వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యం | Swathy Somanath Kuchipudi ballet Vatsayana Kamasutra Ardhanareeswaram | Sakshi
Sakshi News home page

రంగస్థలిపై అపురూప సాహసం... అర్ధనారీశ్వరమ్!

Apr 14 2026 7:30 PM | Updated on Apr 14 2026 7:46 PM

Swathy Somanath Kuchipudi ballet Vatsayana Kamasutra Ardhanareeswaram

శ్రీకాకుళ ప్రాంత గిరిపుత్రుల అపూర్వ నృత్యకౌశలం

స్వాతీ సోమనాథ్ 12 ఏళ్ళ కృషికి నిదర్శనం ‘సంప్రదాయం’

లైంగిక అంశాలపై సమాజంలో అందరికీ ఆసక్తే. కానీ, లైంగిక విజ్ఞానమంటే పచ్చి బూతు, పరమ రోత అనుకొనే చిత్రమైన కుహనా విలువలతో కూడిన వ్యవస్థ మనది. విచిత్రం ఏమిటంటే, అసలు భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం అనేక శతాబ్దాల క్రితం నుంచే ఓ అవిభాజ్యమైన భాగం. ధర్మ, అర్థ, కామములనే త్రివర్గాల ద్వారానే నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలమని నమ్మిన సనాతన భారతీయ ధర్మం మనది. ధర్మ మార్గంలో అర్థాన్ని (ధనాన్ని) సంపాదించాలనీ, ఆ ధర్మబద్ధమైన అర్థం ద్వారా కామాన్ని (కోరికలను) తీర్చుకోవాలనీ, వెరసి ఆ త్రివర్గ సాధనే... మోక్షానికి మార్గమనీ మన ఋషిసత్తముల మాట. అలా క్రీ.శ. మూడో శతాబ్ద కాలంలోనే వాత్స్యాయనుడు ‘కామసూత్ర’ గ్రంథాన్ని అందించిన నేల మనది. అలాంటి కామసూత్ర విశేషాలను వేదికపై సంప్రదాయ కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించే సాహసం చేస్తే?

నాట్య, యోగశాస్త్రాల మేలు కలయికగా...
హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా ఏప్రిల్ 13, సోమవారం సాయంత్రం అదే జరిగింది. ప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి, నాట్య గురువు స్వాతీ సోమనాథ్ తన శిష్య బృందంతో ‘అర్ధనారీశ్వరమ్’ (Ardhanareeswaram) పేరిట ఆ విలక్షణ సాహస ప్రయోగం చేశారు. ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ బి.పి. రావు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, కళాపోషకురాలు ప్రవీణా యజ్ఞంభట్, ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల సేతురామ్, ‘యక్షగాన కంఠీరవ’ పసుమర్తి శేషుబాబు, దేవదాసీ సంప్రదాయ నాట్యంలో దిట్ట యశోదా ఠాకూర్, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ సహా వివిధ రంగాలలోని పలువురు ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై, ప్రశంసించారు.

ఆనందమయ జీవితం గడపాలంటే, లైంగిక జీవితం ఆహ్లాదంగా సాగాలన్నది మొదటి మెట్టు. అయితే, ఆ కోరికను సైతం ధర్మబద్ధమైన మార్గంలో తీర్చుకోవడమే అసలు కీలకం. ఆ విషయాన్నే వివరిస్తూ... స్త్రీ పురుషులు ప్రకృతి – పరమేశ్వరులకు ప్రతీకలని గుర్తు చేస్తూ, వారి సంయోగం అర్ధనారీశ్వర తత్త్వానికి ప్రతిబింబమంటూ సాగిన అపురూప కూచిపూడి నృత్య రూపకం ‘అర్ధనారీశ్వరమ్’. భరతుని ‘నాట్యశాస్త్రం’లోని నృత్తాన్ని ఆసరాగా చేసుకొని, అటు ‘వాత్స్యాయన కామసూత్రాల’లోని కొన్ని ప్రధానాంశాలనూ, ఇటు ‘పతంజలి యోగశాస్త్రం’లోని యోగ భంగిమలనూ సమ్మిళితం చేసి, భారతీయ శాస్త్రీయ సంగీతంలోని సప్తస్వరాలు ఆలంబనగా, కూచిపూడి నృత్య శైలిలో ఎంతో శ్రమించి, స్వాతీ సోమనాథ్ ఈ డ్యాన్స్ బ్యాలేను రూపొందించారు.

రెంటాల వారి ఆ ప్రామాణిక రచనే ఆధారంగా...
వాత్స్యాయన కామసూత్రాలంటే ((Vatsayana Kamasutra) అదో అశ్లీల గ్రంథంగా పొరబడుతుంటారు. లైంగిక విజ్ఞానాన్ని శాస్త్రీయంగా అందించిన ఆ ప్రాచీన కామశాస్త్రానికి ఉన్నవీ లేనివీ చేర్చి, చౌకబారు నకిలీ అనుకరణలతో వచ్చిన చిల్లర పుస్తకాలే ఆ అపప్రథకు కారణం. “ప్రముఖ అభ్యుదయ కవి, ద్విశతాధిక గ్రంథకర్త, జర్నలిస్టు స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణ (1920 – 1995) మాత్రం వాత్స్యాయనుడు రాసిన సంస్కృత సూత్రాలను యథాతథంగా అందిస్తూ, సులభంగా అందరికీ అర్థమయ్యేలా 1980లలోనే ఈ కామశాస్త్ర గ్రంథాన్ని తేటతెలుగులో ‘వాత్స్సాయన కామసూత్రాలు’ పేరిట అందించారు. ఈ నాట్య రూపక రచనకు ప్రామాణికమైన ఆ రచననే ఆధారంగా చేసుకున్నాం. ప్రఖ్యాత రచయిత – చిత్రకారుడు బ్నిమ్ గారు అలా ఈ నృత్య రూపక రచన చేశారు” అని నృత్య దర్శకురాలైన స్వాతీ సోమనాథ్ వివరించారు.“సృష్టికి మూలం సంయోగ భోగం... ప్రకృతీ పురుషుల మధుర సంగమం” అని బ్నిమ్ అందంగా చెప్పిన ఈ సాహసోపేత ప్రయోగానికి గరిమెళ్ళ గోపాలకృష్ణ సంగీతం అందించగా, ఎన్. సురేశ్ ప్రసాద్ సంగీత సారథ్యం వహించారు.



కూచిపూడి నాట్య కళాకారిణిగా స్వాతీ సోమనాథ్ (Swathy Somanath) మొదటి నుంచి రంగస్థలంపై ఓ అగ్గిబరాటా. ‘ద్రౌపది’, ‘ఆది శంకరాచార్య’ లాంటి వైవిధ్యభరితమైన అంశాలను ఎంచుకొని, ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఆలోచన రేపాలనుకోవడం ఆమె శైలి. నిజానికి, ఇప్పటికి 23 ఏళ్ళ క్రితం 2003లోనే ఆమె తొలిసారిగా ఈ వాత్స్యాయన కామసూత్రాలను సశాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా, కూచిపూడి నృత్యశైలిలో వేదిక మీదకు తెచ్చారు. ఆ ‘కామసూత్ర’ నృత్య రూపకం అప్పట్లో ఓ సంచలనం. ఇలాంటి శృంగారభరిత అంశాలను రంగస్థలంపై నర్తించవచ్చా, అది కళకూ – సమాజానికీ ఏ రకంగా మేలు చేస్తుందంటూ విమర్శలూ వెల్లువెత్తాయి. 

అయితే, అసభ్యతకు తావివ్వని తన నృత్య రూపకంతోనే ఆ విమర్శలకు దీటుగా బదులిస్తూ, దేశ విదేశాల్లో అనేక చోట్ల స్వాతి ఆ ‘కామసూత్ర’ను ప్రదర్శించారు. “అప్పట్లో ఈ నాటకానికి సుశిక్షితులైన కూచిపూడి పురుష కళాకారులు నాకు అందుబాటులో లేరు. దాంతో, సినీ – టీవీ నటులు జె.ఎల్. శ్రీనివాస్, హీరో జాకీ లాంటి వారితో ప్రదర్శించి, రక్తి కట్టించాం. ఇప్పుడు దానికే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి, మరింత అందంగా తీర్చిదిద్ది, అందరూ సుశిక్షితులైన కూచిపూడి కళాకారులతోనే ‘అర్ధనారీశ్వరమ్’ పేరిట అందించాం. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన మా ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకులం ట్రస్ట్‌లో నా వద్ద ఎనిమిదేళ్ళుగా శిక్షణ పొందిన యువ శిష్య బృందంతోనే ఈ డ్యాన్స్ బ్యాలేను ప్రదర్శించాం” అని స్వాతి వివరించారు.

మద్రాసుకు నాటి ‘కళాక్షేత్ర’... మనకు నేటి ‘సంప్రదాయం’
దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ లలిత కళా శిక్షణకు విశిష్ట కేంద్రాలున్నాయి. మన తెలుగు నాట అలాంటివి కొంత అరుదే. అయితే, తమిళనాట మద్రాసు (నేటి చెన్నై)లోని రుక్మిణీ అరండేల్ ‘కళాక్షేత్ర’, కేరళలోని ‘కళామండలం’ లాగా కొన్నేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అపురూప లలితకళా కేంద్రం ‘సంప్రదాయం’. శ్రీకాకుళంలోని కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుందీ గురుకుల శిక్షణ సంస్థ. ప్రపంచంలో గురుకుల పద్ధతిలో కొనసాగుతున్న ఏకైక కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రం ఇది. జిల్లా కలెక్టరే చైర్మన్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానమ్ కార్యనిర్వహణాధికారి సహా పలువురు ట్రస్టీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 

2015 నుంచి సాగుతున్న ఈ యజ్ఞంలో భాగంగా శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులే ఇప్పుడీ ‘అర్ధనారీశ్వరమ్’ రూపకాన్ని ప్రదర్శించారు. వారంతా అరకు, సీతంపేట సహా చుట్టుపక్కలి ప్రాంతాల్లో ఉండే గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలబాలికలే. దిగువ మధ్యతరగతికి చెందిన తల్లితండ్రులు ఎంతో నమ్మకంతో అప్పగించిన ఆ పిల్లల్ని చాలీచాలని నిధులు, పేరుకుపోయిన బకాయిల మధ్యనే ఆ కేంద్రం అద్భుతంగా తీర్చిదిద్దింది. సామాన్య స్థాయి నుంచి వచ్చి మెరికల్లా తయారైన ఆ పిల్లలు ఇప్పుడు కూచిపూడిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు.

ఆలుమగలను ఆనందతీరాలు చేర్చే సూత్రాలు
ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఆ యువ కళాకారులు తాజాగా హైదరాబాద్‌లో సోమవారం చూపిన నృత్య కౌశల ప్రదర్శనే అందుకు సజీవ సాక్ష్యం. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో నిండిన రవీంద్రభారతి ప్రాంగణం ఈ యువ కళాకారుల ‘అర్ధనారీశ్వరమ్’ ప్రదర్శనను ఆద్యంతం కరతాళ ధ్వనులతో అభినందించింది. “దాంపత్య ధర్మ నిర్దేశనం కామసూత్ర కథనం” అని పేర్కొంటూ, “ఇహమందు మోక్షమునిచ్చే సూత్రము... కామసూత్రమ”ని ఈ రూపకం ద్వారా రచయిత – నృత్య దర్శకులు ఢంకా బజాయించారు. “అధోగతికి చేర్చు వ్యామోహం ఇదే కదా” అంటూ వాత్స్యాయన మహర్షితో రాజు విభేదించి, కామశాస్త్ర అవసరమేమిటని సంవాదించినట్టుగా ఈ రూపకాన్ని మొదలుపెట్టారు. ధర్మం తప్పి కామంతో చరించిన రావణాసురుడు, కీచకుడు లాంటివారికి పట్టిన దుర్గతిని కళ్ళకు కడుతూ, సాక్షాత్తూ జగద్గురు ఆదిశంకరులు సైతం ఆధ్యాత్మిక జ్ఞానంలో ఓ భాగంగా కామాన్ని గుర్తించిన తీరును బ్యాలేలో ప్రస్తావించారు. “ఏమిది మైకము... ఏమిది తమకము... ఏదో తెలియని వ్యామోహము” అంటూ తృతీయ పురుషార్థ ప్రతిపాదన చేశారు. ఈ ధర్మార్థానంతర పురుషార్థ సాధనలో “ఆలుమగలను ఆనంద తీరాలు చేర్చే సూత్రాలు” కామసూత్రాలు అన్నది నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. సమయ, సందర్భోచితంగా ‘భర్తృహరి శృంగార శతకం’లోని అంశాలను సైతం రూపకంలో చేర్చారు.

“చంద్రహారాలు... ప్రేమ కలాపపు ప్రియచిహ్నాలు... మగని తలపించు తీయని గురుతులు”గా నఖ క్షతాలు, అలాగే దంత క్షతాలు, ఆలింగనాలు, సంయోగ భంగిమలను యువ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ‘ఉత్సాహానికి ఉత్పలకం’, ‘విశృంఖలతకు విజృంభితకం’, ‘ఇష్టరాగమునకు ఇంద్రాణికం’ తదితర సంక్లిష్టమైన సంభోగ బంధనాలను అంతే సమర్థంగా నర్తకులు చూపడం విశేషం. ఎక్కడా అసభ్యత, అశ్లీలం అనిపించకుండా ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను ప్రేక్షకుల ముందుకు తేవడం కత్తి మీద సామే! దాన్ని ఓ సవాలుగా తీసుకొని, సంప్రదాయ శైలి నృత్య ముద్రలు, దరువులతో... నృత్య సంయోజనం చేయడంలో నాట్యాచారిణిగా స్వాతి తన అసమాన ప్రతిభ కనబరిచారు. అందరినీ మంత్రముగ్ధులను చేశారు. వాత్స్యాయనుడిగా రవితేజ, రాజుగా – శివుడిగా మెహర్ ప్రభాకర్, పార్వతిగా దూసి వైష్ణవి, సూత్రధారిణులుగా హేమాంజలి, శ్రుతి కొంజర్ల, గీతిక, యశస్విని, కవలలైన అక్కాచెల్లెళ్ళు భానుశ్రీ – భవ్యశ్రీ, తదితరులు ఉత్తమ ప్రదర్శన అందించారు.

ఒక హీరో... ఇద్దరు హీరోయిన్లు... అద్భుత సమన్వయం
ముఖ్యంగా కథానాయకుడిగా అరకు ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు కొర్రా బలరామ్ అలుపూ సొలుపూ లేకుండా గంటన్నర పైగా ఈ అపురూప నాట్యవిన్యాసాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ రూపకానికి మూలస్తంభంగా నిలిచారు. ఇంగ్లీషులో సాగిన నేపథ్య వ్యాఖ్యానం, రూపకంలో అడుగడుగునా సందర్భోచిత వాద్య సంగీతం, గాత్ర మాధుర్యం, వేణునాదం సహా పలు వాద్య పరికరాల వినియోగం... ప్రదర్శనను ఆసక్తిగా మలిచి, ఆహ్లాదభరితం చేశాయి.

చ‌ద‌వండి: మ‌న‌కు తెలియ‌ని మ‌న‌ భీముడి కోణంలో భార‌తం

“సిగ్గే సుదతికి సింగారం... అది చెలికానికి ఆకర్షణం” అనే అంశంలో తొలి కథానాయికగా సీతంపేటకి చెందిన నిమ్మల అంజలి ముద్దరాలి సిగ్గును అభినయించిన తీరు ఆకట్టుకుంది. నాయికను ప్రేరేపించే సఖిగా లిఖిత అభినయం అంశానికి నిండుదనం తెచ్చింది. ఇక, ఈ రూపకంలో ద్వితీయ కథానాయికగా చేరడేసి కళ్ళు, చెరగని చిరునగవు మోముతో, అణువణువునా అభినయం నింపుకొని నర్తించిన యామినీ కసిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. నృత్యపరిశోధనకు పీహెచ్డీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ పొందిన యామిని రానున్న రోజుల్లో నర్తకిగా మరింత రాణించడం ఖాయం.

ఆద్యంతం లోపరహితంగా, అత్యంత సమన్వయంతో, అతి ప్రసన్న వదనంతో సాగిన ఈ నాయకా, నాయికల ముగ్గురి ప్రదర్శన నిస్సందేహంగా వారి పట్టుదల, కఠోరశ్రమ, నిత్యం గంటలకొద్దీ వారు చేసిన నిరంతర సాధన ఫలితమే. గూఢకమ్, బిందుమాల, ప్రవాళమణి, మణిమాల లాంటి పలు వాత్స్యాయన ప్రయోగాల ప్రదర్శన చూసి, ప్రేక్షకులు అచ్చెరువొందారంటే అతిశయోక్తి కాదు. నాట్య బృందమంతా కేవలం వేదికపై నటిస్తున్నట్టు కాకుండా, ఆ పాత్రలు తామే అయినట్టుగా ఇహం మరిచి ఆ క్షణంలో జీవించి, రససిద్ధి కలిగించడం ఈ ప్రదర్శనకు పంచప్రాణాలైంది. ఇలా ఈ శిష్యులందరినీ తీర్చిదిద్దడానికి సమస్త శక్తియుక్తులూ ధారపోసిన స్వాతీ సోమనాథ్ అంకితభావానికి పదే పదే వినిపించిన సభికుల హర్షధ్వానాలు తరగని కితాబులుగా నిలిచాయి.

దాదాపు పాతికేళ్ళ క్రితమే... స్వాతి సంచలన ప్రయోగం
ఒకప్పుడు 1980లో రవీంద్రభారతి వేదికపైనే అరంగేట్రం చేసి, 2003లో తాను స్వయంగా అదే వేదికపై ‘కామసూత్ర’ డ్యాన్స్ బ్యాలే ప్రదర్శనతో సంచలనం రేపి, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తన శిష్యులతో దాన్నే  ‘అర్ధనారీశ్వరమ్’గా అందించిన కళాకారిణి స్వాతీ సోమనాథ్‌కు ఇది అక్షరాలా ఓ ప్రత్యేకమైన సందర్భం. జీవితంలో మరపురాని అపురూప జ్ఞాపకం. “ఈ పిల్లల కౌశలం వెనుక ఎనిమిదేళ్ళ నిరంతర కృషి, సుదీర్ఘ సాధన దీని వెనక ఉంది. నిజానికి, ఈ ‘సంప్రదాయం’ ఏర్పాటుకు ముందు స్వాతి వేరు. తరువాతి స్వాతి వేరు. నా జీవితమే మొత్తం మారిపోయింది. పన్నెండేళ్ళుగా శ్రీకాకుళానికే పరిమితయ్యాను. అపరిమిత అవకాశాలకు కేంద్రమైన హైదరాబాద్ నగరాన్నీ, కుటుంబాన్నీ వదిలి శ్రీకాకుళానికి వెళ్ళి పనిచేయడం కష్టమే. ‘సంప్రదాయం’ ట్రస్ట్ వ్యవస్థాపనకు ప్రభుత్వ కృషిలో భాగమై, నాట్యగురువుగా అక్కడ జీతానికి పనిచేస్తున్నఇన్నేళ్ళుగా ఎన్నో అవస్థలు పడ్డాను. వ్యక్తిగతంగా మరెన్నో త్యాగాలూ చేశాను. కానీ, ఇవాళ అద్భుతంగా తయారై, నాట్యంలో పీహెచ్డీ చేసే స్థాయికి ఎదిగిన ఈ నవతరం పిల్లల్ని చూసినప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోతుంటాను. కళాజీవితంలో నా కృషికి అర్థం, పరమార్థం సిద్ధించినట్టు భావిస్తుంటాను” అని నీళ్ళు నిండిన కళ్ళను అదుపు చేసుకుంటూ స్వాతీ సోమనాథ్ వ్యాఖ్యానించారు.

అభివృద్ధిలో వెనుక.. అసమాన ప్రతిభలో ముందు... 
అర్ధనారీశ్వర స్తోత్రంతో నర్తకీ నర్తకులు ప్రస్తుతించగా, శివపార్వతుల కేళీ విలాసంతో ముగిసిన తాజా ‘అర్ధనారీశ్వరమ్’ నృత్యరూపక ప్రదర్శనను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా ప్రేక్షకులు రావడం ప్రత్యేకించి గమనార్హం. ముఖ్య అతిథిగా హాజరైన ‘భారత్ బయోటెక్’ మేనేజింగ్ డైరెక్టర్ ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, తదితర ప్రముఖులు కళాకారులను అభినందించారు. తమిళనాట నైవేలిలో పుట్టి పెరిగి, మద్రాసులో చదువుకున్న తనకు బాల్యం నుంచి సంగీతం, నాట్యం తదితర లలితకళలతో ఉన్న అనుబంధాన్ని సుచిత్ర పంచుకున్నారు. “మా ఊరికి కేవలం గంట ప్రయాణంలో చిదంబరం పట్టణం, ప్రపంచానికి కేంద్రబిందువుగా భావించే చిదంబరం నటరాజస్వామి ఆలయం ఉంటాయి. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళితే చిదంబరం దర్శిస్తుంటాను” అని ఆమె తెలిపారు. ఇలాంటి నృత్యరూపక ప్రదర్శనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం, సంస్కృతి ఘనతను ప్రపంచానికి చాటతాయని అభిప్రాయపడ్డారు.

ఇక, స్వాతి సమకాలికురాలు – కూచిపూడి శిక్షణలో ఒకప్పటి సహాధ్యాయి అయిన యశోదా ఠాకూర్, “పదం, జావళీలతో దేవదాసీ నృత్యం ద్వారా స్వయంగా శృంగార రసాభినయాన్ని విద్యార్థులకు బోధిస్తున్న నేను స్వాతికి వీరాభిమానిని. సాహసించి, ఎన్నో ప్రయోగాలు చేసే ఆమె నాకు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిత్యస్ఫూర్తి” అని అభినందించారు. “ఆద్యంతం కళ్ళకూ, చెవులకూ విందు”గా బి.పి. రావు అభివర్ణించిన ఈ రూపకానికి మూలస్తంభాలుగా నిలిచిన వారంతా శ్రీకాకుళం ప్రాంత వాసులే కావడం విశేషం. స్వయానా శ్రీకాకుళం ప్రాంతమే పురిటిగడ్డ అయిన స్వాతీ సోమనాథ్‌తో పాటు ఆమె శిష్యబృందం, బ్యాలే ప్రదర్శనకు లైటింగ్, కాస్ట్యూమ్స్, సంగీతం అందించిన అందరూ ఆ ప్రాంతానికి చెందినవారే. అభివృద్ధిలోనే తప్ప అసమాన ప్రతిభలో ఉత్తరాంధ్ర వెనుకబడలేదనడానికి ఇది నిదర్శనమని అతిథులు అభిప్రాయపడ్డారు.

కూచిపుడి నాట్యచరిత్రలో కొత్త అధ్యాయం
స్వాతీ సోమనాథ్ తొలి గురువైన భాగవతుల రామకోటయ్య కుమారుడూ – కూచిపూడి సంప్రదాయంలోనే పుట్టి పెరిగి, స్వయంగా నాట్యాచార్యుడైన భాగవతుల సేతురామ్ అన్నట్టు, “కూచిపూడి నాట్యచరిత్రలో ఇది ఓ కొత్త అధ్యాయం”. సాహిత్యం, సంగీతం, నృత్యసంయోజనం త్రివేణీ సంగమమై, వేదికను రసప్లావితం చేసిన అరుదైన ఘట్టం. అదీ ఎక్కడో మారుమూల ఉత్తరాంధ్ర నుంచి, వెనుకబడిన ప్రాంతంగా భావించే చోట నుంచి, వెనుకబడిన గిరిజన వర్గాల నుంచి ఇలాంటి అపురూప ప్రతిభావంతులైన యువ కళాకారులు పైకి రావడం అపూర్వం. సముద్రపుటొడ్డున శాంతినికేతనంలా ఉండే ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకుల ట్రస్ట్ చేసిన ఓ అద్భుతం. ఇలాంటి ప్రతిభా సుమాలు మరిన్ని పల్లవించాలంటే, ఆర్థికంగా ఇప్పటికీ అస్తుబిస్తుగా ఉన్న ‘సంప్రదాయం’కి ప్రభుత్వంతో పాటు కళాభిమానులు, దాతలు కాపుగా నిలవాలి. ‘అర్ధనారీశ్వరమ్’ లాంటి ప్రదర్శనలు ఊరూరా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటా అన్ని దేశాల్లో ప్రదర్శించాలి. సుచిత్రా ఎల్లా తదితరులు పేర్కొన్నట్టు, ‘మన తెలుగువారి కూచిపూడి ఘనతనూ, మన భారతీయ కళా, సాంస్కృతిక ప్రాభవాన్నీ ప్రపంచానికి చాటడానికి’ అదే సరైన మార్గం!

- రెంటాల జయదేవ

Advertisement
 
Advertisement
Advertisement