
జడ్చర్ల టౌన్: విద్యుదాఘాతంతో గాయపడిన జెర్రిపోతుకు సర్ప రక్షకుడు సదాశివయ్య బుధవారం చికిత్స చేసి కాపాడారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీలక్ష్మి రాజేంద్రనగర్ ఇండస్ట్రీలో పవర్ బోర్డులోకి జెర్రిపోతు చేరడంతో విద్యుదాఘాతానికి గురైంది.
ఇది గమనించిన ఇండస్ట్రీ యజమాని సర్ప రక్షకుడు (Snake Saver) సదాశివయ్యకు సమాచారం అందించాడు. దీంతో ఆయన బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య సంరక్షణ కేంద్రంలో చికిత్స చేశారు. ప్రస్తుతం జెర్రిపోతు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయుడు
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి (parvathagiri) మండలంలోని రావూరు ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐదుగురు విద్యార్థులు ఉండే విధంగా ఉపాధ్యాయుడు చూడాలని కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎంఈఓ ఆదేశించారు. అయినా ఆ పాఠశాలకు ఐదుగురు విద్యార్థులు రాలేకపోయారు.

పాఠశాలను తీసేద్దామనుకున్న క్రమంలో ఒక విద్యార్థి చేరగా ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. పాఠశాలను గ్రామంలో ఉంచే విధంగా గ్రామస్తులు తీర్మానం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులను పెంచే విధంగా కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు.