ఆట.. టైమ్‌ పాస్‌ కాదు! | sakshi special story about World Athletics Day and Playground Activities | Sakshi
Sakshi News home page

ఆట.. టైమ్‌ పాస్‌ కాదు!

May 7 2026 12:38 AM | Updated on May 7 2026 12:38 AM

sakshi special story about World Athletics Day and Playground Activities

నేడు వరల్డ్‌ అథ్లెటిక్స్‌ డే

కిడ్స్‌ కార్నర్‌

అమ్మ ఎలాగో ఆటలు అలాగే! అమ్మ మన దగ్గర ఉంటే వంద పండుగల సంతోషం. వెయ్యి ఏనుగుల బలం. అమ్మలాగే ఆటలను ప్రేమిస్తే...గుండెల్లో పెట్టుకుంటే...ఎంతో ఆరోగ్యంగా ఉంటాం... ఎంతో యాక్టివ్‌గా ఉంటాం...ఎన్నో లైఫ్‌స్కిల్స్‌ తెలుస్తాయి. 

ఫ్రెండ్స్, మీకు వీడియో గేమ్స్‌... ‘రెసిడెంట్‌ ఈవిల్‌’ ‘డ్రాగన్‌ క్వెస్ట్‌’ ‘మౌస్‌ ఫర్‌ హైర్‌’ ‘మారియో టెన్నిస్‌ ఫీవర్‌’ ...  తెలుసా?
 మీలో చాలామంది చెప్పే జవాబు... ‘యస్‌!’

మరి ఇప్పుడు చెప్పండి....
చిర్రె గోనె/ బిళ్లంగోడు, చెండాట/ గిల్లాయిలు, నేల బండ, గుడు గుడు గుంజం, నాలుగు స్తంభాల ఆట, కప్ప గంతులు.... ఈ ఆటల గురించి మీకు తెలుసా? మీలో చాలామంది చెప్పే జవాబు... ‘సారీ....తెలియదు’

‘తెలియదు’ అనే మాట మీ నోటి నుంచి వచ్చిందంటే మీరు చా...లా మిస్‌ అవుతున్నారన్నమాట. వీడియో గేమ్స్‌ మాత్రమే కాదు బయట గ్రౌండ్‌లో ఆడుకోవడానికి చాలా గేమ్స్‌ ఉన్నాయి. ఈ ఆటలు ‘వోన్లీ టైమ్‌పాస్‌’ కోసం కాదు. మీకు శారీరకంగా (ఫిజికల్‌గా), మానసికంగా (మెంటల్‌గా) చాలా ఉపయోగపడతాయి.

మీ క్లోజ్‌ఫ్రెండ్స్‌  ఎవరంటే...
‘మా అబ్బాయి ఎవరితో కలవడు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు’ బాధతో వచ్చే ఈ మాట పెద్దల నోటి నుంచి వినే ఉంటారు. వారు ఎందుకు బాధపడుతుంటారో తెలుసా? పిల్లలు అంటేనే యాక్టివ్‌... యాక్టివ్‌. చురుకుదనానికి కేరాఫ్‌ అడ్రస్‌. వారికి ఫ్రెండ్సే లోకం. మరి అలాంటి పిల్లలు ఒంటరిగా ఉండడం ఏ తల్లిదండ్రులకైనా బాధే కదా! గ్రౌండ్‌లో ఆడే ఆటలు ఉన్నాయి కదా...అవి ఏం చేస్తాయంటే మీలో ఒంటరితనాన్ని పోగొట్టి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా, స్నేహితుల మధ్య సందడిగా ఉండేలా చేస్తాయి. చెప్పకుండానే ఆటలు మనకు ఎన్నో మంచి విషయాలు చెబుతాయి.

‘గెలుపు ఓటములు సహజం’
‘ఓడిపోయినప్పుడు బాధ పడుతూ కూర్చుంటే బాధే మిగులుతుంది. చివరికి అది నీకు క్లోజ్‌ఫ్రెండ్‌ అవుతుంది. గెలుపు దూరం అవుతుంది’
‘ఓడిపోయినా సరే... వచ్చేసారి నేను కచ్చితంగా గెలవగలను అనే పట్టుదల మీలో ఉంటే పట్టుదల, ఆశ, కష్టం అనేవి మీకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అవుతాయి. ఈ ఫ్రెండ్స్‌ మీకు తోడుంటే హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎప్పుడూ గెలుపు మీదే!
                       
మీ కలలకు పేదరికం అడ్డుకాదు
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాజస్థాన్‌కు చెందిన పూజా బిష్ణోయి గురించి తెలుసుకుందాం. ఈ పాప గురించి వింటే మీకు చా...లా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందన్నమాట. 
‘పూజాలా నేను కూడా సాధిస్తాను. ప్రపంచాన్ని చూస్తాను’ అనే కల మీలో తప్పకుండా మొలకెత్తుతుంది. ఆ మొలక చాలు కదా... రేపు చెట్టు కావడానికి.... ఆ నీడలో మీరు పెద్ద పేరు తెచ్చుకోవడానికి!

పదమూడు సంవత్సరాల పూజ వరుస విజయాలతో అథ్లెటిక్స్‌లో సెన్సేషన్‌ సృష్టిస్తోంది. వేగం, ఓర్పుకు పేరుగాంచిన పూజ 800 మీ, 1500 మీ, 300 మీ, 4 కిలోమీటర్‌ల ఈవెంట్‌లలో గోల్డ్‌ మెడల్స్‌ గెలిచింది. అండర్‌–19 ఐపీఎస్‌సీ అథ్లెటిక్స్‌ టోర్నమెంట్‌లో రికార్డ్‌ క్రియేట్‌ చేసి ‘బెస్ట్‌ అథ్లెట్‌’గా నిలిచింది. అయిదేళ్ల వయసులోనే అథ్లెటిక్స్‌ ప్రపంచంలోకి అడుగపెట్టిన పూజ, ఎనిమిదేళ్ల వయసులో 3 కిలోమీటర్‌ల పరుగును 10 నిమిషాల 50 సెకన్‌లలో పూర్తిచేసి రికార్డ్‌ సృష్టించింది.

శిక్షణ ప్లస్‌ క్రమశిక్షణ
‘స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్‌ లెవెల్లో ఆడాలంటే చాలా డబ్బులు కావాలి. అందుకే వాటి గురించి సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అనే మాట కొందరు తల్లిదండ్రుల నుంచి వినబడుతుంటుంది. ‘డబ్బు లేకపోతే ఆటలు లేవు’ అనే మాట నిజమైతే రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన పూజ నేషనల్‌ లెవెల్లో పేరు తెచ్చుకునేది కాదు. ఆమె తండ్రి చిన్న రైతు. పెద్దగా డబ్బులు లేవు. అంతమాత్రాన పూజ తల్లిదండ్రులు ఊరుకోలేదు.

‘ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా అమ్మాయిని ఆటల్లో తీర్చిదిద్దాలి’ అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే జరిగింది. అథ్లెటిక్స్‌లో పూజ పెద్ద పేరు తెచ్చుకుంది. పూజ మరిన్ని విజయాలు సాధించడానికి ‘నీకు మేమున్నాం’ అంటూ ముందుకు వచ్చింది విరాట్‌ కోహ్లి ఫౌండేషన్‌. ఈ ఫౌండేషన్‌ పూజకు ట్రైనింగ్‌ ఇప్పించడం, ప్రయాణ ఖర్చులు, పోషకాహారం...మొదలైనవి సమకూరుస్తోంది.

‘శిక్షణ’కు ‘క్రమశిక్షణ’ తోడైతే ఎన్ని విజయాలు సాధించవచ్చో పూజా బిష్ణోయి నిరూపించింది. యూత్‌ ఒలింపిక్స్‌లో మెడల్‌ గెల్చుకోవాలని కలలు కంటోంది.

పారిపోయిన వారు...పరుగెత్తుకుంటూ వచ్చారు!
ఫ్రెండ్స్, మీరు రోజూ  స్కూల్‌కు వెళతారు కదా, కొందరు  పిల్లలు మాత్రం స్కూల్‌ అంటేనే ‘అయ్య బాబోయ్‌’ అని దూరంగా పారిపోతారు. అలాంటి పిల్లలు కూడా ఇష్టంగా స్కూల్‌కు వెళ్లేలా చేసే శక్తి ఆటలకు ఉంది. 
ముంబైలోని ఒక స్లమ్‌ ఏరియాలో తరచుగా బడికి బంక్‌ కొట్టే పిల్లలని చూశారు అశోక్‌ రాథోడ్‌. ఈయన ఫుట్‌బాల్‌ కోచ్‌. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లతో పిల్లలకు చాలా క్లోజ్‌ అయ్యారు. మెల్లగా పిల్లలను బడికి తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యారు. స్కూల్‌కు వెళ్లడమే కాదు....ఇప్పుడు ఆ పిల్లలలో క్రమశిక్షణ పెరిగింది. ఫుట్‌బాల్‌ గేమ్‌లో ‘వావ్‌’ అనిపిస్తున్నారు.

– యాకుబ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement