Yamini Mazumdar: ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం చేస్తూ..

Kiran Mazumdar Mother Yamini Mazumdar Inspirational Journey In Telugu - Sakshi

మదర్‌ మజుందార్‌@ 90

Kiran Mazumdar Mother Yamini Mazumdar Inspirational Journey In Telugu: యామినీ మజుందార్‌... ఈ పేరు మనకు పరిచయం లేదు. కానీ ఎప్పుడో విన్న పేరే అనిపిస్తుంది. నిజమే... బయోకాన్‌ ఫౌండర్, చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తల్లి యామినీ ముజుందార్‌. ఆమె జీవితంలో ఎక్కువ కాలం గృహిణిగానే గడిచిపోయింది. ఎంట్రప్రెన్యూర్‌గా మారాల్సిన అత్యయిక పరిస్థితిని కల్పించింది జీవితం. అది కూడా 58 ఏళ్ల వయసులో.

ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యే వయసులో కెరీర్‌ నిర్మాణం చేసుకున్నారామె. భర్త మరణం తర్వాత తనకంటూ ఒక ఉపాధి మార్గాన్ని ఏర్పరుచుకోవాల్సిన అవసరం అది. పెద్దగా చదువుకున్నది లేదు. కొత్తగా ఏదైనా చేయాలంటే నేర్చుకునే సమయం కూడా ఇవ్వలేదు జీవితం. ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం పెట్టారామె. అదే జీవ్స్‌ డ్రై క్లీనింగ్‌ సర్వీస్‌. 

పన్నెండు గంటల పని
లాండ్రీ బిజినెస్‌ పెట్టీ పెట్టగానే అంతా సవ్యంగా ఏమీ జరగలేదు. అలాగని ఆమె వెనుకడుగు వేయలేదు. ఆమె లాండ్రీ పెట్టిన 1990లో మనదేశంలో అందుబాటులో లేని హై ఎండ్‌ ఎక్విప్‌మెంట్‌ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఐదుగురు ఉద్యోగులతో పని చేయించుకుంటూ ఆమె రోజుకు పన్నెండు గంటలు పనిలోనే ఉండేవారు. అలా ఓ దశాబ్దం పాటు పడిన శ్రమతో అప్పుల నుంచి బయటపడ్డారామె.

‘‘పని లేకుండా నిరుపయోగంగా రోజును గడపడం నాకు నచ్చదు. వయసు ఒక నంబర్‌ మాత్రమే. పని చేయాలనే సంకల్పం ఉంటే వయసు లెక్క కానే కాదు. ఇప్పటికీ రోజుకు నాలుగు గంటల సేపు లాండ్రీ యూనిట్‌లో ఉంటాను. నలభై మంది ఉద్యోగులు పని చేస్తున్నారిప్పుడు. కోవిడ్‌ సమయంలో పనులు ఆపేశాం. ఇప్పుడు అంతా గాడిలో పడినట్లే. అన్నీ యథావిథిగా జరుగుతున్నాయి’’ అంటారు యామినీ మజుందార్‌. కోవిడ్‌ కారణంగా యూనిట్‌ తాత్కాలికంగా పని లేకుండా మూతపడిన సమయంలో కూడా ఉద్యోగులందరికీ జీతంలో ఏ మాత్రం కోత లేకుండా పూర్తి వేతనాన్ని ఇచ్చారామె. 

చైతన్యమే ఆమె శక్తి
యామినీ మజుందార్‌కి ఇప్పుడు తొంభై ఏళ్లు. రోజూ న్యూస్‌ చూస్తారు. క్రికెట్‌ మ్యాచ్‌ వస్తుంటే టీవీ ముందు నుంచి కదలరు. ‘నేను టీవీ చూడాల్సిన పని లేదు. మ్యాచ్‌లో స్కోర్‌ నుంచి వార్తల వరకు గంటగంట కూ అప్‌డేట్‌ ఇస్తుంటుంది అమ్మ’ అని చెబుతారు కిరణ్‌ మజుందార్‌ షా. యామినీ మజుందార్‌ ఎంత చురుగ్గా, చైతన్యవంతంగా జీవిస్తున్నారో చెప్పే మరో సంఘటన మూడేళ్ల కిందట చోటు చేసుకుంది.

అది 2018 మే నెల 12వ తేదీ. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల రోజు. యామిని పోలింగ్‌ బూత్‌ కెళ్లి వోటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకు గుర్తును చూపిస్తూ ‘వోటు వేయడం నా హక్కు. నా హక్కును వినియోగించుకున్నాను. అది పౌరులుగా మన బాధ్యత. మనం వోటు వేయకపోతే ఇక ప్రజాస్వామ్యానికి, ఎన్నికలకు అర్థం ఏముంటుంది?’ అని వోటు హక్కు వినియోగం గురించిన సందేశం ఇచ్చారు.

చదవండి: How To Secure Digital Payment Transactions: రెస్టారెంట్‌కు వెళ్లిన గీతకు షాకిచ్చిన వెయిటర్‌.. ఏకంగా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top