పాత మట్టిని మళ్లీ వాడుకోవచ్చా? | Sagubadi How To Teplace Old Soil And Manure | Sakshi
Sakshi News home page

సాగుబడి: పాత మట్టిని మళ్లీ వాడుకోవచ్చా?

May 29 2026 8:58 AM | Updated on May 29 2026 10:14 AM

Sagubadi How To Teplace Old Soil And Manure

సాగుబడి

టెర్రస్‌ గార్డెన్‌ లో ఒకసారి వాడిన మట్టిని తీసి పారెయ్యాలా? మళ్లీ వాడుకోవచ్చా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. నిస్సందేహంగా మళ్లీ మళ్ళీ వాడుకోవచ్చు. ప్రతి సారీ కొత్త మట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.

ఎటువంటి  పరిస్థితి లో పాత మట్టి మార్చాలి?
1. ఎక్కువ ఫంగస్‌ ఉంటే
2. వేరుకుళ్లు వస్తే
3. ఉప్పుదనం పెరిగితే.
4. మట్టి బిగుసుకుపోతే మార్చాలి

పాత మట్టిని మళ్లీ వాడే ముందు చేయాల్సిన పనులు:
మొక్క కుండీలోనో మడిలోనో ఒక సీజన్‌ అంతా పెరిగిన తర్వాత ఆ మట్టిలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలు తగ్గిపోతాయి. అలాగే మట్టిలో ఉన్న ఉపయోగకర సూక్ష్మజీవులు తగ్గి, కొన్నిసార్లు హానికర ఫంగస్‌ పెరుగుతుంది. ఎరువులు లేదా హార్డ్‌ వాటర్‌ వాడటం వల్ల ఉప్పదనం పెరిగి.. పోషకాలు తీసుకునే శక్తి వేర్లకు తగ్గుతుంది.

పాత మట్టి గట్టిపడి గాలి ప్రసరణ కూడా తగ్గుతుంది. అందుకే పాత మట్టిని నేరుగా కాకుండా, శుభ్రపరచి, మళ్లీ జీవన ఎరువులు కలిపి వాడాలి. పాత మట్టిలో ఉన్న  వేర్లు, ఎండిన ఆకులు తీసెయ్యకూడదు. వాటిని అలాగే ఉంచితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వేర్లు, ఎండిన ఆకులకు ఫంగస్‌ ఉంటే తీసేయాలి. మట్టిలో చెత్త తీసేయాలి.

మడులు, కుండీల్లో వాడిన మట్టిలో మళ్లీ మొక్కలు, విత్తనాలు వేసే ముందు 2 నుంచి 3 రోజులు ఎండలో ఎండ బెట్టాలి. దీనివల్ల ఫంగస్‌ తగ్గుతుంది. పురుగు గుడ్లు నశిస్తాయి. మట్టి సహజ శుద్ధి అవుతుంది.

నీరు ఎంత పోయాలి?
కుండీలో, మడిలో మొక్కలు/విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఎప్పుడూ మట్టి ఎండిపోకుండా చూడాలి. మట్టి ఎండిపోతే మనం వేసిన జీవన ఎరువుల్లోని సూక్ష్మ జీవులు చనిపోతాయి. మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూడాలి. నీరు ఎక్కువ పోస్తే మనం ఇచ్చిన పోషకాలు కుండీ నుంచి నీటితో పాటు కారిపోతాయి. ఇపుడు ఎండలు బాగా ఉన్నాయి. మిద్దె/పెరటి తోట సేద్యదారులు పాత మట్టి ఎండబెట్టి ఎరువులు కలిపి సిద్ధం చేసుకోవచ్చు.

మట్టి మిశ్రమం (పాటింగ్‌ మిక్స్‌) తయారీ ఎలా?
60% పాత మట్టి
20% కంపోస్ట్‌ (సేంద్రియ ఎరువు)
10% కోకోపీట్‌/వరి పొట్టు 
10% వర్మికంపోస్ట్‌ లేదా ఇసుక కొద్దిగా వేపపిండి, చెక్క బూడిద కొద్దిగా.. కలపాలి. 
వేరు కుళ్ళుడు రాకుండా కొద్దిగా ట్రైకోడెర్మా కలపవచ్చు. ఈ నిష్పత్తిలో మట్టి మిశ్రమాన్ని కలపడం వల్ల కుండీలు, మడుల్లో గాలి ప్రసరణ పెరుగుతుంది. అదనపు నీరు నిల్వ ఉండదు. వేర్లు బాగా పెరుగుతాయి. మట్టి మిశ్రమం తయారు చేసిన తర్వాత 5 నుంచి 7 రోజులు అలాగే ఉంచితే సూక్ష్మజీవులు చురుకుగా పనిచేస్తాయి. తరువాత కుండీలో, మడిలో వేసుకొని విత్తనాలు, మొక్కలు నాటుకోవటానికి సిద్ధం చేసుకోవచ్చు.


- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా,
మిద్దె తోటల బృందం, మొబైల్‌: 94906 02366 

- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement