నెర్రెలిస్తున్న నేలతల్లికై... అక్షర చైతన్య యాత్ర! | Sadhguru daughter Radhe Jaggi launches Save Soil book in Hyderabad | Sakshi
Sakshi News home page

నెర్రెలిస్తున్న నేలతల్లికై... అక్షర చైతన్య యాత్ర!

Apr 15 2026 7:33 PM | Updated on Apr 15 2026 8:13 PM

Sadhguru daughter Radhe Jaggi launches Save Soil book in Hyderabad

నాలుగేళ్ళ క్రితమే 30 వేల కి.మీ. యాత్రతో ‘సేవ్ సాయిల్’ ఉద్యమం 

86 మంది వలంటీర్ల ప్రత్యక్ష కథనాల సమాహారంగా తాజా గ్రంథం

సంకలన, సంపాదకత్వ బాధ్యతల్లో భరతనాట్య కళాకారిణి రాధే

అంతకంతకూ క్షీణిస్తున్న భూసారాన్ని మనకు మనమే తక్షణం కాపాడుకోవాలి. లేదంటే, మరో నాలుగైదు దశాబ్దాల్లో మానవ జాతికి మనుగడే ఉండదు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు... ప్రపంచ వ్యాప్తంగా భూసార పరీక్షలు సాగించిన పరిశోధకుల మాట. కానీ, అత్యంత కీలకమైన ఈ అంశం పట్ల ఎంతమందికి చైతన్యం ఉంది? పెరుగుతున్న భూతాపం, అంతకంతకూ ఎక్కువవుతున్న చెట్ల నరికివేత లాంటి అంశాలపై జనంలో ఎంతో కొంత అవగాహన కలిగించే ప్రయత్నం జరుగుతోంది. మరి, మనకు ఆహారం అందించే పుడమి తల్లి చేవ చచ్చి, చేష్టలుడిగి, జీవచ్ఛవమవుతున్న దుఃస్థితి గురించి ఎవరికి పడుతోంది? భవిష్యత్ మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పరిస్థితిపై సాగిన ఓ ప్రజా ఉద్యమమే... ‘సేవ్ సాయిల్’. ఉద్యమ స్థాయిలో సాగిన ఈ ప్రజా చైతన్య కార్యక్రమం.. ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీవాసుదేవ్ మానస పుత్రిక.

100 రోజులు.. 27 దేశాలు.. 30 వేల కిలోమీటర్లు...
‘సేవ్ సాయిల్’ ఉద్యమం చేపట్టిన ఆయన అందులో భాగంగా నాలుగేళ్ళ క్రితం 2022లో 100 రోజుల పాటు 27 దేశాల మీదుగా దాదాపు 30 వేల కిలోమీటర్లు మోటార్ సైకిలుపై ప్రయాణించారు. భారతదేశంతో పాటు ఐరోపా, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాల మీదుగా ఆ యాత్ర సాగింది. అదో ప్రపంచవ్యాప్త బృహత్తర ప్రయత్నం. అయితే, వివిధ దేశాల్లోని వైవిధ్యభరితమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులతో ముడిపడిన ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, కొన్ని పదులు, వందలమంది తెర వెనుక ఉండి శ్రమిస్తే కానీ సాధ్యం కాదు.

యాత్రలో భాగంగా మొత్తం 691 కార్యక్రమాలుగా సాగిన ‘సేవ్ సాయిల్’ (Save Soil) విషయంలోనూ అదే జరిగింది. ఈ ప్రజాచైతన్య ఉద్యమంలో తెర వెనుక హీరోలు ఎందరో. అలాంటి పదుల మంది స్వచ్ఛంద సేవకులు, కార్యకర్తల వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు, ఆ వంద రోజుల ప్రయాణంలో జరిగిన పలు సంఘటనలు... అన్నీ అనేక విధాలుగా మానవాసక్తికరమైన కథనాలే. ‘సేవ్ సాయిల్’ ఉద్యమంలోని అలాంటి తెలియని తెర వెనుక కథలు తాజాగా పుస్తకరూపం సంతరించుకున్నాయి. ‘సేవ్ సాయిల్ – 100 డేస్ దట్ మూవ్డ్ ది వరల్డ్’ అన్న పేరుతో పెంగ్విన్ బుక్ హౌస్ వారు ప్రచురించారు.

నాలుగేళ్ళలో.. 410 కోట్ల మందికి...
హైదరాబాద్‌లో ఏప్రిల్ 14వ తేదీ, మంగళవారం సాయంత్రం వినూత్న రీతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సద్గురు కుమార్తె అయిన రాధే జగ్గీ (Radhe Jaggi) ఈ సంకలన గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు – సంగీత దర్శకుడు రామ్ మిరియాల, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ – మోడల్ శిల్పారెడ్డితో కలసి పుస్తక సంపాదకురాలి చర్చా గోష్ఠి ఫక్కీలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం సాగింది. “ప్రపంచవ్యాప్తంగా గత నాలుగేళ్ళలో దాదాపు 410 కోట్ల మందికి చేరువైన ‘సేవ్ సాయిల్’ ఇవాళ అతి పెద్ద ప్రజా చైతన్య ఉద్యమం” అని రాధే వివరించారు.

‘సేవ్ సాయిల్’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అనుభవం రాధేది. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ, ప్రచారం కోసం స్థాపించిన ‘ప్రాజెక్ట్ సంస్కృతి’తో కలిసి ఆ యాత్రలో అనేక వేదికలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. మట్టితో ముడిపడిన కథాంశంతో రాధే బృందం చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఉద్యమ సందేశాన్ని మరింత వ్యాపింపజేశాయి. అలా యాత్రలో ప్రత్యక్ష భాగస్వామి అయిన రాధే తన అనుభవంతో పాటు పలువురు స్వచ్ఛంద సేవకుల అనుభూతులనూ, వారు ఎదుర్కొన్న సంఘటనలనూ సంకలించారు. వెరసి, విభిన్న వర్గాలకు చెందిన 86 మంది వేర్వేరు వ్యక్తుల విభిన్న అనుభవాల సమాహార రూపం... ‘సేవ్ సాయిల్’ గ్రంథం. ఆ వాలంటీర్ల కథలు, అప్పటి ఫోటోలతో పుస్తకాన్ని ఆసక్తిగా తీర్చిదిద్దారు. ఎక్కడ, ఏ పేజీ అయినా తీసుకొని చదువుకొనేలా అనుభవాలను రాశిపోసిన ఈ రచన నేలతల్లి పరిరక్షణ ఉద్యమం వెనుక ఉన్న విస్తృతి, ఉత్సాహం, సవాళ్లను పరిచయం చేస్తుంది.

ఎండకు ఎండి, వానకు తడిసి, మంచులో వణికి... 
యూరోపియన్ ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూ, ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ, ఎర్రటి ఎండలో ఎడారి తుపానులకు ఎదురొడ్డుతూ సాగిన ఉద్యమ యాత్ర ఇది. ఐక్యరాజ్య సమితి హాళ్ళ నుంచి రోడ్డు పక్క టీ షాపుల దాకా ఆగిన ప్రతిచోటా నేలతల్లిని కాపాడుకోవాలన్నదే ప్రధాన సందేశం. ఓ దేశంలో అసలు కార్యక్రమానికి ముందు కిచెన్‌లో ఇరుక్కుపోయిన క్షణాలు, డ్రోన్‌ను నోట కరుచుకొని ఓ వాలంటీర్ చెట్టెక్కిన సంగతులు, వాహనం క్లచ్ పాడైపోయి బాగు చేయాల్సిన క్షణంలో చిమ్మచీకటి వేళ అపరిచిత వ్యక్తులు అందించిన సాయాలు, ఈ ఉద్యమం కోసం తెలుగునాట ఓ వ్యక్తి కాలినడకన కొన్ని పదుల కి.మీ.లు నడక సాగించడం... ఇలా ఎన్నెన్నో కథలు ఈ పుస్తకంలో చదవవచ్చు.

“పలువురిని ఇంటర్వ్యూ చేసి, వారి అనుభవాలను వారి మాటల్లోనే అందించాం. ఈ పుస్తకం చదువుతుంటే, ఆ సంఘటలన్నీ కళ్ళ ముందు కదలాడి, ‘సేవ్ సాయిల్’ ప్రపంచ యాత్రలో మీరూ స్వయంగా పాల్గొన్న అనుభూతి కలుగుతుంది’’ అని రాధే వివరించారు. “రైతులు తమ జీవనోపాధి కోసం పోరాడుతుంటారు. అలాంటి సమయంలో పర్యావరణ బాధ్యతను కూడా వాళ్ళ మీదే పెట్టడం సరైంది కాదు. మనందరం సహజసిద్ధంగా మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచాలి. రైతులకు అండగా నిలవాలి. అదే సమయంలో ప్రభుత్వాలు సైతం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, కట్టుదిట్టంగా అమలు చేస్తేనే, నేలతల్లి సంరక్షణ నిజంగా సాధ్యమవుతుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏం చేస్తున్నామని సిగ్గేసింది: రామ్ మిరియాల 
‘వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని కనీసం 3 నుంచి 6 శాతానికి పెంచే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నేలతల్లి ఎదుర్కొంటున్న సార సంక్షోభాన్ని ఎదుర్కోవడం ‘సేవ్ సాయిల్’ ఉద్యమ లక్ష్యం. శాస్త్రవేత్తలు, రైతులు, అంతర్జాతీయ సంస్థలు, సామాన్య పౌరుల నుంచి పాలకుల దాకా అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వానికి నేలలో జీవం ఎంత ముఖ్యమైనదో చాటుతోంది. ఈ లక్ష్యాలన్నీ నచ్చి దీనిలో నేనూ భాగమయ్యాను’ అని సినీ గాయకుడు రామ్ మిరియాల వివరించారు.

“వయసు మీద పడినవారే ఎంతో చేస్తుంటే, వయసులో ఉన్న మనం ఏం చేస్తున్నామని నాకే సిగ్గేసింది. అందుకే, నా వంతుగా ఈ ప్రజా చైతన్య ఉద్యమం కోసం స్వయంగా ఓ పాట రాసి, స్వరపరిచి పాడాను” అని రామ్ చెప్పుకొచ్చారు. మనిషికీ, మట్టికీ ఉన్న బంధాన్నీ, అలాగే మనం మట్టిని కాపాడుకోవలసిన అవసరాన్నీ చెప్పిన “నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ...” అనే ఆ పాట పాడి, వినిపించారు. “దేశమంటే మట్టేనోయ్... మట్టి లేకపోతే మనిషెక్కడోయ్...” అంటూ వినూత్న ధోరణితో ఆలోచింపజేశారు. మట్టిని ప్రాణమున్న బంగారంగా వర్ణిస్తూ సాగిన రామ్ మిరియాల పాట ఆహూతులను అలరించడమే కాక, మట్టిపై ప్రేమను మరింత పెంచేలా సాగింది.

అందుకే... సమంతను భాగస్వామిని చేశా: శిల్పారెడ్డి 
ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, “సేవ్ సాయిల్ ఉద్యమం తాలూకు లక్ష్యం నన్నెంతో ప్రేరేపించింది. ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే, మహా ఉపద్రవం తప్పదు. అందుకే, మానవాళి భవిష్యత్తు కోసం నా వంతుగా ఇందులో నేనూ భాగమయ్యాను. సినీ నటి సమంత లాంటి నా ఆత్మీయ మిత్రులనూ, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులనూ ఈ కృషిలో భాగం చేశాను. స్వయంగా స్విట్జర్లాండ్ వెళ్ళి, యాత్రలో పాల్గొన్నాను. మహా సముద్రం లాంటి ఈ ప్రయత్నంలో నేను ఓ నీటిబిందువును మాత్రమే” అని వినయంగా పేర్కొన్నారు. ఆహూతుల సందేహాలకు సైతం సమాధానాలిస్తూ, చర్చా గోష్ఠిగా సాగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జంట నగరాలలోని వివిధ వర్గాల ప్రజలు పెద్దయెత్తున పాల్గొనడం విశేషం.

చ‌ద‌వండి: వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యం

ఏమైనా, ‘మనం ఈ నేల నుంచి పుట్టాం. ఈ నేలపైనే జీవిస్తాం. ఇక్కడే కన్నుమూస్తాం. చివరకు ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఆ వాస్తవం ఇప్పటికైనా గుర్తించి, మన నేలతల్లి జవజీవాలను మనమే పరిరక్షించుకోవాలన్న ఆలోచన ఇప్పటికైనా తెచ్చుకుందాం. లేదంటే భావితరానికి బతుకే లేదు’. ఈ సద్గురు సందేశం ఆలోచించి తీరాల్సిందే కాదు... తక్షణమే ఆచరణలోకి దిగాల్సినది. ‘సేవ్ సాయిల్’ పుస్తకంలోని విభిన్న అనుభవాలు అక్షరాలా అందుకు మరో ప్రేరణ.

- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement