యువకుడి బలవన్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఓ యువకుడు బుధవారం అద్దెకు ఉంటున్న గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్య కథనం ప్రకారం.. అన్నాసాగర్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన కపిల చరణ్ (20) ఆరు నెలలుగా జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటూ ట్రాక్టర్ వర్క్‌షాప్ దుకాణంలో రోజు కూలీగా పని చేస్తుండేవాడు. కొంతకాలంగా చరణ్ వెన్నుముక సమస్యతో ఇబ్బందులు పడుతుండటంతో పాటు ఒంటరిగా గడపడంతో మనస్థాపానికి గురై బుధవారం తాను అద్దెకు ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
మొక్కజొన్న కుప్పకు తగిలి వ్యక్తి మృతి
తాడూరు: బైక్‌పై వస్తుండగా రోడ్డుపైనే ఉంచిన మొక్కజొన్న కుప్పకు తగిలి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన తాడురు మండలం గుంతకోడూరు శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గురుస్వామి కథనం ప్రకారం.. తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన మీసాల రాములు(40), మీసాల బాలస్వామి కల్వకుర్తి మండలం జాజలలోని బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా గుంతకోడూరు సమీపంలో రోడ్డుపైనే వేసిన మొక్కజొన్న కుప్పకు తగిలి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో మీసాల రాములు అక్కడిక్కడే మృతిచెందగా, బాలస్వామి గాయాలతో బయటపడ్డాడు. రాములుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ట్రాక్టర్ కిందపడి
వలస కూలీ మృతి
తాడూరు: మండల కేంద్రం శివారులో వలస కూలీ మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గురుస్వామి కథనం ప్రకారం.. కర్నూల్ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన హుస్సేన్(30) భార్య లలితతో కలిసి పత్తి తీసేందుకు తెలకపల్లి మండల తాల్లపల్లి, పుల్జాల, మల్కాపూర్ వెళ్లేవారు. వలస కూలీ కావడంతో హుస్సేన్ తాల్లపల్లి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఎక్కుతుండగా.. అదుపుతప్పి వెనుక టైర్ కిందపడి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నదిలో దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం
ఎర్రవల్లి: అయ్యప్ప మాలధారణతో ఉన్న ఓ యువకుడు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్ కథనం ప్రకారం.. కర్నూల్ జిల్లాకు చెందిన సూర్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురై బుధవారం బీచుపల్లి వద్ద కృష్ణానదిలోకి దూకాడు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మత్స్యకారులు పుట్టీల సహాయంతో నదిలో కొట్టుకుపోతున్న సూర్యను ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి వారికి అప్పగించారు. యువకుడి ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను పోలీసులతోపాటు పలువురు అభినందించారు.
రోడ్డుప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
బిజినేపల్లి: మండలంలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ను జ్జునుజ్జయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నందివడ్డెమాన్‌కు చెందిన శ్రీనివాసులు నాగర్‌కర్నూల్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. వెంకటాపూర్ వద్ద వెనకాలే వస్తున్న కారు ప్రమాదశావత్తు బైక్‌ను ఢీ కొట్టడంతో కిందపడిపోయాడు. అదేక్షణంలో వెనకాలే వచ్చిన డీసీఎం శ్రీనివాసులును ఢీకొట్టింది. కారు, డీసీఎం ప్రమాదంలో తలకు గాయమై, నడుము భాగం నుజ్జునుజ్జయింది. తీవ్రగాయాలైన క్షతగాత్రుడిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భార్య లక్ష్మి, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
మద్యం పట్టివేత
గద్వాల క్రైం: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. గద్వాల మండలం అనంతపురానికి చెందిన నాగశేషు, శేఖర్ సూచన మేరకు బుధవారం సాయంత్రం ఆటో డ్రైవర్ నారాయణకు గద్వాల జమ్మిచేడ్ జములమ్మ ఆయల సమీపంలోని రేణుక వైన్‌షాపు నుంచి 18 కాటన్‌ల మద్యం తరలిస్తున్నట్లు సమాచా రం వచ్చింది. ఆయల శివారు ప్రాంతంలో ఆటోను అదుపులోకి తీసుకుని ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1.47లక్షలు ఉంటుందన్నా రు. ఆటో, మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు.
యువకుడి బలవన్మరణం


