
జనారణ్యంలో ఓ అమ్మాయి అన్వేషణ!
2016లో ‘లయన్’ అనే సినిమా వచ్చింది. కథానాయకుడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్. లయన్ కథకు వస్తే సరూ అనే అయిదేళ్ల పిల్లాడు ఇంటి నుంచి పారిపోయి రైలెక్కుతాడు. అది వేల కిలోమీటర్లు ప్రయాణించి కోల్‌కతా చేరుకుంటుంది. అప్పటినుంచి ఆ పిల్లాడి ఒంటరి పోరాటం మొదలవుతుంది. అక్కడ ఆ బాలుడి జీవితం రకరకాల మలుపులతో ఆఖరుకు ఒక ఆస్ట్రేలియన్ జంటకు దత్తతతో ఆస్ట్రేలియా చేరుకుంటుంది. పాతికేళ్ల తర్వాత సొంతకుటుంబాన్ని కలవాలనే తాపత్రయంతో గుప్పెడు బాల్య జ్ఞాపకాలను తోడు చేసుకుని, గూగుల్ ఎర్త్ సాయంతో తన ఇంటిని కనుక్కుంటాడు, కుటుంబాన్ని కలుసుకుంటాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అది.
సంధ్యారాణి కథా అలాంటిదే! అయితే ఆమె ఇంకా సొంత కుటుంబాన్ని కలుసుకోలేదు. అన్నం, పప్పు తిన్న లీలామాత్రపు జ్ఞాపకాలతో తల్లిదండ్రుల అన్వేషణలో ఉంది. తన కథ సుఖాంతం కావడం కోసం ఎదురు చూస్తోంది. సంధ్యారాణి చెప్పిన వివరాల ప్రకారం ఆ కథ ఎక్కడ మొదలైందంటే..
1987...
హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్ వాసి కె.రామయ్య నిజాం కాలేజ్‌లో తోటమాలి. అతనికి అబిడ్స్‌లోని పరాస్ బార్ అండ్ రెస్టారెంట్‌లో వెయిటర్ బి. రాజ్‌కుమార్‌తో స్నేహం కుదిరింది. మాటల్లో తనదీ, రాజ్‌కుమార్‌దీ ఇద్దరిదీ ఒకే కులమని తేలింది. దాంతో తన మరదలు అనసూయకు రాజ్‌కుమార్‌తో పెళ్లి చేయాలనుకుని రాజ్‌కుమార్ ని అడిగాడు. అయితే తనకు అంతకుముందే పెళ్లై, మూడేళ్ల కూతురూ ఉందని, కాకపోతే భార్య చనిపోయిందని చెప్పాడు రాజ్‌కుమార్. అయినా సరే తమ ఆర్థికపరిస్థితి దృష్ట్యా మరదలికి రాజ్‌కుమార్‌తో వివాహం జరిపించాడు రామయ్య. ముచ్చటగా మూడు నెలలు గడిచాయి. రాజ్‌కుమార్ పత్తాలేకుండా పోయాడు బిడ్డను అనసూయ దగ్గరే వదిలి. పరాస్ బార్ అండ్ రెస్టరెంట్‌కి వెళ్లి వాకబు చేశాడు రామయ్య. నెల రోజులుగా పనిలోకి రావట్లేదని చెప్పారు హోటల్ సిబ్బంది. రాజ్‌కుమార్ కోసం వెదికి వేసారిన రామయ్య.. సంధ్యను విజయనగర్ కాలనీలోని సేవా సమాజం.. బాలికా నిలయమనే అనాథాశ్రమంలో వదిలేశాడు.
1988...
సంతానం లేని స్వీడన్ జంట మిస్టర్ అండ్ మిసెస్ లిండ్‌గ్రెన్ సంధ్యారాణిని దత్తత తీసుకున్నారు. అలా స్వీడన్ వెళ్లిన సంధ్యారాణి.. ఊహ తెలిసేప్పటికి అది తన మాతృదేశం కాదని.. వాళ్లు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారనే సత్యాన్ని గ్రహించింది! పై చదువు కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో తన అసలు పేరెంట్స్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. తనది హైదరాబాద్ అని, సేవా సమాజం బాలికా నిలయం నుంచి తనను తెచ్చుకున్నామనే స్వీడన్ పేరెంట్స్ చెప్పిన విషయం తప్ప ఇంకే సమాచారమూ లేదు. కాబట్టి యూకేలో ఉంటూ హైదరాబాద్‌లో తన మూలాల కోసం చేసిన వాకబు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. దాంతో 2009లో తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చింది సంధ్య. తనను దత్తత ఇచ్చిన అనాథాశ్రమానికి వెళ్లింది. పెద్దగా వివరాలేవీ దొరకలేదు. చదువైపోయి లండన్‌లో ఉద్యోగం చేస్తూ, వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా ఒంటరి వెదుకులాట దారీతెన్నూ చూపలేదు.
2025...
జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలవాలనుకునే దత్తత పిల్లలెందరికో సహాయపడుతున్న సంస్థ.. పుణేలోని అడాప్టీ రైట్స్ కౌన్సిల్ గురించి సంధ్యకు తెలిసింది. ఆ సంస్థ డైరెక్టర్ అంజలి తారా బబన్‌రావ్ పవార్‌ని కాంటాక్ట్ చేసింది. ఆమె.. సంధ్యకు సాయం చేయడానికి సిద్ధపడింది. మొత్తానికి అంజలి సహకారంతో రామయ్యను కలుసుకోగలిగింది సంధ్య. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సంధ్య సవతి తల్లి అనసూయ చనిపోయిందని చెప్పాడు. అంతేకాదు రాజ్‌కుమార్ సొంతూరు వరంగల్ అని, అతని తోబుట్టువులు అక్కడే ఉన్నారనీ తెలిపాడు. ఆ మాత్రం ఆధారంతోనే ఆత్రంగా సంధ్య వరంగల్ ప్రయాణమైంది. అమ్మానాన్నలు కనిపిస్తే.. అంతకన్నా అదృష్టం ఉంటుందా అంటుంది నీళ్లు నిండిన కళ్లతో.
‘వరంగల్‌లో నాన్నే కాదు అమ్మా కనిపిస్తుందని ఆశ. అమ్మ చనిపోయిందని రామయ్యగారితో నాన్న చెప్పినా నాకు మాత్రం అమ్మ బతికే ఉందనిపిస్తోంది. నాలా విదేశాలకు దత్తత వెళ్లి.. సొంత తల్లిదండ్రులను కలవాలనుకుంటున్న వాళ్లెందరో! పెద్దలందరికీ నాదొకటే విన్నపం.. దయచేసి పిల్లలను విదేశీయులకు దత్తత ఇవ్వకండి. ఎంత కష్టమైనా సొంత దేశంలోనే పెరగనివ్వండి. దత్తత వెళ్లిన పిల్లలకు అక్కడ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. అమ్మానాన్నలనే కాదు సొంత ఊరు, భాష, సంస్కృతి.. ఒక్కమాటలో చెప్పాలంటే మా గుర్తింపును, ఉనికినే కోల్పోతున్నాం. దానంత నరకం ఇంకోటి లేదు. నా సంబంధీకులెవరైనా ఉండి.. నన్ను పోల్చుకోగలిగితే దయచేసి నన్ను కాంటాక్ట్ అవండి. మా అమ్మానాన్నల జాడ చెప్పండి!’
సంప్రదించాల్సిన నంబర్.. 9822206485.’’ అంటూ తన కథ చెప్పింది సంధ్య. ఆమె త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకుంటుందని ఆశిద్దాం.
– సరస్వతి రమ
– ఫొటోలు: గడిగె బాలస్వామి