మహిళల ఉన్నతే తెలంగాణ అభివృద్ధి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
మన్ననూర్: రాష్ట్రంలోని మహిళల ఉన్నతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలోని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, పీడితవర్గాల ఆశాజ్యోతి ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహాలకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఇంటి వద్ద వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, పీఆర్‌ఓ మీడియా చైర్మన్ రామ్మోహన్‌రావు, ఉమామహేశ్వర ఆలయ కమిటీ డైరెక్టర్ సంభు శోభతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ అందరికి రాజ్యాంగ ఫలాలు అందని దుస్థితి ఉందన్నారు. ఈ క్రమంలో నల్లమల బిడ్డ రేవంత్‌రెడ్డి అంబేడ్కర్, నెహ్రూ కలలను సాకారం చేసేందుకు తనవంతు ప్రయత్నం వచ్చిరాగానే పేదల అభ్యున్నతే ధ్యేయంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగించే క్రమంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్‌కార్డుల తర్వాత మళ్లీ ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్న సంపదను పంచుకునే విషయంలో వారి కుటుంబంలోని ఆడబిడ్డ రొడ్డెక్కే పరిస్థితి దాపురించిందన్నారు. ఒకే కుటుంబంలోనే పొంతనలేకపోగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆవాకులు చివాకులు పేల్చుతుంటే ప్రజలు గమనిస్తున్నారన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తి, భారత రాజ్యాంగం విలువలను కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పాలన అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అమ్రాబాద్ మండల నాయకులు హరినానాయణ, ఎంఏ రహీం, సురేశ్, వెంకటరమణ, సంతోష్, హన్మంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజారాం, శంకరయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


