2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది

Telugu Movies Releasing On OTT  In 2020 - Sakshi

ఈ సంవత్సరం మనకు అన్ని సినిమాలూ పడ్డాయి కరోనా వల్ల. బయట లాక్‌డౌన్‌  సినిమా. హాస్పిటల్స్‌లో వెంటిలేటర్ల సినిమా. వ్యాన్లొచ్చి పట్టుకెళ్లే క్వారంటైన్‌  సినిమా. మాస్క్‌ సినిమా. కాఫ్‌ సినిమా. కోల్డ్‌ సినిమా...అన్నీ పడ్డాయి. వాటితో పాటు ఇంట్లో కూడా సినిమాలు పడ్డాయి. ఆ సినిమాల నుంచి ఉపశమనం కోసం ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ తెలుగు సినిమాలు విడుదల చేశాయి. 2020లో దాదాపు 20 సినిమాలు ఓటిటిల ద్వారా విడుదలయ్యాయి. కొన్ని నచ్చాయి. కొన్ని నొచ్చాయి. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పాలి. దానికి ముందు వీటికి థ్యాంక్స్‌ చెప్పాలి. ఓటీటీ సినిమాలు ఈ సండే స్పెషల్‌.

ఉదయం 11 వరకూ పనులు చేసుకుని ఇంకేం తోచక ‘సినిమా చూద్దాం’ అని కుటుంబం అంతా ఇంట్లో సినిమాకు కూచునే వింత 2020లోనే జరిగింది. దానికి కారణం కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌. రాత్రి భోజనం చేశాక సినిమా చూసి పడుకోవడం కూడా కరోనా వల్లే సాధ్యమైంది. థియేటర్లకు వెళ్లే అవసరం లేకుండా (అవి మూతపడ్డాయి కనుక) ఇళ్లకే కొత్త కొత్త సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ తెచ్చాయి.

గతంలో కుదరని పని
రెండు మూడేళ్ల క్రితం కమల హాసన్‌ తన కొత్త సినిమాను థియేటర్ల ద్వారా కాకుండా ‘డైరెక్ట్‌ టు హోమ్‌’ పద్ధతిలో విడుదల చేస్తానంటే అక్కడి ఎగ్జిబిటర్స్‌ అందరూ పెద్ద నిరసన వ్యక్తం చేశారు.  నిన్న మొన్న నటుడు సూర్య తన భార్య జ్యోతిక ముఖ్యపాత్రధారిగా నటించిన సినిమా ‘పొన్‌మగల్‌ వందాల్‌’ను ఓటిటి (ఓవర్‌ ది టాప్‌) ద్వారా విడుదల చేస్తానంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ పేచీ పెట్టారు. అతడు హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఓటిటి విడుదలకు కూడా ఇవే సమస్యలు. నిజమే. సినిమా అనేది లక్షల మందికి సినిమా థియేటర్ల ద్వారా ఉపాధి కల్పిస్తుంది. అసలు ఆ మాధ్యమం పెద్ద తెర మీద వీక్షించేందుకే తయారైనది. అయినప్పటికీ ఇప్పుడు 2020లో కథంతా మారిపోయింది. అనివార్యంగా చిన్న తెర మీద, థియేటర్ల ద్వారా కాకుండా నేరుగా ఇంటికే సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ మీద విడుదల అవుతున్నాయి. ఈ పరిస్థితికి కరోనా లాక్‌డౌన్‌ ఒక పెద్ద అవకాశాన్ని కల్పించింది.

అమేజాన్‌ ఉందా?
1990లో డిష్‌ కనెక్షన్‌ ఉందా అని అడిగేవారు. దానికి కాస్త ముందు వీడియో పార్లర్‌లో మెంబర్‌ షిప్‌ ఉందా అని అడిగేవారు. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉందా అని అడుగుతున్నారు. మూడూ దాదాపు ఒకటే. మనం డబ్బు కడితే ‘వాళ్ల దగ్గర ఉన్న’ సినిమాలు చూపిస్తారు. ‘మనం కోరుకున్న సినిమాలన్నీ’ అవి చూపవు. అయితే మనం విసుగొచ్చి సబ్‌స్క్రిప్షన్‌ రెన్యువల్‌ చేయించుకోవడం మానేయకుండా ఈ ప్లాట్‌ఫామ్స్‌ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు కొని విడుదల చేస్తూ ఉంటాయి. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, ఆహా... ఇవన్నీ ఇప్పుడు నేరుగా సినిమాలను కొని నేరుగా ఇంట్లోనే చూపిస్తున్నాయి. ఇవి కాకుండా ఏ.టి.టి (ఎనీ టైమ్‌ థియేటర్‌) యాప్‌ ద్వారా కూడా సినిమాలు విడుదల చేస్తున్నాయి.

బంధనాలు తెంచుకున్న తెలుగు సినిమా
భారతదేశంలో బాలీవుడ్‌ తర్వాత తెలుగు సినిమా మార్కెట్‌ పెద్దది. తెలుగులో సినిమా ఒక్కటే వినోద సాధనం. ఇది ఇప్పటికీ సంప్రదాయ రిలీజు వ్యవస్థనే విశ్వసిస్తోంది. అయినప్పటికీ 2020 తెలుగు సినిమా పరిశ్రమను తన పాత బంధనాలు తెంపుకునేలా చేసింది. థియేటర్లు పూర్తిగా తెరుచుకునే వరకు సినిమాలను మురగబెట్టకుండా ధైర్యం చేసి ఓటిటి ద్వారా సినిమాలు విడుదల చేసుకునేందుకు ఉత్సాహపరిచింది. ఈ సంవత్సరం ఓటిటి ద్వారా 20 సినిమాల వరకూ విడుదల అయ్యాయి. ప్రేక్షకులు వీటిని బాగా చూశారు. లాక్‌డౌన్‌ వల్ల కోట్లాది మంది ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల ఇరవై ముప్పై శాతం ఇళ్లల్లో నెట్‌ ఉండటం వల్ల కొత్త సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని మరి చూశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమాల పై అభిప్రాయాలు వ్యక్తం అయ్యేప్పుడు కొన్ని థియేటర్లలో విడుదలైతే ఫ్లాప్‌ అయి ఉండేవని అన్నారు. మరికొన్నింటిని థియేటర్లలో రిలీజైతే ఇంపాక్ట్‌ బాగుండేదనీ నిరాశ పడ్డారు. రెండు రకాల ఫలితాలు చూశాయి ఈ సినిమాలు.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
2020లో విడుదలైన ఓటిటి సినిమాలు మధ్యతరగతి కథలతో ఆకట్టుకున్నాయి. అమేజాన్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అరకులో సాగిన ఒక అందమైన మధ్యతరగతి పౌరుషాన్ని చూపింది. సత్యదేవ్‌ ఈ సినిమాతో ఇంటింటి స్టార్‌ అయ్యాడు. ‘ఆహా’లో విడుదలైన ‘భానుమతి–రామకృష్ణ’ కూడా ఒక సంపన్న అమ్మాయికి ఒక మధ్యతరగతి అబ్బాయికి మధ్య సాగిన ప్రేమ కథగా ఆకట్టుకుంది. నవీన్‌ చంద్ర ఈ సీజన్‌లో ఒక హిట్‌ను మూటగట్టుకున్నాడు. ‘ఆహా’లోనే విడుదలైన ‘కలర్‌ ఫొటో’ రూపానికి సంబధించి, రంగుకు సంబంధించి ఒక సీరియస్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. కామెడీ నటుడు సుహాస్‌ ఈ సినిమాతో కొత్త ప్రతిభను నిరూపించుకున్నాడు. నటి చాందిని చౌదరి కూడా మంచి మార్కులు పొందింది. ఇక ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ అయితే ఓటిటిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రశంసలు అందుకుంది. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా అక్కడి భాషను, ఆత్మను సమర్థంగా పట్టుకుంది. ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ కొత్త జంటగా ప్రేక్షకులకు నచ్చారు. ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమా హీరో రాజ్‌తరుణ్‌ ను ప్రేక్షకులు మర్చిపోకుండా చేసింది. ఈ వరుసలోనే ‘అమృతారామమ్‌’, ‘ఐఐటి కృష్ణమూర్తి’, ‘మా వింతగాధ వినుమా’ సినిమాలను చెప్పుకోవచ్చు.

వి– నిశ్శబ్దం

2020 పెద్ద సినిమాలను కూడా తీసుకొచ్చింది. సాధారణంగా థియేటర్ల లో రిలీజైతే పెద్ద హంగామాగా ఉండే నాని సినిమా ‘వి’ అమేజాన్‌లో విడుదలైంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్‌బాబు మరో ముఖ్యపాత్ర. ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమా చిన్నతెర వల్ల చూపాల్సినంత ఇంపాక్ట్‌ చూపలేదనే టాక్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ థియేటర్‌ రిలీజ్‌ అవుతోంది ఇది. నాని ‘సైకో’లా కనిపించినా ఆ స్వభావాన్ని ‘జస్టిఫై’ చేయడంతో కథ దుష్టశిక్షణగా మారింది. ఇక రిలీజ్‌ అవుతుందా అవదా అంటూ టెన్షన్‌ పెట్టిన అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఆశించిన టాక్‌ను సాధించలేదు. అనుష్క ను ముందు పెట్టి కథను ఆమె ప్రాముఖ్యం లేకుండా నడిపారనే టాక్‌ వచ్చింది.

సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తన భారీతనానికి తగ్గట్టుగా హిట్‌ అయ్యింది. దర్శకురాలు సుధా కొంగర పెద్ద హిట్‌ కొట్టినట్టు లెక్క. పెద్ద స్క్రీన్‌ మీద ఈ సినిమా కథ వేరేగా ఉండేది. కీర్తి సురేశ్‌ నటించిన ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ రెండూ నిరాశ పరిచాయి. పెంగ్విన్‌లో డార్క్‌ కంటెంట్‌ పెరగడం ఒక కారణమైతే మిస్‌ ఇండియాలో కథ శక్తివంతంగా లేకపోవడం కారణం. ‘మహానటి’ సినిమాతో అలరించిన కీర్తి సురేశ్‌ మిస్‌ ఇండియాలో లుక్స్‌ పరంగా కూడా ఆకట్టుకోలేకపోయిందని ఇళ్లలో ఈ సినిమా చూసిన గృహిణులు అభిప్రాయ పడ్డారు. మొత్తం మీద రాబోయే సంవత్సరం థియేటర్లు యథావిథిగా కళకళలాడినా బిజినెస్‌పరంగా ఓటిటిల ఆఫర్లు బాగుంటే అక్కడా సినిమాలు రిలీజవుతాయనడంలో సందేహం లేదు. ఇటు ఇంటా అటు బయటా తెలుగు సినిమాలు కళకళలాడాలని కోరుకుందాం.
 

అనగనగా ఓ అతిథి
ఓటిటిల మీద విడుదలైన సినిమాల్లో ‘ఆహా’ ద్వారా విడుదలైన ‘అనగనగా ఒక అతిథి’ ఒక భిన్నమైన గుర్తింపు పొందింది. దాదాపు మూడు నాలుగు ముఖ్యపాత్రలతో నడిచిన ఈ సినిమా ఒక కన్నడ నాటకం ఆధారంగా మొదట కన్నడంలో సినిమాగా వచ్చి తెలుగులో రీమేక్‌ అయ్యింది. పాయల్‌ రాజ్‌పుత్, చైతన్యకృష్ణ, ఆనంద్‌ చక్రపాణి తదితరులు నటించిన ఈ సినిమా దురాశ దుఃఖానికి చేటు అని చెబుతుంది. సినిమా అంగీకరించని కథలు ఓటిటిల ద్వారా అంగీకారం పొంది రిలీజవుతాయని ఈ సినిమా ద్వారా తెలుస్తోంది.

– సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: సినిమా డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top