ఈ సమ్మర్‌లో... లెక్క తేల్చాల్సిందే! | Summer Holidays Maths Stories for Kids | Sakshi
Sakshi News home page

ఈ సమ్మర్‌లో... లెక్క తేల్చాల్సిందే!

May 6 2026 5:48 PM | Updated on May 6 2026 6:25 PM

Summer Holidays Maths Stories for Kids

ఫ్రెండ్స్, చాలామంది పిల్లలలాగే మీకూ మ్యాథ్స్‌ అంటే భయమా? అయితే ఈ వేసవి సెలవులు మీకు గుర్తుండిపోతాయి. మీరు ‘ఊ’ అనాలేగానీ ఆ భయాన్ని పోగొట్టడం వెరీ వీజీ. మీలోని ఆ భయం పారిపోతే మ్యాథ్స్‌ అంటే  మీకు ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. ప్రామిస్‌...

మీకు టింకు గురించి ఒక విషయం చెప్పాలి. మనం హారర్‌ సినిమాలు చూసినప్పుడు కాస్తో కూస్తో భయపడతాము కదా...అయితే మన ఫ్రెండ్‌ టింకు మాత్రం కొం...చెం కూడా భయపడడు. ‘ఆ హారర్‌ సినిమా చూసి పెద్దవాళ్లే భయపడ్డారు. నువ్వేమిటీ కొంచెం కూడా భయపడలేదు!’ అని అడిగితే...‘నేను మ్యాథ్స్‌కు తప్ప దేనికీ భయపడను’ అన్నాడట. టింకు జవాబుకు మనం నవ్వుకున్నా... మ్యాథ్స్‌ అనేది చాలామంది పిల్లలకు సీరియస్‌ ప్రాబ్లం. మీకు కథలు వినడం, చదవడం చాలా ఇష్టం కదా! మరి కథలు అనేవి టైమ్‌పాస్‌ కోసమే కాదు కదా....మన జీవితంలో ఎన్నో సమస్యలు, వాటి పరిష్కారాలు కథలలో ఉంటాయి. అందుకే మ్యాథ్స్‌ను కథలతో పోలుస్తారు.

గణిత కథలు
మ్యాథ్స్‌ అంటే బోలెడు భయం ఉన్న పిల్లల్లో ఆ భయాన్ని పోగొట్టడానికి బెంగళూరులోని దిల్లీ వరల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌ గణిత విభాగం ‘మ్యాథ్స్‌ స్టోరీస్‌ రైటింగ్‌’ పేరుతో కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. ఈ ప్రయోగం సూపర్‌గా సక్సెస్‌ అయింది. ఎప్పుడూ చురుగ్గా, హుషారుగా ఉండే అమిత్‌ మ్యాథ్స్‌ క్లాస్‌లో మాత్రం సైలెంటై΄ోతాడు. రాక్షసుడు ఉన్న గుహలో కూర్చున్నట్లు భయం భయంగా కనిపిస్తాడు. అయితే ‘కథలతో గణితం’ ప్రయోగం అమిత్‌లో ఎంతో మార్పు తెచ్చింది.

‘సంకలనాలు అంటే ఏమిటి?’
‘సంఖ్యలకు ఎందుకు అంతం లేదు?’‘ఆకారాలకు(షేప్స్‌) నిర్దిష్టమైన పేర్లు ఎందుకు పెట్టారు?’... ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు అడుగుతున్నాడు అమిత్‌. అంతేకాదు చిన్న చిన్న బొమ్మలు గీయడం, పదవినోదాలను సరైన వాక్యాలతో పూర్తి చేయడం ద్వారా మెల్లగా మ్యాథ్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్డాడు.

కాన్సెప్ట్‌లే కథలుగా....
దిల్లీ వరల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌ స్కూల్‌ ఇన్‌–హౌజ్‌ పబ్లికేషన్‌ ‘అసైన్‌మెంట్‌ బుక్‌లెట్‌’లో స్టూడెంట్స్‌ కోసం మ్యాథ్స్‌ స్టోరీస్‌ ఉంటాయి. మ్యాథ్స్‌ కాన్సెప్ట్‌ను ఉపయోగించి కథ రాయాల్సిందిగా పిల్లలకు చెబుతుంటారు. గణిత కథల ద్వారా చాలామంది విద్యార్థులలో మార్పు వచ్చింది. ఏదైనా ప్రాబ్లం ఇవ్వగానే భయపడ కుండా నింపాదిగా ఆలోచిస్తున్నారు. మ్యాథ్స్‌ ప్రాబ్లమ్‌ను జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. 

ఉదాహరణకు...వైశాల్యం ఆధారిత సమస్యలను (ఏరియా–బేస్డ్‌ ప్రాబ్లమ్స్‌) పరిష్కరించాల్సి వస్తే చిన్న చిన్న బొమ్మలు గీస్తారు. వాటిని కథలలోని క్యారెక్టర్‌లుగా ఊహించుకుంటారు. నిజజీవిత పరిస్థితులకు అన్వయించుకుంటూ వాటిని సాల్వ్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. టి.వి. పద్మ ‘మ్యాథెమా‘ట్విస్ట్‌’: నంబర్‌ టేల్స్‌ ఫ్రమ్‌ అరౌండ్‌ ది వరల్డ్‌’, అర్చన శరత్‌ ‘టేల్స్‌ ఫ్రమ్‌ ది హిస్టరీ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌’... కథలతో మ్యాథ్స్‌ను ఆసక్తికరంగా పరిచయం చేసే పుస్తకాలు.

భాంజు... ట్రబుల్‌ షూటర్‌
మ్యాథ్స్‌ యాంగ్జయిటీ అనేది ఎంతోమంది పిల్లలు ఎదుర్కొంటున్న సమస్య. ఆ ఆందోళనను పిల్లల నుంచి దూరం చేయడానికి తన ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ ‘భాంజు’తో శ్రీకారం చుట్టారు నీలకంఠ భానుప్రకాష్‌. పాత రికార్డ్‌లు బద్దలు కొట్టి కొత్త రికార్డ్‌లు సృష్టించడం ఆయన ఘనత. ‘గణితం కొందరి కోసం కాదు అందరి కోసం’ అనే లక్ష్యంతో నీలకంఠ ప్రారంభించిన ‘భాంజు’ గణిత అభ్యాస వేదిక. ఇంటరాక్టివ్‌ టీచింగ్, పజిల్స్, మెంటల్‌ కాలిక్యులేషన్‌ టెక్నిక్స్‌... మొదలైన వాటి ద్వారా సరదా సరదాగా మ్యాథ్స్‌ నేర్చుకోవడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ‘భాంజు’ ఉపయోగపడుతుంది. ‘భాంజు’కు సంబంధించి...

లైవ్‌ ఆన్‌లైన్‌ క్లాసులు: కథలు, రియల్‌లైఫ్‌ ఎగ్జాంపుల్స్, చాలెంజెస్, ఆటల ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా గణిత పాఠాలు చెబుతారు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. భాంజు బడ్డీ: ఇన్‌స్టంట్‌ ఎక్స్‌ప్లనేషన్స్, రియల్‌–టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ కోసం ఏర్పాటైన 24/7 ఏఐ–పవర్డ్‌ అసిస్టెంట్‌. భాంజు ప్లే యాప్‌: గేమిఫైడ్‌ డైలీ ప్రాక్టిస్, పోటీలు, లీడర్‌ బోర్డులు, కాయిన్స్‌ అండ్‌ రివార్స్‌ కోసం. పేరెంట్‌ యాప్‌: షెడ్యూల్స్, టీచర్‌ ఫీడ్‌బ్యాక్, కాంగ్రెస్‌ను మానిటరింగ్‌ చేస్తుంది.

సరదా సరదాగా...
బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక రీమ అయిదు సంవత్సరాల వయసులో తండ్రి ద్వారా ఒకటి నుంచి ఇరవై వరకు లెక్కించడం నేర్చుకుంది. ఇక అప్పటినుంచి ఆ అమ్మాయికి అంకెలే లోకం అయ్యాయి. తమ పెరటితోటలో వికసించే పువ్వుల సంఖ్య, ఆ పువ్వుల దగ్గరకు వచ్చే సీతాకోక చిలుకల సంఖ్య, కిందపడిన రొట్టెముక్కల చుట్టూ పాకే చీమల సంఖ్య... మొదలైనవి రోజూ లెక్కించేది. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ‘ఇప్పటి వరకు 50 కిలోమీటర్‌ల దూరం వచ్చాం. 

ఇంకా ఎన్ని కిలోమీటర్‌లు ప్రయాణం చేస్తే మనం చేరాల్సిన ఊరుకు చేరుతాం’ లాంటి ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేది. మీకు చెప్పేదేమిటంటే... మ్యాథ్స్‌ను సీరియస్‌గా కాదు, సరదా సరదాగా నేర్చుకోవాలి. మ్యాథ్స్‌ కాన్సెప్ట్‌లు బాగా గుర్తుండి పోవాలంటే... రీమలాగే మీరు కూడా ఎక్కడో ఒకచోట కూడికలు, తీసివేతలు, గుణకారాలు... మొదలైన వాటిని ఉపయోగిస్తుండాలి. 
– యాకూబ్‌

(చదవండి: వేసవి సెలవులను ఇలా వినియోగించుకుందామా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement