కొత్త ఉల్లి రాక.. మరోసారి పడిపోయిన ధరలు
దేవరకద్ర: మార్కెట్‌కు విక్రయానికి కొత్త ఉల్లి రావడంతో ధరలు అమాంతం పడిపోయాయి. బుధవారం దేవరకద్ర మార్కెట్‌కు వివిధ గ్రామాల నుంచి వానాకాలం సాగు చేసిన కొత్త ఉల్లి అమ్మకానికి వచ్చింది. గతంలో మార్కెట్‌కు చాలారోజులపాటు పాత ఉల్లి వచ్చినా ధరలు నిలకడగా సాగాయి. కానీ, గత రెండు వారాలుగా కొత్త ఉల్లి మార్కెట్‌కు అమ్మకానికి వస్తుండడంతో ధరలు అమాంతం పడిపోయాయి. మార్కెట్‌కు వచ్చిన ఉల్లిని ఉదయం 10 గంటలకు వేలం వేయగా క్వింటాల్‌కు గరిష్టంగా రూ.600, కనిష్టంగా రూ.300 లుగా ధరలు పలికాయి. ఈ ధరలతో పెట్టిన పెట్టుబడి పక్కన పెడితే.. ఉల్లి తీసిన కూలీలు, రవాణా ఖార్చులు కూడా రావడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కేజీల ఉల్లి బస్తాను గరిష్టంగా రూ.300, కనిష్టంగా రూ.150 వరకు విక్రయించారు. ఉల్లి చాలామటుకు పచ్చిగా ఉండడంతో కేవలం హోటల్, ఇతర వ్యాపారులు అధికంగా కొనుగోలు చేశారు.


