ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం! | The Rise of Little Treat Culture Why Gen Z Finds Comfort in Small Purchases | Sakshi
Sakshi News home page

ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం!

May 25 2026 7:39 AM | Updated on May 25 2026 8:36 AM

The Rise of Little Treat Culture Why Gen Z Finds Comfort in Small Purchases

నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, ఆర్థిక అనిశ్చితి కారణంగా యువత తీవ్ర అలసటకు గురవుతోంది. ఈ క్రమంలోనే ‘లిటిల్ ట్రీట్ కల్చర్’ అనే సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క కాఫీ లేదా చిన్న పేస్ట్రీని ఆస్వాదించడం, ‘క్యూట్ స్టేషనరీ’  కొనుగోలు చేయడం ద్వారా తాత్కాలికంగా మానసిక ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. అసలు ఈ ట్రెండ్ వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమేనా లేక మానసిక ఆరోగ్యానికి సంకేతమా?

ఏంటీ ‘లిటిల్ ట్రీట్ కల్చర్’?
'లిటిల్ ట్రీట్ కల్చర్' అంటే పెద్ద పెద్ద ఖర్చులు కాదు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మూడ్ బాలేనప్పుడు తమకు తాముగా ఇచ్చుకునే చిన్న చిన్న బహుమతులు. ఒక కప్పు కాఫీ, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్, లేదా ఆన్లైన్‌లో ఒక చిన్న కీచైన్ కొనడం మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. ఇది కేవలం వస్తువును కొనడం కాదు, కష్ట సమయంలో తనను తాను ఓదార్చుకునే ఒక భావోద్వేగ ప్రక్రియ.

పాండమిక్ తర్వాత ఊపందుకున్న అలవాటు
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో అనిశ్చితి పెరిగింది. పెద్ద పెద్ద లక్ష్యాల కోసం వేచి చూడటం కంటే, రోజువారీ జీవితంలోనే చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవడం సులభమని యువత భావిస్తోంది. భారీ షాపింగ్‌లు లేదా ఖరీదైన హాలిడే ట్రిప్పుల కంటే, కేవలం రూ. రూ. 100లోపు ఖర్చుతో లభించే కాఫీ లేదా స్వీట్, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని  నమ్ముతున్నారు.

సోషల్ మీడియాలో ‘మెయిన్ క్యారెక్టర్’ మూమెంట్స్
ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఈ ట్రెండ్‌ను మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చాయి. తాము కొన్న చిన్న వస్తువులను, తమ రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను ‘మెయిన్ క్యారెక్టర్ మూమెంట్స్’గా సోషల్ మీడియాలో ప్రదర్శించడం ఫ్యాషన్‌గా మారింది. ‘ఈరోజు చాలా కష్టపడ్డాను, కాబట్టి నాకో చిన్న ట్రీట్’ అనే వ్యాఖ్యలు ఇప్పుడు యువతకు అత్యంత ఆనందకర అనుభూతినిస్తున్నాయి.

మెదడుపై చిన్న ట్రీట్ల ప్రభావం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న చిన్న సంతోషకరమైన పనులు మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక భారం, సామాజిక ఒత్తిడి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రివార్డులు ఒక రకమైన ‘ఎమోషనల్ రీసెట్’గా పనిచేస్తాయి. ఇక్కడ వస్తువు కంటే, ఆ వస్తువును కొనేటప్పుడు కలిగే ఆత్మసంతృప్తి ముఖ్యమైనది.

మైక్రో-లగ్జరీల మార్కెటింగ్ మాయాజాలం
ఈ ట్రెండ్‌ను బ్రాండ్‌లు కూడా చక్కగా వాడుకుంటున్నాయి. చిన్న సైజు పర్ఫ్యూమ్‌లు, ట్రావెల్-సైజ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులు, క్యూట్ డెకర్ వస్తువులను ‘మైక్రో-లగ్జరీ’లుగా ప్రచారం చేస్తున్నాయి. తక్కువ ధరలో దొరికే ఈ విలాసాలు ఆర్థికంగా భారం కాకపోవడం వల్ల, యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇదే ఇప్పుడు ఒక భారీ వ్యాపార మార్గంగా మారింది.

ఇది మంచిదా? లేక అనారోగ్యకరమా?
చిన్న చిన్న ఆనందాలు తప్పు కాదు. కానీ అది వ్యసనంగా మారకూడదు. ప్రతి చిన్న కష్టానికి షాపింగ్‌పైనే ఆధారపడటం ఆర్థికంగా చిక్కుల్లో పడేయవచ్చు. అప్పుడప్పుడు తీసుకునే ‘ట్రీట్’ ఒక రకమైన ఊరటనిస్తే, అదే పనిగా ఖర్చు చేయడం అనేది ‘ఎమోషనల్ స్పెంటింగ్’ అనే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే సంతోషం అనేదానిని కొనుగోలుతోనే తెచ్చుకోకుండా, ఇతర ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా కూడా సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హార్ముజ్‌ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’

Advertisement
 
Advertisement
Advertisement