
వెన్నెల్లో హాయి.. హాయి.. మల్లెల్లో హాయి హాయి.. వరాల జల్లే కురిసే.. తప్పేట్లు హాయి హాయి తృమ్పేట్లు హాయి హాయి.. ఇవ్వాళ మనసే మురిసే.. మే నెల్లో ఎండ హాయి ఆగష్టు లో వాన హాయి.. జనవరిలో మంచు హాయి.. హాయి రామ హాయి.. హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి.. ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో.. సరైన ప్రణాళికతో జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలోనూ అంతే హాయిగా ఉంటుందంటున్నారు నిపుణులు.. భాగ్యనగరంలో ప్రస్తుతం వర్షాలు ముసురుకున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి.. – సాక్షి, సిటీబ్యూరో
గజిబిజి నగర జీవన శైలి.. వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవైపు ముసురుకున్న వర్షాలతో తేమ బురద వాతావరణం. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు.. వీటికి మించి ఆరోగ్య సమస్యలు.. ఈ నేపథ్యంలో చక్కని చిట్కాలు పటిస్తే వీటి నుంచి ఇట్టే పరిష్కారం లభిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. వీటిని ఓ సమస్యగా కాకుండా జీవనశైలిలో భాగంగా మార్చుకుంటే శ్రేయస్కరం.. ఇందులో భాగంగా నగరవాసులకు పలు చిట్కాలు..
ట్రావెల్ అండ్ వర్క్ లైఫ్..
నగరంలో వర్షాకాలం అనగానే ట్రాఫిక్ కష్టాలు తప్పవు.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వర్షపు నీరు, వాహనాల బ్రేక్‌డౌన్లు సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలతో పాటు వర్షం తడవాల్సిన పరిస్థితి ఉండదు.. పైగా సమయం కూడా ఆదా అవుతుంది
ఇంటి పరిసరాలపై శ్రద్ధ : వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి చుట్టూ నిరు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. పైప్‌లైన్లు బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేసుకోవాలి. మేడపై కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే డెయ్రిన్లలోని చెత్తను తొలగించుకోవడం ఉత్తమం.
దీంతోపాటు విద్యుత్ వైర్లు, మీర్ల వద్ద తేమ లేకుండా చూసుకోవాలి. ఇన్వర్టర్లు, టార్చ్‌లైట్లు, బ్యాటరీ బ్యాకప్ప్ చెక్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు పవర్ బ్యాంక్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటి ఆహారం, స్ట్రీట్ ఫుడ్ ఎంత మేరకు నివారిస్తే అంత మంచిది.
సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత..: వీధిపక్కన దొరికేకే ఆహారానికి దూరంగా ఉండాలి.. ఇంట్లో చల్లని వాతావరణానికి తగినట్లు వేడివేడిగా వెజ్ సూప్స్, ఉల్లిపాయ పకోడి, అల్లం టీ వంటి హీటింగ్ ఫుడ్స్ వల్లఆ హ్లాదంతో పాటు ఆరోగ్య సొంతం.
నీరు తాగడంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వేడి నీరు, శుద్ధి చేసిన నీటిని తాగడం మంచిది. వర్షాకాలంలో తీసుకునే ఆహారం చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపుతాయి. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.
వర్షా కాలపు ఫ్యాషన్ టిప్స్.. : వర్షంలో మన ఫ్యాషన్ కూడా మారాలి. స్టైలిష్ ఉండే సమయంలో ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించాలి.. వర్ష నిరోధక/వాటర్ ఫ్రూఫ్ షూస్, అనువుగా ఉండే రబ్బరు చెప్పులు సౌకర్యవంతంగా ఉంటాయి. సింథటిక్ లేదా డ్రై–ఫిట్ డ్రెస్సులు వేసుకుంటే తడవడం, ఆరిపోవడం తేలిక. లెదర్ బ్యాగ్స్‌కు బదులుగా వాటర్‌ప్రూఫ్ బ్యాగ్స్ ఎంచుకోవాలి. ల్యాప్‌టాప్ బ్యాక్స్‌కి కూడా వాటర్‌ప్రూఫ్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించాలి.
ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేని వారు ఎంఎంటీఎస్, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఆశ్రయించడం ఉత్తమం.
ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వర్షాలతో సంబంధం లేకుండా వాహనాల్లో రెయిన్ కోట్స్, గొడుగు, అదనపు మాస్క్, టవల్ క్యారీ చేయడం మంచిది.
మైండ్‌ఫుల్ లివింగ్..
వర్షం మనసుకు ప్రశాంతతను, నూతనోత్సాహాన్ని తెస్తుంది. వర్షాన్ని కాఫీ కప్పుతో ఆస్వాదిస్తూ బుక్స్ చదవడం, ఇంట్లో గేమ్స్ ఆడడం, ఫ్యామిలీతో టైమ్ గడపడం లాంటి చిన్న విషయాలు జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుతాయి. ఒక రకంగా వర్షాలు వరద బీభత్సాలే.. కాకుండా ఒక్కసారిగా పరిసరాలను శుభ్రం కూడా చేస్తాయి. ఫలితంగా ప్రకృతి ప్రదేశాలకు పచ్చదనాన్ని అందుతాయి. అయితే సరైన జాగ్రత్తలు లేకపోతే సమస్యలే ఎక్కువ ఇబ్బందిపెడతాయి. ముఖ్యంగా హైదరాబాదీయులు ఈ వర్ష కాలాన్ని ఒక లైఫ్‌స్టైల్ ఫెస్టివల్‌గా మార్చుకుంటే.. ఈ కాలమెంతో మధురంగా మారుతుంది.
ఇదీ చదవండి: నో జిమ్, ఓన్లీ చాట్‌జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గిన మెరుపు తీగ