అద్వితీయ అనువాదానికి స్వాగతం! | Advitheeyuni Athmankatha Novel Launch Event | Sakshi
Sakshi News home page

సినిమా కన్నా ముందే తెలుగులోకి వచ్చిన మలయాళ నవల

Apr 6 2026 11:46 PM | Updated on Apr 6 2026 11:46 PM

Advitheeyuni Athmankatha Novel Launch Event

మలయాళ సాహిత్యంతో, సినిమాలతో మంచి పరిచయం ఉన్న చదువరులకు ఓ శుభవార్త. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఓ సుప్రసిద్ధ మలయాళ రచన ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 'పద్మభూషణ్' ఎంటి వాసుదేవన్ నాయర్ నాలుగు దశాబ్దాల క్రితం రచించిన మలయాళ నవల 'రెండామూజం'(రెండోసారి - 1984) నవల.. సాహితీ లోకంలో సుప్రసిద్ధం. పురాణపాత్ర భీమసేనుడి దృక్కోణం నుంచి మహాభారత గాథని వినూత్నంగా పాఠకలోకం ముందు ఉంచిన ఈ ఐతిహాసిక నవల కొన్ని దశాబ్దాలుగా మలయాళంలో బెస్ట్ సెల్లర్. పదే పదే పునర్ముద్రణలు పొందడమే కాకుండా ఇప్పటికే ఇంగ్లీషు (సెకండ్ టర్న్, భీమ – లోన్ వారియర్), తమిళం (ఇరండామ్ ఇడమ్), కన్నడం (భీమాయణ)తో సహా వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైన మోస్ట్ పాపులర్ రచన.

భీమసేనుడి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ని హీరోగా తీసుకొని, ఆ నవలని వెండితెరకు ఎక్కించాలని ఇప్పటికి దశాబ్దిన్నర క్రితమే పలు ప్రయత్నాలు జరిగాయి. దర్శకులు నిర్మాతలు మారుతూ వచ్చినా దురదృష్టవశాత్తూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనేలేదు. అపరిమితమైన ఆలస్యానికి కినిసిన రచయిత ఎంటి.. చివరకు సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్ళి, నిర్మాతలు తనకిచ్చిన కోటింబాతిక రూపాయల పెద్ద అడ్వాన్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి మరీ, నవల ఆధారంగా తానే రాసిచ్చిన సినిమా స్క్రిప్ట్‌ని వెనక్కి తీసేసుకున్నారు. ఇది కొద్దిమందికే గుర్తున్న కథ. దాదాపు వెయ్యి కోట్ల పైగా బడ్జెట్‌తో, 2020 నాటికి రెండు భాగాల సినిమాగా తెలుగు సహా వివిధ భాషల్లో రావాల్సిన ఆ 'రెండామూజం' నవల ఎట్టకేలకు సినిమా కన్నా ముందుగా ఇప్పుడు 'అద్వితీయుని ఆత్మకథ' పేరిట అనువాద రచనగా తెలుగు సాహితీ లోకం ముందుకు వచ్చింది.

మలయాళంలో మన 'మిథునం' దర్శకుడు

నిర్మాల్యం(1973)లాంటి పలు అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించి దాదాపు 60 సినిమాలకు స్క్రిప్టులు రాసిన చరిత్ర ఎంటి వాసుదేవన్ నాయర్‌ది. రచయిత శ్రీరమణ ప్రసిద్ధ తెలుగు కథ 'మిథునం'ని తెలుగులో కన్నా పుష్కరకాలం ముందే మలయాళంలో 'ఒరు చెరు పుంచిరి'(చిరు నగవు – 2000) పేరిట సినిమాగా రూపొందించిన దర్శకుడు. అందుకు తగ్గట్టే, ఆయన ప్రసిద్ధ మలయాళ నవల ‘రెండామూజం’ తెలుగు అనువాదం ఆవిష్కరణ సైతం సాహితీ ప్రియులైన ముగ్గురు తెలుగు సినీ ప్రముఖుల సాక్షిగా ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ రచయిత వి.ఆర్.గణపతి తెలుగులో అనువాదం చేసిన ఈ పుస్తకాన్ని నటుడు,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. మంచి పుస్తకాలకు వీలైనంత ప్రచారం కల్పించి, జనంలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఎం.టి. వాసుదేవన్ నాయర్ రచన తెలుగులోకి రావడం ఎంతైనా ఆనందదాయకమని తనికెళ్ళ అన్నారు. ఇటీవల తాను ప్రత్యేకించి ‘హంసవింశతి’ కావ్యాన్ని తెలుగులో ప్రచురింపజేసి, ప్రచారం కల్పించడంతో లభిస్తున్న స్పందన గురించి ప్రస్తావించారు.

రచయిత ముళ్ళపూడి వెంకట రమణ గారి సతీమణి – స్వయానా రచయిత్రి అయిన ముళ్ళపూడి శ్రీదేవి మాట్లాడుతూ, 'ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిదేదీ ప్రపంచంలో లేదు' అంటూ వ్యాస భారతంలోని విశేషాలను ప్రస్తావించారు. భీమసేనుడు చెప్పినట్టుగా సాగే ఈ నవల రచయిత బ్నిమ్ మాటల్లో చెప్పాలంటే, “భీమసేనుడి సెల్ఫీ భారతం” అంటూ చమత్కరించారు.

మన తెలియని మన భీముడి కోణంలో భారతం

రచయిత్రి – కాలమిస్ట్ ప్రొఫెసర్ సి. మృణాళిని ప్రసంగిస్తూ.. దాదాపు పదేళ్ళ పైగా ఎం.టి.తో వ్యక్తిగతంగా తనకున్న సాహితీ అనుబంధాన్నీ, ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన జ్ఞాపకాలనూ పంచుకున్నారు. తెలుగు సాహిత్యలోకానికి భిన్నంగా... బిరుదులతో కాక, “మన ఎం.టి.” అంటూ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించే మలయాళీ సాహిత్య సంస్కృతిని ఆమె ప్రస్తావించారు. అలాగే, ఎం.టి. వాసుదేవన్ నాయర్ కేరళలో స్వస్థలమైన తిరూర్‌లో ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరుపుతూ వచ్చిన ‘తుంజన్ సాహితీ ఉత్సవం’ తాలూకు గొప్పతనాన్ని వివరించారు. రామాయణ, భారత, భాగవతాలను మలయాళంలో అందించిన ‘మలయాళ ఆది కవి’, ‘ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడు’ అయిన (తుంజత్ రామానుజన్) ఎళుత్తచ్చన్ పేరిట ఆ ఉత్సవాన్ని ఏటా ఎం.టి. అద్భుతంగా జరిపే తీరును మృణాళిని గుర్తు చేసుకున్నారు. “యాదృచ్ఛికంగా ఎం.టి.కీ, నాకూ మధ్య జరిగిన ఆఖరి సంభాషణ కూడా ఈ ‘రెండామూజం’ నవల గురించే! 2022లో క్యాలికట్‌లో మహాభారతంపై వివిధ భాషలతో వారితో జరిగిన జాతీయ సాహిత్య సదస్సులో పాల్గొన్నప్పుడు ఈ ‘రెండామూజం’ నవల తెలుగు అనువాదం ప్రస్తావన మా మధ్య వచ్చింది. ఈ నవల అప్పటికే ఇంగ్లీషులో అనువాదమైంది. అయితే, ఇంగ్లీషు నుంచి కాక, మలయాళం నుంచే ఆ తెలుగు అనువాదం సాగాలని ఆయన ప్రత్యేకంగా కోరుకున్నారు” అని మృణాళిని తెలిపారు.

‘అద్వితీయుని ఆత్మకథ’ పుస్తకాన్ని కూలంకషంగా సమీక్షించిన మృణాళిని, “నటనలో దిలీప్ కుమార్ లాగా, రచనలో ఎం.టి. వాసుదేవన్ నాయర్ అలా! నాటకీయతకు అవకాశం ఉన్నా, ఆ జోలికి పోకుండా, అండర్ ప్లే చేస్తారు. భారతాన్ని ఎం.టి. చూసిన దృష్టి వేరు. గతంలో కొందరు రచయితలు కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ లాంటి పాత్రలను ప్రధానంగా ఎంచుకొని తమదైన పద్ధతిలో భారత కథ రాశారు. కానీ, నూర్గురు కౌరవులను సంహరించడంతో సహా భారతంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ తన మనసులోని మాటలను ఎన్నడూ బయటకు చెప్పుకోని భీమసేనుడి దృష్టి నుంచి ఈ నవల సాగడం విశేషం. పాండవుల్లో ద్వితీయుడైనా, అందరికీ తెలిసిన భుజ పరాక్రమంతో పాటు మానసిక చిత్తవృత్తిలోనూ అద్వితీయుడిగా అనిపించే భీముడి పాత్ర తాలూకు రెండో కోణాన్ని సమాంతరంగా, అద్భుతంగా చెబుతుందీ నవల. ఎంతో పరిశోధించి, వ్యాసభారతంలో లేని అంశాలను కొన్నింటిని జొప్పించడంతో పాటు, వ్యాసుడు నిశ్శబ్దంగా ఉన్నచోట ఆ ఖాళీలను పూరిస్తూ ఎం.టి. ఈ అసాధారణ నవలను మలయాళంలో రచించారు. భారత ఇతిహాస కథలోని మాయలు, మహిమలను పరిహరించి, చాలా సహజంగా, హేతుబద్ధంగా, భీముని సున్నితత్వం, మానసిక చైతన్యం, స్త్రీల మానసిక స్థితిని అర్థం చేసుకొనే తత్వాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తూ ఈ నవల సాగడం గమనార్హం” అంటూ అనేక ఉదాహరణలతో లోతుగా విశ్లేషించారు.

అందుకే... ఆ సాహిత్యం, సినిమా అంత విలక్షణం!

చలం ‘దోషగుణం’ కథ ఆధారంగా ‘గ్రహణం’ మొదలు పలు ఆంగ్ల రచనల ఆధారంగా ‘అష్టాచెమ్మా’, ‘సారంగపాణి జాతకం’ దాకా పలు చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. “ఇవాళ చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడా ప్రమాదకరంగా చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రలకు సమకాలీనత ముఖ్యం. ఆ దృక్కోణంతో పాత్రలనూ, ఇతిహాసాలనూ ఆవిష్కరించగల రచయితల అవసరం ఉందిప్పుడు. మలయాళ సాహిత్యం, సినిమాల్లో ఆ పనే చేస్తుంటారు. అందుకే అవి విలక్షణంగా నిలుస్తున్నాయి” అని అభిప్రాయపడ్డారు.

సినీ నటుడు – రచయిత – దర్శకుడు అవసరాల శ్రీనివాస్ సభలో మాట్లాడుతూ, సాహిత్యంపై తనకున్న అక్కరను పంచుకున్నారు. “తెలుగు సాహిత్యం కోసం బాధపడుతున్నవారితో నేనూ గొంతు కలుపుతున్నా. బహుశా, అందుకే ఇటీవల కాలంలో వివిధ సాహిత్య సమావేశాల్లో నాకూ స్థానమిస్తున్నారు. కోవిడ్ అనంతర కాలంలో చదవడం కొంత తగ్గింది. నేను చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేయడమే కాక, తెలుగు సాహిత్య ప్రచారం కోసం నా వంతు కృషి చేస్తా” అని ఆయన హామీ ఇచ్చారు.

పలుకు తేనెల తెలుగు... ‘పాలక్కాడ్’ గణపతి!

మలయాళ మాతృక ‘రెండామూజం’ తెలుగు అనువాద రచయిత వి.ఆర్. గణపతి ప్రత్యేకంగా ఈ సభ కోసం కేరళ సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు రావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ వాస్తవ్యులు. తమిళ, మలయాళాల నుంచి తెలుగులోకి పలు అనువాదాలు చేస్తున్న ఆయన ఇప్పటికే ప్రముఖ మలయాళ రచయిత్రి పి. వత్సల రచన ‘ఆగ్నేయం’తో పాటు మరో ప్రసిద్ధ మలయాళ రచయిత ముకుందన్ రచన ‘దైవత్తిండ వికృతిగళ్‌’ను ‘వైకుంఠపాళి’గా తెలుగులోకి చేశారు. ఇంగ్లీషు నుంచి కాక, ఎం.టి. రచించిన మలయాళ మాతృకనే ఆధారంగా చేసుకొని, సరళమైన తెలుగులో, హాయిగా చదివించేలా ఆయన అనువాదాలు చేయడం విశేషం. మాతృకలోని ఆచారాలు, సంప్రదాయాలు, తిట్లు, సామెతలను అనువదించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావిస్తూనే, ఆయన ఈ తాజా అనువాద ప్రస్థానం విశేషాలను పంచుకున్నారు.

“నేను పెరిగింది, చదివింది కరీంనగర్‌లోనే. తెలుగునాట ఉద్యోగం కూడా చేశాను. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగిగా ఎందరో మిత్రులను సంపాదించుకున్నాను. నిజానికి, ఎం.టి. తన రచనల అనువాదానికి అంత సులభంగా అనుమతినివ్వరు. సినిమా స్క్రిప్టుల కోసం తన వద్దకు వచ్చేవారిని సైతం ఆయన అనేక నెలలు తిప్పించుకొని, వారి శ్రద్ధను పరీక్షించాకనే ఒప్పుకొనేవారు. అలాంటిది... ఆయన సుప్రసిద్ధ రచన ‘రెండామూజం’ తెలుగులోకి చేయాలని ‘కథాప్రపంచం’ కిరణ్ నన్ను కోరినప్పుడు, ‘ఎం.టి. అనుమతి ఇచ్చినప్పుడు కదా’ అని తేలికగా తీసుకున్నా. కానీ, కిరణ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన అనుమతి సాధించి, నాతోనే అనువాదం చేయించారు. నిజానికి, 2024లోనే ఈ అనువాదం పూర్తయింది. ఎం.టి.కి చూపించి, ఆయన ఆశీర్వాదం తీసుకుందామనుకొనే లోగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. మా ఆశ తీరకుండానే ఆయన కన్నుమూయడం మాకు తీరని లోటు” అంటూ ఎం.టి.కి గణపతి నివాళులర్పించారు.

మరిన్ని అనువాదాల విందుకు మార్గం!

నిజానికి, మలయాళంలో ‘రెండామ్ ఊజం’ (సంధి ప్రక్రియ వల్ల... ‘రెండామూజం’) అంటే... ‘రెండో సారి’ అని అర్థం. అయితే, ఆ పేరును తెలుగు పాఠకలోకానికి సన్నిహితమయ్యేలా అర్థవంతంగా ‘అద్వితీయుని ఆత్మకథ’గా సమర్పించడం అనువాదకుడి శ్రద్ధాభక్తులకు నిదర్శనం. మంచి అభిరుచితో మేలైన పుస్తకాలు ప్రచురించడంలో ముందుంటున్న తిరుపతికి చెందిన ‘కథా ప్రపంచం’ ప్రచురణల అధినేత కిరణ్ ఈ తెలుగు అనువాదాన్ని అందించారు. ఎంతో కాలం, ధనం, శ్రమ వెచ్చించి, పట్టుదలగా ఆయన ఈ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందించడాన్ని తనికెళ్ళ, ఇంద్రగంటి, అవసరాల సహా అతిథులందరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.

సీనియర్ జర్నలిస్ట్ రాజేశ్వరీ కల్యాణం సభా నిర్వహణ సాగించిన ఈ సమావేశంలో రచయిత వాసిరెడ్డి నవీన్, బ్నిమ్, సినీ సమాచార సేకర్త పంచకర్ల రమేశ్, సీనియర్ జర్నలిస్టు పద్మశ్రీ, ఆకాశవాణి వార్తావిభాగం జ్యోత్స్న సహా పలువురు సినీ, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. అనువాద రచయితకు పూర్వాశ్రమ మిత్రులు – సహచరులైన ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు పెద్దయెత్తున వచ్చి, ఆయనను అభినందించారు. తిరుపతి ‘కథా ప్రపంచం’ కిరణ్ అతిథులను సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయతను పంచారు. ఎం.టి. వాసుదేవన్ నాయర్ బృహత్తర కృషిగా పేర్కొనే ‘కాలం’ (1969) సహా మరిన్ని నవలలు, కథలను తెలుగులోకి తెచ్చేందుకు ఈ ‘అద్వితీయుని ఆత్మకథ’ ఆవిష్కరణ కొత్త దారులు వేసినట్టే కనిపిస్తోంది. అదే జరిగితే... తెలుగు పాఠక లోకానికి అంతకన్నా అక్షరాల విందు మరేముంటుంది!

-రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement