ఈస్టర్ ఓ జయధ్వని; ఈస్టర్ ఓ ఆశల హారం; ప్రతి హృదయంలో వికసించిన ప్రేమ పరిమళం. సమాధి తలుపులు తెరిచి దివ్యవర్చస్సుతో క్రీస్తు నిలిచిన రోజు. ప్రతి హృదయంలో ప్రేమ సందేశం మార్మోగుతున్న సమయం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మనిషిని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది.
యేసుక్రీస్తు జీవితం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తెచ్చింది. ప్రేమ, దయ, వినయం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా; పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి; కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా; పరమాత్ముని బాటలో నడవాలని బైబిల్ ప్రబోధిస్తు్తంది.
మొదటి శతాబ్దకాలంలో ఇశ్రాయేలు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో పౌలు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు యూదుజాతిలో పేరెన్నికగలవాడు. తార్సు ప్రాంతంలో జన్మించి ధర్మశాస్త్రంలో అమితాసక్తిని కలిగియుండి గమలియేలు అనే వ్యక్తి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీరాకారంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యంతో పౌలు మొదట్లో ఏకీభవించలేదు. క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిపై అపరిమితమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. యేసు ‘క్రీస్తు’ కాదని వాదించుటే గాక, యేసుక్రీస్తును విశ్వసించినవారిని హింసించుటకు, దూషించుటకు ఇష్టపడ్డాడు.
సిరియా దేశంలోని దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వారిని నాశనం చేయడానికి బయలుదేరాడు. దానికి యెరూషలేములోని క్రీస్తును ద్వేషించే మతపెద్దలు అంగీకరించారు. సరిగ్గా దమస్కు పొలిమేరకు చేరుకొనేసరికి మతగర్వంతో, ద్వేషంతో రగిలిపోతున్న పౌలుకు క్రీస్తు ప్రత్యక్షత దొరికింది. సమున్నతమైన క్రీస్తు రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లిఒడిలో పరవశించే బిడ్డవలే దేవుని దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయాడు. తన గత జీవిత దౌర్భాగాన్ని తలచుకొని కన్నీళ్ళు విడిచి నూతన వ్యక్తిగా మార్పు చెందాడు.ఈ విశిష్ట సంఘటనలను పౌలు స్వయంగా రోమన్ గవర్నర్ ఫేస్తు ముందు, రాజు అగ్రిప్ప ముందు వివరించాడు.
ఒకానొక సందర్భంలో రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రజలకు ఓ పత్రిక వ్రాస్తూ యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఇలా అన్నాడు: ‘మనుష్యులమైన మనమంతా బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును గాని, మనమింకను పాపులమై యుండగానే యేసు మన కొరకు చనిపోయెను, సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని గలిగి రక్షించబడు నిమిత్తం క్రీస్తు సిలువమీద మరణించాడు’. దేవుడు ప్రేమాస్వరూపి అనే బైబిల్ బోధకు ఋజువు క్రీస్తు సిలువ మరణమే. పౌలు మూడు సువార్తయాత్రలు చేశాడు. వాటిలో ప్రతిచోటా తాను ఎక్కువగా మాట్లాడింది, తన వ్రాతల్లో వ్రాసింది క్రీస్తు మరణ పునరుత్థానాలను గురించే!
‘యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా?’ అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశంలోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రం నిలువెత్తు నిదర్శనంగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుడతారు. యేసు చనిపోయిన తరువాత ఆయనకు చుట్టబడిన వస్త్రం నేటికి ఉందని పండితులు నిర్థారించారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. అతని చేతుల్లో మేకులు గాయాలు ఉన్నాయి. అతని దేహమంతా కూడా తూట్లు తూట్లుగా ఎవరో విభజించినట్లు విపరీతమైన గాయాలు కనబడుతున్నాయి.
శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని, దానిమీద పరిశోధనలు చేశారు. ఈరోజుకు కూడా ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు మరణ పునరుత్థానములకు సాక్ష్యం ఆ వస్త్రం. చరిత్రలో చాలామంది ఆ వస్త్రాన్ని దొంగిలించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కాని, వారి వల్ల కాలేదు. అయితే ఆ వస్త్రం యేసుకు సంబంధించినది కాదు, 12 లేదా 13వ శతాబ్దికి చెందిన వస్త్రమని వాదించేవారు లేకపోలేదు. వాస్తవమేమంటే క్రీస్తు ప్రభువు మీద కప్పబడిన వస్త్రం ఆ తర్వాత కాలంలో చాలామంది చేతులు మారడం వలన అక్కడక్కడ పాడైంది. కొంతమంది మఠకన్యలు క్రీ.శ . 1534లో పాడైపోయిన వస్త్రానికి ఎక్కడెక్కడ అయితే రంధ్రాలు పడ్డాయో అక్కడ బాగు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఆ వస్త్రం అనేది 13వ శతాబ్దానికి చెందినదని చాలామంది భావించడానికి అవకాశం దొరికింది. ఇటలీలో ఉన్న ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు.
యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. గెత్సేమనే తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికీ యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. దానిని ‘చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్’ అని పిలుస్తారు. ఇశ్రాయేలును సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను.
అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తబిందువులుగా మారింది. వైద్య పరిభాషలో దానిని హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించాడు. పండిత పురుషోత్తమ చౌదరి అనే కవి క్రీస్తు గెత్సేమనే అనుభవాన్ని ఓ అద్భుతమైన పాటలో ఇలా వర్ణించాడు. ‘శ్రమచేత తన దీన శరీరము నుండి దిగజార చెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపాపము చూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమముగా దూత తన కడకరుగుదెంచి శాంతము బల్కి చనిన పిదపం తమ మనంబుల బోలు తమసమున యూద సైన్యము లేగుదెంచెనపుడు గెత్సేమనే వనికి’.
‘అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను’ (యెష 53:8). జగద్రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలము. ఏడువందల సంవత్సరాలకు పూర్వమే రక్షకుని గూర్చిన సిలువ మరణంతో పాటుగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడతాడు అని తెలియచెప్పబడింది. కఠినమైన సిలువ మరణానికి ముందు ఆయన ఎందుకు తీర్పు తీర్చబడ్డాడు? ప్రభువు తీర్చబడిన తీర్పు అన్యాయమైనదిగా ఎందుకు ఎంచబడింది?
ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభువు నేరుగా అన్న, కయపల యొద్దకు తీసుకొని రాబడ్డారు. వాస్తవానికి మొదట అన్న యొద్దకు ఆ తదుపరి కయప యొద్దకు కొనిపోబడ్డారు. ఈ విషయం లేఖనాల్లో రెండు చోట్ల ప్రస్తావించబడింది.(యోహాను 18:1224, మత్తయి 26:57) వీరిద్దరూ యేసును అవమానించారు, హేళన చేశారు. ఆయన మీద ఉన్న అక్కసును వెళ్ళగక్కారు. అక్కడ నుండి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు నొద్దకు తీసుకొని వెళ్ళారు. క్రీస్తు ప్రభువు గలలియ ప్రాంతంలో పెరిగినవాడు గనుక హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని గ్రహించి పిలాతు హేరోదు నొద్దకు పంపెను.
హేరోదు మొదట యేసును చూచి మిగుల సంతోషించాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికి యేసు అతనికి బదులియ్యలేదు. కాసేపటి తరువాత హేరోదు యేసు ప్రభువును తృణీకరించి అపహసించి పిలాతు నొద్దకు తిరిగి పంపివేశాడు. చివరగా పొంతి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు ఎలా తీర్చబడ్డాడు?
మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. సిలువ మరణానికి ముందు యేసుక్రీస్తును యూదా మతపెద్దల ముందు మూడుసార్లు, రాజుల ముందు మూడుసార్లు నిలువబెట్టారు. అప్పటి కాలపు ప్రధాన యాజకుడైన కయప, అతని మామయైన మాజీ ప్రధాన యాజకుడు అన్న, యూదుల ఆలోచన సభయైన ‘సన్హెడ్రీన్’ ముందు యేసును దోషిగా నిలువబెట్టారు. యేసు తాను దేవుడనని, దేవుని కుమారుడనని ప్రకటించుకున్నాడు, మోషే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించాడన్నది వారు చేసిన నేరారోపణ. ఆ తదుపరి మూడుసార్లు రోమన్ న్యాయస్థానం ముందు నిలువబెట్టారు.
రోమన్ కైసరుకు పన్నులు కట్టవద్దన్నాడని, ప్రజలను రోమన్ చక్రవర్తులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని, తాను రాజునని చెప్పుకొనుచున్నాడని యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. అయితే పిలాతు ఏ నేరమును కనుగొనలేకపోయాడు. ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించాడు. చివరగా పస్కాపండుగ సమయంలో ఒక నేరస్థుని విడుదల చేయగలిగే అధికారాన్ని వినియోగించాలని చూచినా, ప్రజల ఒత్తిడికి లోనై సిలువ మరణాన్ని అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. తన తీర్పులో న్యాయంలేదని తెలిసినా ‘ప్రజల’ కోసం అన్యాయ తీర్పును అమలుపరచాడు.
ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ సమయంలో ఎవరినీ తీర్పు తీర్చకూడదు, శిక్ష విధించకూడదు. అయితే జరిగిందేమిటి? యేసుక్రీస్తు విషయంలో తీర్పు తీర్చారు. మరణశిక్షను అమలు పరిచారు. అపొ.కా 12:4 ప్రకారం పేతురును చెరసాలలో పెట్టింది పస్కా పండుగ సమయంలోనే. అంతకుముందు యాకోబును ఖడ్గంతో చంపేశారు. పేతురును కూడా పట్టుకున్నారు. అయితే పస్కా సమయంలో శిక్ష అమలు చేయకూడదు కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అయితే అసలు వాస్తవం ధర్మశాస్త్రోపదేశకులు అని చెప్పుకొనేవారే ధర్మాన్ని అతిక్రమించారు.
యూదుల ఆలోచన సభ లేదా న్యాయస్థానమైన సన్హెడ్రీన్‌లో గాని, రోమన్ కోర్టులో గాని నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నేరస్థుడు అని తీర్పు వెలువడాలంటే ఆ న్యాయస్థానంలోని ప్రతి సభ్యుడు వారి వారి అభిప్రాయాలు తెలిపాక అందరి సమ్మతి, అంగీకారంతో శిక్ష అమలు చేయాలి. కాని యేసుక్రీస్తు ప్రభువు విషయంలో ప్రజల కేకలే గెలిచాయి.
ఒక వేళ నేరం ఋజువై మరణశిక్ష విధించబడితే, అలా శిక్ష విధింపబడిన వ్యక్తికి కనీసం ఒక రోజు లేదా ఒక రాత్రి గడువును ఇవ్వాలి. ఆ వ్యక్తి మానసికంగా మరణానికి సిద్ధపడడానికి ఆ సమయం అవసరం. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కూడా జరగలేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత క్రూరమైన మరణాన్ని అమలుపరచారు.
ఈ మానవ ప్రపంచ చరిత్రలో ఎంత భయంకర నేరస్థుడినైనా కూడా రాత్రివేళ న్యాయస్థానాల్లో నిలువబెట్టలేదు. నిబంధనల ప్రకారం చీకటి పడేలోపు తీర్పు వెలువరించాలి లేదా వాయిదా వేయాలి. అయితే యేసుక్రీస్తును ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టింది రాత్రివేళలోనే! ఇది అన్యాయం కాకపోతే మరేమిటి?
ఏ దేశంలోనైనా ఏ న్యాయస్థానంలోనైనా నేరారోపణ ఎదుర్కొను వ్యక్తి తరుపున కనీసం మరొక వ్యక్తి వాదిస్తాడు. అటువంటి వ్యక్తి కోసం వాదించడానికి ఎవరూ లేకపోయినా, ఒకవేళ అడ్వొకేటుకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం గాని, కోర్టువారు గాని ఆ వ్యక్తి కోసం వాదించడానికి ఒక ఉత్తరవాదిని నియమిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కోసం వాదించేవారు ఒక్కడు కూడా లేడు. ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కొన్నింటికి సమాధానాలు చెప్పారు; కొన్ని సార్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన పక్షాన వాదించే వ్యక్తి లేకపోయినా తీర్పు తీర్చేశారు. ఇదికూడా అన్యాయమే!
న్యాయవంతుడైన దేవునికి ఈ లోకం అన్యాయపు తీర్పు తీర్చింది. దేవున్ని విడిచి, మరచి బతుకుతున్న కర్కశ సమాజం ఆఖరకు సృష్టికర్తనే అన్యాయానికి గురిచేసింది. కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు కదూ! నీ ప్రభువునే విడిచిపెట్టలేదు ఈ లోకం. నీవు నేను ఓ లెక్కా ఈ పాషాణ సమాజానికి? అయితే యేసుక్రీస్తు అన్యాయపు తీర్పును ఎందుకు సహించాడు? నిలదీసి అడుగుతున్న వ్యక్తులకు సమాధానం చెప్పలేక యేసు మౌనంగా ఉండిపోలేదు, ఆయన ఓ అద్భుత కార్యం నెరవేర్చబోతున్నాడు కాబట్టే అన్యాయాన్ని సహించాడు. ఆయన సహించింది కేవలం నీకోసం, నాకోసం. తప్పు చేసినపుడు శిక్షను భరించడం సమంజసమే కాని, ఏ నేరం లేని నిర్దోషియైన ప్రభువు ఘోర శిక్షను భరించాడంటే ఏదో బలమైన కారణం ఉంది. అదే అవధులు లేని ఆయన ప్రేమ!
శుభ శుక్రవారం రోజున యెరూషలేములోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన ఏడు మాటలు సిలువలో పలికి తన ప్రాణాన్ని అర్పించారు. ‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’ అని క్షమాపణ ప్రాముఖ్యతను తెలిపాడు. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’ అని తన పక్కన వేలాడుచున్న దొంగతో మాట్లాడి నిత్యత్యపు పరమార్థాన్ని తెలిపాడు. ‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని మరియమ్మతో పలికి తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ‘ఏలీ ఏలీ లామా సక్తాని’ అని పలికి దేవునితో ఎడబాటు తీవ్రతను తెలిపాడు.
‘దప్పిగొనుచున్నాను’ అని పలికి తాను మానవునిగా శ్రమను అనుభవిస్తున్నానని తెలిపాడు. ‘సమాప్తమైనది’ అని పలికి తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని అర్థాన్ని నెరవేర్చాడు. ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికి రక్షింపబడిన వ్యక్తి గమ్యస్థానము దేవున్ని చేరుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమే అనే సత్యాన్ని తెలిపాడు. క్రీస్తు సిలువలో పలికిన ప్రతి మాట సర్వలోకానికి ఓ అద్భుత సందేశమే!
క్రీస్తు మరణం శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాదిమంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసు విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆకాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసుప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుండి రక్తం, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని అనేకమంది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహంలో నుంచి ఆ నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు కూడా ధ్రువీకరించారు.
క్రీస్తు సిలువపై మరణించినప్పుడు అనేక అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమైనది దేవాలయపు తెర చినిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారుచేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుష్యులెవ్వరూ దానిని చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే, ఆ తెర పైనుండి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును.
యేసుక్రీస్తు మరణించిన సిలువపై ‘ఐఎన్‌ఆర్‌ఐ’ అనే మాటలు ఒక పత్రంపై వ్రాయబడ్డాయి. సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేంటో బాహాటంగా అందరికీ తెలిసేటట్లు ఒక పత్రంపై అలా వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టేవారు. కాబట్టి క్రీస్తుకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే పై విలాసాన్ని వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా(లాటిన్) భాషలలో వ్రాయబడింది. పిలాతు పై విలాసాన్ని ఆ విధంగా వ్రాయించడం ప్రధాన యాజకులకు నచ్చలేదు. యూదులరాజు అనికాక, యూదుల రాజునని తాను చెప్పుకున్నాడు అని వ్రాయమని కోరారు. వ్రాయబడిన పైవిలాసాన్ని మార్చడానికి పిలాతు నిరాకరించాడు. కొన్ని విషయాలను మార్చడం ఎవరివల్లా కాదు అని ఋజువైంది.
అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ విషయాలన్ని ఇలా వ్యాఖ్యానించాడు. ‘హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ మూడు భాషలూ మూడు జాతులను, వారి భావాలైన ప్రత్యక్షత, కళ, సాహిత్యం, అభివృద్ధి, యుద్ధం, ధర్మశాస్త్రం అనువాటిని తెలియచేస్తున్నాయి. ఎక్కడయితే మానవజాతికి గల ఈ మూడు కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుందో, చదవడానికి కన్ను ఉంటుందో అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగి యుంటుంది.
శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతమయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్‌హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు. ఆ దినాల్లో ధనికులు తన మరణానికి ముందే తమ సమాధిని సిద్ధపరచుకొనేవారు. క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవరోజున సజీవుడై తిరిగిలేచాడు. బైబిల్ ప్రబోధించే అనేక దివ్యసత్యాల్లో ఒకటి క్రీస్తు పునరుత్థానము. మానవ చరిత్రలోనే ఓ అపూర్వ సంఘటన.
వాస్తవానికి క్రీస్తు పునరుత్ధానం గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు, పోలికలు పుష్కలంగా ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని మిగతా లేఖనాల్లో కూడా పునరుత్థానం గురించి తెలియపరచబడింది. లేవీయకాండం పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు ప్రాముఖ్యమైన క్షణాలు ఆ పక్షులలో మనకు తారసపడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంతవరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్ను తాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే నిబంధన ఉండేది.
కొంతకాలానికి ఆ వ్యక్తికి కుష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనుపరచుకోవాలి. ఒకవేళ రోగి యొక్క దేహమును పరిశీలించి రోగము నుండి అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుండి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు పక్షులు తీసుకురావాలి. అవి సజీవమైన పక్షులై ఉండాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలి అని అనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి.
అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంపబడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు అనేదానికి ఒక సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల అనేది కలిగిందని ఆ రెండో పక్షి సూచిస్తుంది. విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది.
‘‘మరియు క్రీస్తు లేపబడియుండిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే’’ (1 కొరింథీ 15:14). యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడా? అన్నది ఈ రోజుల్లో అనేకుల మదిలో మెదలుతున్న ప్రశ్న! అసత్యానికి, సత్యానికి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు వాదించే అంశాలు చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవాన్ని దాచిపెట్టి, అసత్యాన్ని ప్రతిబింబించేలా అపవాది వారిని ప్రోత్సహిస్తున్నాడు అనుటలో ఏ సందేహం లేదు.
యేసుక్రీస్తు సిలువపై మరణించలేదని, సుగంధ ద్రవ్యాలు పూసి, ఔషధాలు ఇచ్చి, స్పృహ కోల్పోయిన వ్యక్తిని బ్రతికించారని; ఆ తదుపరి ఆయన మగ్దలేనే మరియను పెండ్లి చేసుకొన్నాడని; కొందరైతే ఆయన కాశ్మీర్ వచ్చాడని రకరకాల కథలు చెబుతూవున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటివేమీ కాదు. మొదటి శతాబ్దం నుండి ఉన్నవే. శిష్యులు ఆయన దేహమును ఎత్తుకొనిపోయి దాచిపెట్టి మృత్యుంజయుడైనాడని ప్రకటించారని వారి వాదన. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు సమాధి దగ్గర ఉంచినంత కావలివారిని బహుశా ఎవరి సమాధి దగ్గర పెట్టలేదేమో! ఆ తరువాతి కాలంలో ఒక్క యోహాను తప్ప క్రీస్తు శిష్యులందరూ పునరుత్థానాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ప్రపంచం నలుమూలల హతసాక్షులయ్యారు.
ఈస్టర్ శుభదినాన అనేక క్రైస్తవ సంఘాల్లో మిక్కిలి సమూయేలు వ్రాసిన ఈ భక్తిగీతాన్ని ఆలపిస్తారు. క్రీస్తు పునరుత్థాన సత్యాన్ని కీర్తిస్తారు. ‘యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు’. యేసుక్రీస్తు జీవితాన్ని అద్భుతంగా వివరించే నాలుగు సువార్తలు బైబిల్లో ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నాలుగు సువార్తలలో క్రీస్తు పునరుత్థానం గూర్చి చాలా స్పష్టంగా వివరించబడింది. శిష్యులైన మత్తయి, యోహానులు క్రీస్తు పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షులు. వైద్యుడైన లూకా రెండు గ్రంథాలను వ్రాశాడు.
యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు సుగంధ ద్రవ్యములను కొని తమ దగ్గర ఉంచుకున్నారు. ఆదివారం పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వస్తూ సమాధి ద్వారము నుండి మనకొరకు ఎవరు ఆ రాయిని పొర్లించును అని మాట్లాడుకున్నారు. ఆ రాతికి రోమా వారు ముద్రవేసి సైనికులను కావలి ఉంచారని కూడా వారికి తెలుసు. అయితే వారు వచ్చి చూసేసరికి అప్పటికే రాయి దొర్లించి ఉంది. రాయి దొర్లింపబడకుండా కూడా పునరుత్థానుడైన క్రీస్తు బయటకు వచ్చుండేవాడే కానీ మనుష్యులు లోపలికి వెళ్ళి పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చునట్లుగా రాయి దొర్లించబడింది.
వారు సమాధిలో ప్రవేశించి నిలువుటంగీ ధరించిన ఒక పడుచువానిగా కనిపిస్తున్న ఒక దేవదూతను చూశారు. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి అద్భుతమైన కొన్ని విషయాలను వారికి తెలియచేశాడు. యోహాను భక్తుడు తాను వ్రాసిన సువార్తలో క్రీస్తు పునరుత్థాన ప్రత్యక్షలను చాలా స్పష్టంగా వివరించాడు. మగ్దలేనే మరియ క్రీస్తు పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని పేతురు, యోహానులకు తెలిపింది. వారు పరుగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి ఖాళీగా ఉంది. సమాధి లోపల నారబట్టలు పడియుండడం చూశారు.
ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయాన్ని యోహాను ప్రస్తావించాడు. క్రీస్తు ప్రభువు తలకు చుట్టబడిన రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండడం చూశారు. యేసుక్రీస్తు సమాధి నుండి ఏదో తొందరపాటుతో వెళ్ళిపోలేదని, అక్కడ జరిగిన సంఘటనలన్నియు ఒక పద్దతి ప్రకారం జరిగాయని చూపడానికి ఈ వివరణ అందించబడింది. ఒకవేళ క్రీస్తు దేహాన్ని ఎవరైనా ఎత్తుకుపోయినా, వారు తల రుమాలును ఇంత జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు.
పునరుత్థానం జరిగిన ఆదివారం సాయంత్రం శిష్యులందరూ సమావేశమయ్యారు. వారిలో ఏదో తెలియని కలవరం, భయం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. భయం వలన వారు కూడియున్న గది తలుపులు గట్టిగా బిగించుకొనియున్నారు. అకస్మాత్తుగా క్రీస్తు వారి మధ్య నిలిచి ‘‘మీకు సమాధానం కలుగును గాక’’ అని ప్రకటించాడు. వారికి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా. తలుపులు తెరవకుండానే లోపలికి ప్రవేశించడం క్రీస్తు మహిమ. దేహాన్ని కలిగియుండుట వలన అది సాధ్యమయింది. యేసు చేసిన ప్రతి పనిలోనూ మనిషికి సమాధానం అనుగ్రహించడం చూస్తాం.
ప్రస్తుత రోజులో మనిషికి అన్నీ ఉన్నాయి గాని, నిజమైన సమాధానం లేదు. వ్యక్తిగతంగా మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, రాజ్యం మీదకి రాజ్యాలు లేవడం సర్వసాధారణంగా కనబడుతూనే ఉన్నాయి. నిజమైన శాంతి సమాధానాలు మనిషికి ఎక్కడ లభిస్తాయి? దేవుడు సమాధానకర్త గనుక ఆయన్ను ఎవరైతే తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారికి సమాధానం, పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మోక్షరాజ్యం లభిస్తాయని బైబిల్ ప్రబోధిస్తుంది. పాప పశ్చాత్తాపంతో నూతన జీవితాన్ని ఆకాంక్షిస్తూ క్రీస్తు సిలువ చెంతకు చేరి ఆయన దివ్య చరణాలను ఆశ్రయించి ఆయన రక్తం ద్వారా తమ పాపములను కడుగుకొని, క్రీస్తు అనుగ్రహించు పునరుత్థాన శక్తితో జీవితయాత్రలో ఒక గమ్యాన్ని కలిగి విశ్వాసంతో సాగిపోవడం ద్వారా సర్వశక్తుడైన దేవుని మహిమపరచగలము అని క్రైస్తవులు విశ్వసిస్తారు.
యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పెను అని వ్రాయబడినట్లుగా ఈ మాటలు చదువుచున్న ప్రతి ఒక్కరికి ప్రేమమయుడైన క్రీస్తు ప్రభువు కృపాసింహాసనం నుండి అన్ని విషయాల్లో శుభం కలుగును గాక.
ఈస్టర్ శుభాకాంక్షలు.
‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును.
మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు.
శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతయయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్‌హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు.
యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు.

డా. జాన్ వెస్లీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమహేంద్రవరం


