీసుకోవడం కష్టమైపోతూ కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు నెలను ‘హెల్థీ లంగ్స్‌ మంత్‌’గా నిర్ణయించి ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.  - గుంటూరు మెడికల్‌

బాధితులు అధికమే..   
గుంటూరు జిల్లాలో 40 మంది పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల స్పెషాలిటీ వైద్య నిపుణులు) సేవలందిస్తున్నారు. ఒక్కో డాక్టర్‌ వద్దకు ప్రతి రోజూ 15 నుంచి 20 మంది ఊపిరితిత్తుల సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. కరోనా సమయంలో ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేసే పల్మనాలజిస్ట్‌ల పాత్ర బాగా పెరిగింది. కోవిడ్‌–19 వచ్చి కోలుకున్న పిదప తిరిగి కొంత మందికి పోస్ట్‌కోవిడ్‌ కాంప్లికేషన్స్‌ వస్తున్నాయి. ఇలాంటి వారికి పల్మనాలజిస్ట్‌లు సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు రక్షిస్తున్నారు.

ఊపిరితిత్తుల వ్యాధులు గుర్తించడం ఎలా? 
ఎక్కువగా దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, చాతి పట్టివేయడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది సీఓపీడీ వ్యాధిగా గుర్తించాలి. తరచూ జలుబు చేయడం, దురద, కళ్లు మంటలు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాసనలు సరిపడకపోవడం వంటి లక్షణాలను ఎలర్జిగా గుర్తించాలి. జ్వరం, కళ్లెతో కూడిన దగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు చాతి నొప్పి ఉంటే దానిని నిమోనియా వ్యాధిగా భావించాలి. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే ఊపిరితిత్తులకు వచ్చే క్షయ వ్యాధిగా గుర్తించాలి. దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం లంగ్‌ క్యాన్సర్‌ లక్షణాలు. పొడి దగ్గు, ఆయాసం, కీళ్ల నొప్పులు ఉంటే ఊపిరితిత్తులకు వచ్చే ఐఎల్‌డీ వ్యాధిగా గుర్తించాలి.   

వీరికి రిస్క్‌ ఎక్కువ..  
ధూమపానం చేసేవారు, పొగతో కూడిన ప్రాంతాల్లో పనిచేసేవారు, పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు, ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు, వడ్రంగి పనులు చేసేవారు, పొగతో కూడిన వాహనాలను రిపేర్లు చేసేవారు, చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.  

ముందస్తు జాగ్రత్తలతో నివారణ  
ఊపిరితిత్తుల వ్యాధులను ముందస్తు జాగ్రత్తలతో చాలా వరకు నివారించవచ్చు. గుట్కా, పాన్‌పరాగ్, ఖైనీ, పొగతాగడం విడనాడాలి. దుమ్ము, ధూళి ప్రాంతాల్లో పనిచేసేవారు మాస్క్‌లు ధరించడం ద్వారా ఊపిరితిత్తులకు ఇబ్బంది కలగకుండా చూడవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు కలిగిఉండాలి. అలర్జీ పదార్థాలకు దూరంగా ఉండాలి. 60 ఏళ్లు పైబడిన వారంతా క్రమం తప్పకుండా ఫ్లూ, నిమోనియా వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల ఊపిరితిత్తుల జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం, ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.  
డాక్టర్‌ బి.దుర్గాప్రసాద్, పల్మనాలజిస్ట్, గుంటూరు
చదవండి: Brain Stroke: పురుషులకే స్ట్రోక్‌ రిస్క్‌ ఎక్కువా? అపోహలు- వాస్తవాలు.. ఈ ఆహారం తీసుకున్నారంటే..
Custard Apple: సీజనల్‌ ఫ్రూట్‌ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్‌ అణువుల వల్ల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top