ఆకుపచ్చ ధనం

Reshma Ranjan from Jharkhand left her government job to pursue her passion for gardening - Sakshi

పచ్చగా కళకళలాడటం అంటే ఏమిటో రేష్మా రంజన్‌కు తెలుసు. అందుకే తృప్తినివ్వని గవర్నమెంట్‌ ఉద్యోగాన్ని వదిలి మరీ ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో ఏం చేసింది? తనకిష్టమైన మొక్కలు పెంచింది. మట్టి, నీరు, కుండీ, ఆకు, ఎరువు... ఇవి ఎలా ఉపయోగిస్తే ఇంటి మొక్కలు అందంగా అద్భుతంగా ఉంటాయో బాగా తెలుసుకుంది. వాటినే వీడియో పాఠాలు చేసింది. ‘ప్రకృతీస్‌ గార్డెన్‌’ పేరుతో వందలాది వీడియోలు చేసింది. పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఏర్పడ్డారు. రేష్మా దిశా నిర్దేశంలో ఇళ్లల్లో మొక్కలు పెంచుతున్నారు. వారు హ్యాపీగా ఉన్నారు. దీనివల్ల వచ్చే ఆదాయంతో రేష్మా పచ్చగా ఉంది.

జార్ఘండ్‌లోని బొకారోలో రేష్మా రంజన్‌ ఇంటికి వెళితే చిన్న సైజు వనంలో అడుగు పెట్టినట్టు ఉంది. దాదాపు 2000 అందమైన, రకరకాల కుండీల్లో వందలాది రకాల మొక్కలు కనిపిస్తాయి. కొత్తిమీర, పొదీనాతో మొదలు ఆపిల్, అవకాడో వరకూ రేష్మా కుండీల్లో సృష్టించనిది అంటూ ఏదీ లేదు. ఒక కుండీలో ఉల్లిపాయలు పెరుగుతుంటాయి... మరో కుండీలో అనాసపళ్లు... ఇంకో కుండీలో చిలగడ దుంపలు, మరో కుండీలో నేతి బీరకాయలు... ఇక పూలైతే లెక్కే లేదు. వాటి మధ్య కూచుని వీడియోలు చేస్తుంటుంది రేష్మా. కేవలం తను పెంచి చూసిన మొక్కల గురించే ఆమె మాట్లాడుతుంది. ఆ అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు కాబట్టే ఆమెకు పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు.

► బాల్యం ముఖ్యం
బాల్యంలో ఏర్పరిచే మంచి ప్రభావాలు వారికి జీవితాంతం ఉంటాయి అనడానికి రేష్మ రంజన్‌ ఒక ఉదాహరణ. రేష్మాది బొకారో అయినా ఐదో క్లాస్‌ వరకూ బీహార్‌లోని పల్లెలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది. తాతయ్య ఇంట్లో విపరీతంగా చెట్లు. ‘దారిన పసిబిడ్డను వదిలి వెళ్లిపోతే చూసినవారు ఎలా కలత చెందుతారో ఎవరైనా ఏదైనా మొక్కను పారేసి ఉంటే మా తాత అంత కలత చెందేవాడు’ అంటుంది రేష్మా. అతడు ఎక్కడ ఏ మొక్క నిర్లక్ష్యంగా పడేసి ఉన్నా తెచ్చి ఇంట్లో దానికి ప్రాణం పోసేవాడు. రేష్మా మూడో క్లాసు పాసై నాలుక్కు వెళుతున్నప్పుడు మూడు మొక్కలు తెచ్చి వీటిని నువ్వే పెంచాలి అని చెప్పాడు తాతయ్య. ‘అయితే నేను మరీ అతిగా పెంచి ఎక్కువ నీళ్ళు, ఎక్కువ ఎరువు వేసేసి వాటిని చంపేశాను’ అని నవ్వుతుంది రేష్మా. ఆ గుణపాఠం నుంచి బాల్యంలోనే మొక్కలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకుంది. ‘అదే మొక్కల మీద నా ప్రేమకు అంకురం’ అంటుంది రేష్మా.

► ఉద్యోగంలో అసంతృప్తి
ఇంటర్‌ తర్వాత ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐ.సి.ఏ.ఆర్‌) నుంచి అగ్రికల్చర్‌ సైన్స్‌ డిగ్రీ చేసిన రేష్మా ఆ వెంటనే అగ్రికల్చర్‌ కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ‘2015లో నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టమైన ఉద్యోగం అనుకున్నాను. నా పని రైతులకు వారి పంట పోషణలో సాయం చేయడం. కాని నా లాంటి చిన్న పిల్ల చెప్తే వినడం ఏమిటి అనుకునేవారో లేదా వారి సంప్రదాయ జ్ఞానం మీద విశ్వాసమో కాని నేను చెప్పే సూచనలు రైతులు వినేవారు కాదు. అంతేకాదు మట్టిని బట్టి, విత్తును బట్టి పంటలో మార్పు చేర్పులు చెప్తే లక్ష్యం చేసేవారు కాదు. ఆ అసంతృప్తి నాకు ఉండేది. మరోవైపు ఉద్యోగం వల్ల నేను స్వయంగా మొక్కలు పెంచలేకపోయేదాన్ని. అదే సమయంలో నా చదువును చూసి ఫ్రెండ్స్‌ ఫలానా మొక్కలు ఎవరు వేయాలి... ఫలానా తీగను ఎలా పెంచాలి... అని సలహా అడిగేవారు. ఈ అన్ని సమస్యలకు సమాధానంగా ఉద్యోగం మానేసి యూట్యూబ్‌ చానల్‌ మొదలెట్టాను’ అంటుంది రేష్మా.

► పదివేల మంది అనుకుంటే
‘నేను మొక్కలు, తీగలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయలు, ఇండోర్‌ ప్లాంట్లు... వీటన్నింటిని ఎలా పెంచారో, కేర్‌ తీసుకోవాలో చెప్తే నాలాగే మొక్కలను ఇష్టపడే ఒక పదివేల మంది అయినా ఫాలో కాకపోతారా అనుకున్నాను. సహజ పద్ధతిలో గులాబీ పెంచడం ఎలా? అనేది నా మొదటి వీడియో. దానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. పది వేల మంది అనుకుంటే రెండు మూడేళ్ల లోనే లక్ష మంది అయ్యారు. 2016 నుంచి నా పాఠాలు కొనసాగితే 2022 చివరకు పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ అయ్యారు. ప్రొడక్ట్‌ ప్రమోషన్స్‌ కోసం వచ్చే వారి వల్ల కాని, యూట్యూబ్‌–ఫేస్‌బుక్‌ పేజ్‌ వల్ల కాని నాకు నెలకు లక్ష నుంచి లక్షన్నర ఆదాయం వస్తోంది’ అంటుంది రేష్మా.
ఒక పనిలో పూర్తిగా నైపుణ్యం ఉంటే ఆ పనిలో ఆనందం, ఆదాయం రెండూ పొందవచ్చు. మీకు బాగా మొక్కలు పెంచడం వస్తే రేష్మాలా యూట్యూబ్‌ చానల్‌ నడపొచ్చు. బాగా మొక్కలు పెంచాలని ఉంటే ఆమె చానల్‌ ఫాలో కావచ్చు.
‘అందరూ మొక్కలు పెంచితే ప్రపంచం పచ్చగా మారడానికి ఎక్కువ టైమ్‌ పట్టదు’ అని రేష్మా చెప్పే మాట అందరూ వినాలి.

► అందమైన ఇల్లు
మొక్కలు ఎలా అంటే అలా పెంచడం కాదు. వాటిని అందమైన కుండీల్లో అందమైన అరల మీద పెడితే వచ్చే అందాన్ని కూడా రేష్మా చెబుతుంది. సహజంగా ఎరువుల్ని, క్రిమి సంహారకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపుతుంది. సేంద్రియ విధానాలు కూడా చూపుతుంది. ఇండోర్‌ ప్లాంట్స్‌ ఎలా శుభ్రం చేయాలి అనే ఆమె వీడియో ఇండోర్‌ ప్లాంట్స్‌ ఉన్నవారంతా చూడతగ్గది. ‘వాల్‌ డెకరేషన్‌’గా గోడలకు కుండీలు బిగించి ఎలాంటి మొక్కలు పెంచాలో చూపుతుంది. ఇంకా ఆమె చెప్పే విషయాలు అనంతం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top