అక్షరాలా సహాయం

Special Story About Viral Video Of Joya And Tanvir From Tamil Nadu - Sakshi

చదువు

తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ అన్నాచెల్లికి ఎదురైన కరోనా కష్టాల గురించి జూలై 24వ తేదీన ఒక వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయింది. ఆ వీడియోలో కోయంబత్తూరులోని మరుధామలైకి చెందిన ఆరేళ్ల జోయ, ఏడేళ్ల తన్వీర్‌ అక్షరాలు కొనడానికి రోడ్డు మీద పూలమ్ముతున్నారు. చక్కగా గులాబీ రంగు ముఖమల్‌ డ్రస్‌ వేసుకుని అదే రంగు క్యాప్‌ పెట్టుకున్న జోయ, నీలం రంగు డ్రస్, అదే రంగు క్యాప్‌తో తన్వీర్‌ పూల కవర్లు పట్టుకుని రోడ్డు మీద వచ్చే కార్లు, బైకు చోదకులను ఆకర్షిస్తున్నారు. పిల్లలు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. ఎర్రటి ఎండలో రోడ్డు మీద నిలబడి వచ్చే వాహనాలను ఆపి పూలు కొనమని అడుగుతున్నారు. వాళ్లకు కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి కూర్చుని పూలను చిన్న చిన్న కవర్లలో పోస్తున్నాడు.

అతడి పేరు షబ్బీర్‌. ఆ పిల్లల తండ్రి. ‘చిన్న పిల్లల చేత పూలమ్మించడం ఏమిటి’ అని అడిగిన వాళ్లకు అతడు చెబుతున్న సమాధానం ఆన్‌లైన్‌ క్లాసులు. ‘‘నేను రైళ్లలో పైనాపిల్‌ ముక్కలు, ఇతర చిరుతిండ్లు అమ్మేవాడిని. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా రైళ్లు లేవు, తిరుగుతున్న రైళ్లలో కూడా మాలాంటి చిరుతిండి అమ్ముకునే వాళ్లకు అనుమతి లేదు. బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా! అందుకే పూలమ్ముతున్నాను. లాక్‌డౌన్‌ నుంచి పరిస్థితి చక్కబడే లోపు స్కూళ్ల వాళ్లు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తున్నారు. ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. నాకు మరో మార్గం కనిపించలేదు’’ అన్నాడు షబ్బీర్‌.

ఆ వీడియో చూసి చాలా మంది సామాన్యులతోపాటు ధర్మపురి పార్లమెంట్‌ సభ్యుడు సెంథిల్‌ కుమార్‌ కూడా స్పందించారు. పిల్లల ఫీజులు కట్టడానికి ముందుకు వచ్చారు. సోమవారం సాయంత్రానికి షబ్బీర్‌ బ్యాంకు అకౌంట్‌లో ఒక లక్షా ముప్పై ఆరు వేల రూపాయలు జమయ్యాయి. జోయ, తన్వీర్‌ చదువు కోసం ఆర్థిక సహాయం చేసిన వాళ్లు షబ్బీర్‌కు ‘‘ఎంత కష్టమైనా సరే, తండ్రిగా నువ్వు శ్రమ పడు. అంతేకాని పిల్లలను రోడ్డు మీదకు తీసుకురావద్దు’’ అని హితవు పలికారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top