
బస్సెక్కినా రైలెక్కినా విమానం ఎక్కినా మనకు కావలసింది ఏది? కిటికీ పక్కన సీటు? ఎందుకు? బయటకు చూస్తుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? కొత్త ప్రాంతాలు కాబట్టి. పిల్లలూ... మనిషి పుట్టింది ఉన్న చోట ఉండటానికి కాదు. ప్రయాణించడానికి. తిరిగి లోకం చూడాలి. కొత్త మనుషులను కలవాలి. ప్రయాణాల్లో ఏం చూశారో, ఏం తెలుసుకున్నారో రాయాలి. అప్పుడు మీరు ‘ట్రావెల్ రైటర్’ అవుతారు. ‘యాత్రికుడు’ అనిపించుకుంటారు.
పిల్లలూ! వేసవి సెలవుల్లో అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏదో ఒక ఊరు తీసుకెళతారు. కొత్త ప్రదేశాలు చూపిస్తారు. మీరు అక్కడి వింతలు, విశేషాలు చూసి ఆనందిస్తారు. కొన్ని ఫొటోలు దిగి, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అక్కడితో ఆ పర్యటన ఓ గుర్తుగా మారుతుంది. అంతటితో సరేనా? దాన్ని మరింత పదిలం చేసుకోవాలని మీకు ఉండదా? మరి దానికేంటి మార్గం? ఒక్కటే. మీ పర్యటనలో మీకు ఎదురైన అనుభవాలను రాయడం. వాటిని రికార్డు చేసి పదిలంగా దాచుకోవడం.
ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు రాయాలి?
ట్రావెలర్స్ ట్రావెల్ చేసి పొందిన అనుభవాలను రాయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎంతోమంది తాము చేసిన యాత్రల వివరాలు, విశేషాలను పుస్తకాల రూపంలో రాశారు. వాటిని ‘యాత్రా కథనాలు’ అంటారు. వాటిని చదవడం వల్ల అక్కడకు పోలేని వారికి ఆ ప్రాంతాల చరిత్ర, విశిష్టత, కల్చర్, లైఫ్‌స్టైల్ గురించి అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రదేశాల్లో ఉండే వైవిధ్యం తెలుస్తుంది. ఇదే మీరూ చేయొచ్చు. మీరు చూసిన ప్రదేశాల తాలూకు విశేషాలను వ్యాసంగా రాయొచ్చు. దాన్ని మీ స్నేహితులకు, టీచర్లకు చూపించొచ్చు. దీనివల్ల మీ అనుభవాలకు విలువ ఏర్పడుతుంది. అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.
యాత్రాకథనాలు రాయడం వల్ల కలిగే లాభాలు
యాత్రాకథనాలు రాయడంలో మీ ఎక్స్‌ప్రెషన్‌దీ లాంగ్వేజ్‌దీ కీలకమైన పాత్ర. కొత్త ప్రాంతంలో మనకు ఎదురైన అనుభవాలను మన మాటల్లో పెట్టడం వల్ల మనసులోని భావాలను ఎలా వ్యక్తీకరించాలో తెలుస్తుంది. దీనివల్ల స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. నచ్చింది నచ్చనిది చెప్పడం చేతనవుతుంది. ఉదాహరణకు మీరు ఊటీ వెళ్లారనుకోండి. క్యాబ్‌డ్రైవర్ మీతో మంచిగా వ్యవహరిస్తే ఆ సంగతి రాస్తారు. ర్యాష్‌గా ఉంటే ‘ఊటి వెళ్లినప్పుడు మీరు సరైన డ్రైవర్‌ను ఎంచుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు’ అని రాస్తారు. అది చదివి మిగిలిన వారు అలర్ట్ అవుతారు.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
మీరు ట్రావెలింగ్‌లో చూసిన విషయాలు అప్పటికప్పుడు పుస్తకంలో రాసుకోవచ్చు లేదా వాటిని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు. లేదా అక్కడే చిన్నచిన్న పాయింట్ల రూపంలో రాసుకొని, ఇంటికి వచ్చాక విస్తరించి రాయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీ ఆలోచనాధోరణి పదునెక్కుతుంది.
చారిత్రక, సాంస్కృతిక అవగాహన
మీరు చూసిన ప్రదేశాల గురించి రాయాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశాల గురించి గూగుల్ చేస్తారు. మీరు చూసిన చోటు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు రెండు రోజులు హంపీ చూసి వస్తారు. ఆ ప్లేస్ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. గూగుల్ చేసి యూట్యూబ్ ద్వారా హంపి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల ఆ ప్రదేశాల చరిత్ర, సాంస్కృతిక విశేషాలు తెలుసుకుంటారు. ఇది మీకెంతో మేలు చేస్తుంది.
నేరుగా తెలుస్తుంది
ఎప్పుడూ స్వీట్ తినని వారికి ఎంత చెప్పినా స్వీట్ అంటే ఏంటో తెలియదు. కేరళ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోలు చూసినా నేరుగా చూడటంలోని మజా రాదు. కేరళ వెళితే హౌస్‌బోట్‌లో తిరుగుతున్నప్పుడు ఆ బ్యాక్‌వాటర్స్‌లో ఎంత బాగుంటుందో అనుభవించి రాస్తే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది.
ప్రపంచంలో గొప్ప వారంతా నెలలో, మూడు నెలలకోసారి ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళతారు. ఎందుకంటే తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ ట్రావెలర్స్ ఎందరో తిరుగుతూ వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నారు కూడా. వేసవి సెలవులన్నీ నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్స్ చదువుతూ వృథా చేయకండి. కిటికీ పక్కన ఒక్కసారైనా కూచోండి. కదలండి.
– కె.
(చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)