
ప్రపంచ సాహస ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే వేడుకల్లో శాన్ ఫర్మిన్ ఫెస్టివల్ ముందు వరసలోనే ఉంటుంది. ఇది ప్రతి ఏడాది స్పెయిన్ లోని పాంప్లోనాలో జూలై 6 నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ ఉత్సవంలో బుల్ రన్ (ఎన్సియెర్రో) ప్రధానంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ వేడుకలో ఎద్దులను వీధుల్లోకి వదిలి, వందలాది మంది ప్రజలు వాటి వెంట పరిగెడతారు.
ఇది అత్యంత ఉత్కంఠభరితమైన పోటీ. ఉదయం 8 గంటలకు బలమైన ఎద్దులను వదులుతారు. వేలాది మంది ధైర్యవంతులు వాటి ముందు పరిగెడతారు. ఈ పరుగు అత్యంత ప్రమాదభరితమైనది. ప్రతి సంవత్సరం గాయాల పాలైనవారు చాలామంది ఉంటారు, కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంది. అయినప్పటికీ, ఈ అనుభూతిని పొందాలని చాలామంది కోరుకుంటారు.
ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు, ‘చుపింజో’ అనే ఒక రాకెట్ పేల్చడంతో పాంప్లోనా నగరం మొత్తం ఉత్సాహంతో నిండిపోతుంది. ఆ తర్వాత వారం రోజుల పాటు సంగీత కచేరీలు, సాంప్రదాయ నృత్యాలు, ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు, మతపరమైన ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలో అంతా తెలుపు ఎరుపు రంగు దుస్తులనే ధరిస్తారు. దాంతో వీధులన్నీ ఎరుపు, తెలుపు రంగుల్లో మెరుస్తాయి. మరోవైపు ‘జిగాంటెస్ జెయింట్స్’ అని పిలవబడే పెద్దపెద్ద బొమ్మలు రాజులు, రాణులు, చారిత్రక వ్యక్తుల రూపంతో నెమ్మదిగా నడుస్తూ ఊరేగింపులో పాల్గొంటాయి. వీటిని చూడటానికి పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తి చూపిస్తారు.