Hot Summer: చెమట గడ్డలు, ఉడుకు గడ్డలు, నివారణ ఇలా!
May 12 2025 12:15 PM | Updated on May 12 2025 1:17 PM
వేసవిలో పెరుగుతున్న ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్
చర్మవ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
సన్‌బర్న్‌తో జాగ్రత్త అంటున్న నిపుణులు
లబ్బీపేట(విజయవాడతూర్పు) :వేసవి ఉక్కపోతకు గాలిసోకని టైట్ దుస్తులు తోడవడంతో ఎక్కువ మంది ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో చర్మవ్యాధుల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ గురైన వారు ఉంటున్నారు. టైట్ దుస్తులు, జీన్స్ వంటివి వేసుకుని పది, పన్నెండు గంటల పాటు ఉంటున్న వారిలో ఈ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. వాటికి తోడు వేసవిలో సన్‌బర్న్, సెగ గడ్డలు, రాష్ వంటివి సోకే అవకాశం ఉందంటున్నారు. నగరంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్మవ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో ఇబ్బందే వేసవిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. దీంతో చర్మవ్యాధులతో పాటు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా సన్‌బర్న్, రాష్ (చెమట పొక్కులు), చెమట గ్రంథులతో ఏర్పడే గడ్డలు(ఉడుకు గడ్డలు), ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, సన్ ఎలర్జీ, ఇతర చర్మవ్యాధులతో పాటు, మహిళలు మంగు వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఎండలో తిరిగే వారితో పాటు, ఉక్కపోత ప్రాంతాల్లో ఉండే వారు ఈ వ్యాధులతో ఇబ్బంది పడతారు ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ బిగుతుగా ఉండే వ్రస్తాలు ధరించే వారికి, స్నానం చేసిన తర్వాత చర్మాన్ని సరిగ్గా తుడుచుకోకుండా వ్రస్తాలు ధరించే వారికి ఎక్కువగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. తొడల మధ్య తామరలాగా రావడంతో పాటు, దురదలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వారు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడంతో పాటు, అనంతరం తేమ లేకుండా చర్మాన్ని శుభ్రంగా తుడిచి, వైద్యులు సూచించిన లోషన్స్ రాసి అరికట్టవచ్చు. ప్రస్తుతం ఫంగల్‌తో ఇబ్బంది పడుతూ వైద్యుల వద్దకూ క్యూ కడుతున్నారు.
సన్‌బర్న్(చర్మం కాలిపోవుట) ఎండలో ఎక్కువగా తిరిగే వారు సన్‌బర్న్‌కు గురవుతుంటారు. చర్మంపై కాలినట్లు మచ్చలు ఏర్పడతాయి. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. సన్‌బర్న్స్‌కు గురైన వెంటనే వైద్యుని సంప్రదించాలి. నీరు, పానీయాలు సేవించాలి. వైద్యుని సలహా మేరకు సన్ర్‌స్కీన్ లోషన్స్ వాడి అరికట్టవచ్చు. సెగగడ్డలు ఇవి చెమట గ్రంథులతో ఏర్పడతాయి. అధిక ఉష్ణోగ్రతల్లో ఉండే వారికి ఎక్కువగా వస్తుంటాయి. చిన్న చిన్న సెగగడ్డలుగా వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. వీటి నివారణకు క్రీమ్స్, పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి. వైద్యుని సలహా మేరకు యాంటి బయోటిక్ మందులు వాడాలి. రాష్(చెమట కాయలు) ఎండలో తిరిగే వారికి ఎక్కువగా రాష్ వస్తుంది. గాలి సోకని మందమైన దుస్తులు, సిల్క్ వస్త్రాలు ధరించిన వారు దీని బారిన పడతారు. చర్మం కందిపోయినట్లు అనిపించడం, పొక్కులు వస్తాయి.
వేసవిలో శరీరానికి మాయిశ్చరైజర్స్, సన్‌స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ఎక్కువగా ఎండకు ఎక్స్‌పోజ్ కాకుండా గొడుగు, తలకు టోపీ ధరించాలి. ముఖ్యంగా లూజు దుస్తులు, కాటన్‌వి వేసుకోవాలి.
రాత్రి వేళల్లో సైతం గాలిసోకే ప్రాంతంలో నిద్రించాలి.
గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.
స్నానం అనంతరం చర్మానికి పౌడర్ రాసుకుంటే చెమట పొక్కులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారించవచ్చు.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ సోకిన వారు వాడే టవల్స్ మరొకరు వాడితే సోకే అవకాశం ఉంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్ చేయాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తగిన జాగ్రత్తలతో చర్మ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
వేసవిలో పలుచటి లూజుగా ఉండే కాటన్ దుస్తులు వాడాలి. నీరు, నీటిశాతం ఎక్కువగా ఉండే పళ్లు తీసుకుంటే చర్మవ్యాధులు రాకుండా చూడవచ్చు.
ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్‌ను నివారించవచ్చు. జిమ్, వాకింగ్, స్పోర్ట్స్‌కు వెళ్లే వారు, ఆలస్యం చేయకుండా వెంటనే స్నానం చేయాలి.–డాక్టర్ సెంథిల్ కుమార్, చర్మవ్యాధుల నిపుణులు, మొగల్రాజపురం