Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన

Sree Lakshmi Reddy: Social Worker Mobile Counselling In Hyderabad - Sakshi

సామాజిక  సేవాలక్ష్మి

Sree Lakshmi Reddy: Social Worker Mobile Counselling In Hyderabad: ‘పని చేసే చేతికి తీరిక ఉండదు... పని చేయని మనిషికి పని కనిపించదు’ ఈ నానుడిని నిజం చేస్తోంది లక్ష్మక్క. సామాజిక కార్యకర్తగా దశాబ్దాల సేవ ఆమెది. కష్టంలో ఉన్న మహిళలకు సహాయం చేయడానికి ఇప్పుడామె... స్వయంగా కదలి వెళ్తోంది. ‘శ్రీలక్ష్మి స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌’ తో 1997లో మొదలైన శ్రీలక్ష్మిరెడ్డి సోషల్‌ సర్వీస్‌ మొబైల్‌ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ రూపంలో విస్తరించింది.

ఇన్నాళ్లూ ఆమె హైదరాబాద్, హిమాయత్‌ నగర్‌లో ఆఫీస్‌లో ఉండి, వచ్చిన వాళ్లకు ఉచితంగా సర్వీస్‌ ఇచ్చారు, స్కిల్‌ ట్రైనింగ్‌ ఇచ్చి వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకు చేయూత అయ్యారు. కొంతమంది ఆమె ఫోన్‌ నంబరు తెలుసుకుని ఫోన్‌ చేస్తారు. తమ కష్టమంతా చెప్పుకుంటారు. వాళ్లలో తాము నివసించే కాలనీ దాటి శ్రీలక్ష్మి దగ్గరకు రావడం కూడా చేతకాని అమాయకులు, దారి ఖర్చులకు డబ్బులు లేని వాళ్లు ఎందరో!

‘వాళ్లను అలా వదిలేస్తే నేను ఇస్తున్న సర్వీస్‌కి పరిపూర్ణత ఎలా వస్తుంది?... అని చాలా సార్లు అనిపించేది. అందుకే మా అమ్మ ఆరవ వర్థంతి సందర్భం గా నవంబర్‌ 26వ తేదీన ‘అల్లారెడ్డి కమలమ్మ – వెంకు రెడ్డి మొబైల్‌ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌’ పేరుతో సంచార కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించాను’ అని చెప్పారు శ్రీలక్ష్మి. 

పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌!
‘‘కలహాలు లేని కాపురం ఉండబోదు. కలహం వస్తే విడిపోవడమే పరిష్కారం కాదు. చక్కదిద్దుకోవడానికి ఉన్న అన్ని దారులనూ అన్వేషించాలి. కలిసి ఉండడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలి. విడిపోవడం అనేది విధిలేని పరిస్థితుల్లో చివరి ఎంపిక కావాలి తప్ప తొలి ఎంపిక కాకూడదు... అని సమాధాన పరచాల్సి వస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలకు రూట్‌కాజ్‌కు వైద్యం చేయాలనుకుని, ప్రీ మ్యారిటల్‌ కౌన్సెలింగ్‌ కూడా మొదలుపెట్టాను.

పెళ్లయిన తర్వాత భార్యగా నీ బాధ్యతలను మర్చిపోకూడదు, అలాగే భర్తగా అతడి బాధ్యతల గురించి హెచ్చరించగలగాలి... అని అమ్మాయిలకు పాఠంలా చెప్పాల్సి వస్తోంది. ఇంట్లో పెద్దవాళ్లకు ఇవన్నీ చెప్పే తీరిక ఉండడం లేదు. అలాగే ఇంట్లో వాళ్లు అన్నింటినీ చెప్పలేరు కూడా. అందుకే ఆ బాధ్యతను నేను తీసుకున్నాను’’ అని చెప్పారు శ్రీలక్ష్మి.

నేర్చుకున్నాను... నేర్పిస్తున్నాను!
‘మహిళలు స్వయం సమృద్ధి సాధించాలంటే వాళ్లకు ఏదో ఒక పనిలో నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఫినాయిల్‌ తయారీ నుంచి, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వరకు పాతిక రకాలలో శిక్షణ తీసుకున్నాను. మహిళలకు స్కిల్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నాను’ అని కూడా చెప్పారామె. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ గదికి పక్కనే ఉన్న మరో గదిలో మహిళలకు జాక్‌ మెషీన్‌ల మీద ఫ్యాషన్‌ డిజైనింగ్‌ క్లాసులు జరుగుతున్నాయి. వారిలో ఓ యువతి తన రెండేళ్ల బిడ్డను ఒక సోఫాలో పడుకోబెట్టి తాను పని నేర్చుకుంటోంది.    

అమ్మ వంటి అక్క ఉంది
మొబైల్‌ కౌన్సెలింగ్‌ కోసం హైదరాబాద్‌లో చార్మినార్, దోమల్‌గూడ, నారాయణగూడ వెళ్లాను. సమస్యలకు దగ్గరగా వెళ్లినకొద్దీ ఇలాంటి సర్వీస్‌ ఎంత అవసరం ఉందో అర్థమవుతోంది. నేను ఒక్కదాన్ని ఎంత చేసినా నూరోవంతు కూడా పూర్తికాదు. నాకిప్పుడు యాభై ఆరేళ్లు. నేను సర్వీస్‌ నుంచి రిటైర్‌ అయ్యే లోపు నాలాగ ఉచితంగా సర్వీస్‌ ఇచ్చే మరికొందరిని తయారు చేస్తాను.

నాకు రామకృష్ణ మఠంలో అలవడిన సమాజసేవ ఇది. కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటే సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని నమ్మే స్కూల్‌లో శిక్షణ పొందాను. అందుకే నా సర్వీస్‌ అంతా కుటుంబ బంధాలను పటిష్టం చేయడం కోసమే సాగుతుంది. 
– శ్రీలక్ష్మి రెడ్డి, సామాజిక కార్యకర్త 
చదవండి: Yamini Mazumdar: ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం చేస్తూ..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top