ప్రపంచ దేశాల ప్రోగ్రెస్‌ కార్డు | World Population Review 2025 Education Quality | Sakshi
Sakshi News home page

ప్రపంచ దేశాల ప్రోగ్రెస్‌ కార్డు

Jun 29 2025 7:36 AM | Updated on Jun 29 2025 12:00 PM

World Population Review 2025 Education Quality

వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ 2025 విద్యా నాణ్యత ర్యాంకింగ్స్‌ నివేదిక 

ఒక చిన్న పాఠశాల గది నుంచే ఒక దేశం మారవచ్చు ఒక నోట్‌బుక్‌ పేజీ నుంచే ఒక తరం చరిత్రను తిరగరాయవచ్చు అందుకే, ప్రపంచం మొత్తం విద్యావిధానమే అభివృద్ధికి ఆలంబన కాగలదని విశ్వసిస్తోంది.

ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఒక అద్భుతమైన రేసులో ఉన్నాయి. అయితే, ఇది రన్నింగ్‌  రేసు కాదు, రీడింగ్‌ రేసు! ఈ రేసులో పరుగులు తీసేది విద్యార్థులే అయినా, ఫలితాలు మాత్రం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇక్కడ కుల, మత, వర్ణ భేదాలకు చోటు లేదు – ఒక్కటే అవసరం: విద్యపై నిబద్ధత! దేశాలన్నీ పాఠశాల వేదికపై ఎగబడి, చదువు అనే శక్తిమంతమైన ఆయుధంతో భవిష్యత్తులో తమ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇందుకోసం, ఆ పక్కన క్యాలిక్యులేటర్‌ పెట్టుకుని, స్మార్ట్‌ బోర్డు ముందు నిలబడి, ల్యాబ్‌ కోట్స్‌ వేసుకుని ప్రభుత్వాలు తమ విద్యా వ్యవస్థలపై ఉన్న విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి.

కాని, ఈ రేసులో ఎవరు ముందున్నారో, ఎవరు ఇంకా నిద్రలోనే జోగుతున్నారో తెలుసుకోవడానికి ‘వరల్డ్‌ పాపులేషన్‌  రివ్యూ’ సంస్థ 2025 సంవత్సరానికి విద్యా నాణ్యత ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని దేశాలు దుమ్మురేపేలా టాప్‌ గేర్‌లో దూసుకెళ్తుంటే, మరికొన్ని మాత్రం ఖాళీ బ్యాగు వేసుకుని, ఫస్ట్‌ పీరియడ్‌ మిస్‌ చేసుకున్నట్లుగా దిగాలుగా ఉంటున్నాయి. ఇంకా, ఇందులో ఏ దేశానికి పరీక్షల్లో ఎన్ని మార్కులొచ్చాయి? ఎవరు టాప్‌ స్కోర్‌ కొట్టారు? ఎవరు ‘పాస్‌’ అయ్యారు? మరెవరు ఇంకా ప్రోగ్రెస్‌ కార్డులో రెడ్‌ లై¯Œ  దాటి నిలబడినవాళ్లు? వంటి విషయాలన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచ విద్యా పోటీకి ఒక స్పష్టమైన ఫలితాల బోర్డు ఇది!

ప్రపంచ దేశాల విద్యా ప్రమాణాలను విశ్లేషించేటప్పుడు మూడు ప్రధాన అంశాలను ఆధారంగా తీసుకున్నారు. అవేంటంటే: 
1. ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్థిరత్వం, ప్రభావం
2. విశ్వవిద్యాలయాల గ్లోబల్‌ ఆకర్షణ 
3. విద్యలో ప్రపంచ స్థాయి నాణ్యత

ఈ మూడు విభాగాల్లో మెరుగైన ఫలితాలను సాధించిన దేశాలు ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశాల్లో ముందంజలో ఉన్నాయి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మార్పు దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇంకా కొన్ని దేశాల్లో ప్రాథమిక విద్య కూడా అందని పరిస్థితి ఉంది. ఉదాహరణకు చాద్, దక్షిణ సూడాన్‌ వంటి దేశాల్లో అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉండటంతో, అవి అభివృద్ధికి ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. 2025 సంవత్సరానికి ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్‌ జాబితాను ‘వరల్డ్‌ పాపులేషన్‌  రివ్యూ’ విడుదల చేసింది. అందులో టాప్‌ 10 దేశాలు విద్యారంగంలో ముందు వరుసలో నిలిచాయి – అవేంటో చూద్దాం!


దక్షిణ కొరియా
మేధాశక్తి
దక్షిణ కొరియా అంటే కేవలం కే– పాప్, టెక్నాలజీ మాత్రమే కాదు, దాని అసలైన శక్తి అక్కడి విద్యా వ్యవస్థలో ఉంది. చిన్న దేశం అయినా, గణితశాస్త్రం, సాంకేతిక విద్యా ప్రమాణాల్లో  ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోంది. ఒక అధ్యయనంలో 15 ఏళ్ల విద్యార్థులలో చైనా తర్వాత అత్యధిక ఐక్యూ స్కోర్లు సాధించిన దేశం ఇదే! ఇది క్రమశిక్షణ, కుటుంబాల సహకారం, ప్రభుత్వ ప్రాధాన్యాల వలనే సాధ్యమైంది. ఇక్కడ చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, టెక్నాలజీతో మిళితమై, పిల్లల భవిష్యత్తుకు మార్గం వేస్తోంది.

డెన్మార్క్‌
ఒత్తిడిలేని బోధన
వైకింగ్‌ల చరిత్రతో ప్రసిద్ధి చెందిన డెన్మార్క్‌ నేడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలలో రెండో దేశంగా నిలుస్తోంది. జనాభా అరవై లక్షలే అయినా, చదువులో దీని స్థానం గొప్పది. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన పెంపొందించడం, ఒత్తిడిలేని బోధన ఈ దేశం ప్రత్యేకతలు. ఇక్కడ చదువు అనేది పరీక్షల కోసమే కాదు, జీవిత పాఠాలను నేర్చుకునే మార్గం. ప్రభుత్వం విద్యపై సమగ్రంగా ఖర్చు చేస్తూ, సమానావకాశాలు కల్పిస్తుంది. పాఠశాలలోనే పిల్లలు చర్చా వేదికల్లో పాల్గొంటూ సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ విధానాల వలనే డెన్మార్క్‌ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాలోనూ చేరింది.

నెదర్లండ్స్‌
స్వేచ్ఛగా ఆలోచించే విద్యార్థులే 
నెదర్లాండ్స్‌ లోని విద్యా విధానం కేవలం విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించారు. తక్కువ ఒత్తిడి, ఎక్కువ చర్చలతో పిల్లలు చదవటం ఈ దేశ ప్రత్యేకత. ఇక్కడ చదువు కేవలం పాఠశాలలోనే కాదు, సమాజంలో కూడా నేర్చుకోవాల్సిన ప్రక్రియగా ఉంటుంది. విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ పెట్టుబడులతో నాణ్యమైన బోధన అందించడం, టెక్నాలజీని తరగతి గదికి తీసుకురావడం ఈ దేశాన్ని ముందు వరుసలో నిలిపాయి. జనాభాలో మెజారిటీ డచ్‌ వారే అయినా, వలసదారులకు కూడా సమానమైన విద్యా అవకాశాలు లభిస్తున్నాయి. ఇది విద్యలో సమానత్వానికి నిజమైన ఉదాహరణ.

బెల్జియం
అందరికీ విద్య
భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే, చదువే అసలైన మార్గం అని బెల్జియం చెబుతుంది. అత్యుత్తమ విద్యా విధానాల్లో విశేషంగా ఎదుగుతూ, అగ్రస్థానాల్లో నిలుస్తోంది ఈ దేశం. రాజధాని బ్రసెల్స్‌ యూరోపియన్‌ యూనియ¯Œ కు కేంద్రంగా ఉండటం, దీని విద్యా ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఇక్కడి విద్యా వ్యవస్థ బహుభాషా విధానం, సమానత్వం ఆధారంగా ఉంటుంది. డచ్, ఫ్రెంచ్, జర్మన్‌ భాషల్లో విద్య అందుతుండటంతో పిల్లలలో బహుభాషా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, ఫ్లెమిష్, వాలున్, జర్మన్‌ వలసదారులు అందరూ చదువులో భాగస్వాములవడం ఇక్కడ సాధారణం. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

స్లోవేనియా
వలసదారులకూ సమాన విద్య
కేవలం 20 లక్షల జనాభా ఉన్నా ఈ చిన్న దేశం వంద శాతం అక్షరాస్యతతో ఐదవ స్థానంలో ఉంది. నాణ్యమైన బోధన, ప్రభుత్వం మద్దతు, వలస వచ్చిన జనాభాకు కూడా సమానంగా విద్యను అందించడంతో ఇది సాధ్యమైంది. చదువు సమాజాన్ని ఏకీకృతం చేసే  మార్గంగా ఎలా పనిచేస్తుందో 
చెప్పే ఒక ఉదాహరణగా ఈ దేశం నిలిచింది.  

జపాన్‌
క్రమశిక్షణ శక్తి 
పురాతన దేవాలయాలు, మౌంట్‌ ఫుజీ వంటి ప్రకృతి అందాలతో పాటు, జపా¯Œ  విద్యా రంగంలోనూ విశేషమైన గుర్తింపు పొందింది. ఇక్కడ విద్యా వ్యవస్థ క్రమశిక్షణ, కఠిన శ్రమ, నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులోనే పిల్లలు గణితం, శాస్త్రం, సాంకేతికతలో చురుకుగా మారతారు. ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన బోధన పద్ధతులు ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు. జపా¯Œ లో 98 శాతం జనాభా జాపనీస్‌ ప్రజలే. జాతి పరంగా ఏకత్వం ఉన్నా, విద్యకు విస్తృత దృక్కోణంలో ఉంది.

జర్మనీ
ఉచితంగా ఉన్నత విద్య
కోటలు, ఆధునిక నగరాలతో ప్రసిద్ధి గాంచిన జర్మనీ, విద్యా రంగంలోను అగ్రగామిగా నిలుస్తోంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన రంగాల్లో ఇది ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఇక్కడ విద్యా వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఉచిత ఉన్నత విద్యతోపాటు ప్రభుత్వ మద్దతుతో విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల ప్రాక్టికల్‌ స్కిల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మతాలు, భాషలు భిన్నమైనా, చదువు విషయంలో సమానత్వం కొనసాగుతుంది.

ఫిన్లండ్‌
చదువు చల్లగా, బతుకు హాయిగా స్వచ్ఛమైన సరస్సులు గుర్తొచ్చే దేశం ఫిన్లండ్‌. ఇక్కడ విద్య అనేది పోటీకి సిద్ధం చేసే మార్గం కాదు, బలమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. ఒత్తిడిలేని తరగతులు, ప్రాజెక్టు ఆధారిత బోధన, విద్యార్థులే కేంద్రంగా రూపొందించిన పద్ధతులు ఫిన్లండ్‌ విద్యకు ప్రత్యేకత తీసుకొచ్చాయి. పరీక్షలు తక్కువ, ఆలోచన ఎక్కువ ఇక్కడి విద్యార్థుల విజయ రహస్యం. ఈ దేశం ప్రపంచ హ్యాపీనెస్‌ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో ఉండటానికి కారణం కూడా ఇదే!

నార్వే ఆలోచనా శక్తి పెంచే బోధన
నార్దన్‌ లైట్స్‌ వంటి ప్రకృతి అద్భుతాలకు నిలయమైన నార్వే, విద్యా ప్రమాణాల్లో ముందంజలోనే ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ స్వేచ్ఛ, సమానత్వం, నాణ్యతతో కూడినది. విద్యార్థులలో ఆలోచనాశక్తిని పెంచేలా బోధన సాగుతుంది. ప్రభుత్వ మద్దతుతో విద్య ఉచితంగా అందుతూ, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అలాగే, నార్వే జీవన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి. చదువుతో పాటు అక్కడ లభించే ఉన్నతమైన ఆరోగ్యసేవలు  కూడా విద్యార్థుల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి.

ఐర్లండ్‌
విద్యలో వైవిధ్యం
టెక్నాలజీ ఆధారిత విద్యా రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశం ఐర్లండ్‌. రాజధాని డబ్లి¯Œ  వంటి నగరాల్లో వలసదారుల పెరుగుదలతో విద్యలో వైవిధ్యం పెరిగింది. ఇక్కడ విద్యా విధానం ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ దేశం, సాంకేతిక, జైవ శాస్త్ర రంగాల్లో విద్యను శక్తిగా వినియోగిస్తోంది. ఉద్యోగావకాశాలకు అనుగుణంగా ఉంటూ అనేక అంతర్జాతీయ విద్యార్థులకు ఆశ్రయంగా మారింది.

ఈ జాబితా నుంచి మనం గమనించగలిగేది ఏమిటంటే అత్యుత్తమ స్థాయిలో విద్యను అందిస్తున్న దేశాలు అన్నీ ఏకకాలంలో ఆర్థికంగా, సాంకేతికంగా, సమాజపరంగా కూడా ముందున్నాయి. వీటిల్లో వంద శాతం అక్షరాస్యతతో స్లోవేనియా అత్యుత్తమ విద్యా నాణ్యతకు ఒక అద్భుత నిదర్శనం. మిగతా దేశాలలో అక్షరాస్యత శాతం గణాంకాలు అందుబాటులో లేవు గాని, విద్యా నాణ్యత అత్యుత్తమంగా ఉండడం వల్ల వాటి స్థానం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశాలు తమ విద్యా విధానాలను సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించు కొని, విద్యార్థులకు ఒత్తిడి లేని, పరిశోధన ప్రాతిపదికన ఉన్న, ఆచరణాత్మకమైన విద్యను అందిస్తున్నాయి. ఫలితంగా ఈ దేశాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు, ఉచిత లేదా తక్కువ ధరల్లో ఉన్నత విద్య అవకాశాలు, స్వేచ్ఛాయుత విద్యా వాతావరణం కనిపిస్తున్నాయి.

ఇండియా
ఇంకా ‘వికాస దశ’లోనే! 
ఇండియా అంటేనే విశాలమైన సంస్కృతి, శాస్త్రవేత్తలు, ఐటీ మేధావులు గుర్తొస్తారు. కాని, ప్రపంచ విద్యా రంగపు ర్యాంకింగ్స్‌లో చూస్తే, మన దేశం ఇంకా ‘వికాస దశ’లోనే ఉంది. 2025 విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 101వ స్థానంలో నిలవడం కొంచెం చేదుగా అనిపించినా, ఇది మన విద్యా వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది. మన పక్కనున్న దేశాల పరిస్థితి చూస్తే చిన్న దేశాలైన నేపాల్‌ 56, భూటాన్‌ 88వ స్థానాల్లో మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. పాకిస్థాన్‌ 136, అఫ్గానిస్తాన్‌ 146, బంగ్లాదేశ్‌ 122వ స్థానాల్లో మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో అసలైన షాక్‌ ఏంటంటే, మన పొరుగునే ఉన్న చైనా మాత్రం 13వ స్థానంలో మెరిసిపోతూ ప్రపంచానికి చదువుల దారులు తెరుస్తోంది.

మన వెనుకబాటుకు కారణాలు
ఇందుకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతుల లోపం అని చొప్పొచ్చు. అందుకే మన అక్షరాస్యత రేటు 74 శాతం దగ్గరే నిలిచిపోయింది. కాని, మార్పు మొదలైంది. నూతన విద్యా విధానం, డిజిటల్‌ లెర్నింగ్, గ్రామీణ విద్యపై దృష్టి, బాలికల విద్యకు ప్రాధాన్యం వంటి చర్యలు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. అయితే, టాప్‌ 10లోకి వెళ్లాలంటే ప్రాథమిక విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ, సమానత్వం కీలకం. ఇప్పుడు ఉన్నదంతా ప్రారంభం మాత్రమే! సరైన దిశగా నడిస్తే, భారతదేశం కూడా భవిష్యత్తులో ప్రపంచ విద్యా శిఖరాలను అధిరోహించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.

పేజీ కూడా తెరవలేదు
ప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా  కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్‌ ఆపిల్‌’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్‌ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్‌ సూడాన్‌ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్‌ జోన్‌ లో ఉన్నాయి. స్కూల్‌కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్‌ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే!

చిన్న దేశాల గొప్ప విజయాలు
ఒకప్పుడు ‘చిన్న దేశాలు’ అనే పేరు వింటే, మనకు గుర్తొచ్చేది వాటి పరిమిత వనరులు, అభివృద్ధి లోపం, పెద్ద దేశాల మీద ఆధారపడే పరిస్థితులు. కాని, ఇప్పుడు? అవే చిన్న దేశాలు పుస్తకాలతో పరుగు తీస్తూ, ప్రపంచ విద్యా వేదికపై సగర్వంగా నిలుస్తున్నాయి. కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, లాట్వియా, ఇస్టోనియా, లిథువేనియా... వీటి పేర్లు చాలామందికి టూరిజం బ్రోషర్‌ల ద్వారా మాత్రమే తెలిసి ఉండొచ్చు కాని, ఇప్పుడు ఇవే దేశాలు విద్యలో వందశాతం అక్షరాస్యతతో టాప్‌ లైన్‌ లో నిలబడ్డాయి! చదువు విషయంలో ఇవి చిన్న దేశాలు కాదు, చదువుల మహారాజులు! నేపాల్‌ (71 శాతం) భూటాన్‌ (72 శాతం) వంటి హిమాలయాల మధ్యన ఉన్న దేశాలు కూడా అక్షరాస్యతలో అగ్రస్థానానికి చేరుతున్నాయి. 2025 నాటికి ప్రపంచం మొత్తం అక్షరాస్యత సగటు 72.91 శాతం అంటే, ఈ చిన్న దేశాల ప్రభావం ఎంత ఉంటుందో ఊహించండి! వనరులు తక్కువైనా, విజన్‌ పెద్దది. డబ్బు లేకపోయినా, గొప్ప సంకల్పం ఉంది. ప్రభుత్వాల నిబద్ధత, విద్యా విధానాలలో స్పష్టత, ప్రతి పాఠశాలలో బలమైన ఫౌండేషన్‌... ఇవే ఈ దేశాలను అగ్రస్థానాలకు చేర్చాయి.

టాపర్‌లాంటిది! 
విద్యా వ్యవస్థలో టాప్‌ ర్యాంక్‌ వచ్చినంత మాత్రాన, చదువులో టాప్‌ స్కోర్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు! పేరుకు ప్రపంచంలో ఉత్తమ విద్యా సంస్థలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా నంబర్‌ వన్‌. కానీ సబ్జెక్ట్‌ వైజ్‌లో చూస్తే? గణితంలో 38వ స్థానం, సై¯Œ ్సలో 24వ స్థానం – అచ్చం ‘టాపర్‌’ ముసుగులో ‘బోర్డర్‌ పాస్‌’ అన్నట్టు! ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’ అనే సంస్థ ఇచ్చిన గణాంకాలు, బెస్ట్‌ కంట్రీస్‌ రిపోర్ట్‌ లెక్కలు– ఇలా ఒక్కో సంస్థ ఒక్కో విధంగా మార్కులు వేస్తుండడంతో, ర్యాంకింగ్‌ ఒక పజిల్‌లా మారిపోయింది. ఎక్కడైనా పుస్తకాలతో కప్పేసి ‘ఉత్తమ విద్యా సంస్థ’ అన్న ట్యాగ్‌ పెడితే సరిపోదు. అసలైన విషయాలు చూడాలి. పిల్లలు చదువుతున్నారా? టీచర్లు బాగా బోధిస్తున్నారా? ప్రభుత్వ పెట్టుబడులు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అనే విషయాలు కూడా కీలకమే! ఇక ‘గ్లోబల్‌ సిటిజన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’ వంటి సంస్థలు బాగానే మ్యాటర్‌ను పసిగట్టాయి. 

విద్యా వ్యవస్థ అంటే చిన్నారి స్కూల్‌ అడ్మిషన్‌ నుంచీ పెద్దల అక్షరాస్యత వరకూ మొత్తం జీవన ప్రయాణాన్ని గమనించాలి అని అంటున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే టాప్‌ ర్యాంక్‌ అనేది పేపర్లో ఉండే డిజైన్‌ మాత్రమే! అసలైన చదువు ఏమిటో, అది జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చూసే చూపు అవసరం. లేదంటే టాపర్‌ గుండెల్లోని ర్యాంక్‌ కాస్త, రిజల్ట్‌ వచ్చాక ‘ఒక్క మార్క్‌ మిస్‌ అయ్యింది!, లేకుంటే నేనే టాప్‌’ అని అంటాయి. విద్య అనేది కేవలం ఒక పాఠశాల గది వరకు మాత్రమే పరిమితమైంది కాదు. అది వ్యక్తిని మారుస్తుంది. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది; కుటుంబం మారితే సమాజం మారుతుంది; సమాజం మారితే దేశం మారుతుంది. అందుకు విద్యే మార్గం, విజ్ఞానమే శక్తి.

పేజీ కూడా తెరవలేదు
ప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా  కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్‌ ఆపిల్‌’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్‌ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్‌ సూడాన్‌ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్‌ జో¯Œ లో ఉన్నాయి. స్కూల్‌కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్‌ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement