ప్రసవ వేదన తర్వాత అంతటి వేదన..! | Postpartum depression Symptoms and causes | Sakshi
Sakshi News home page

పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌: ప్రసవ వేదన తర్వాత అంతటి వేదన..!

Oct 26 2025 10:25 AM | Updated on Oct 26 2025 11:39 AM

Postpartum depression Symptoms and causes

ముద్దుమురిపాలతో మురిపించే ఓ చిన్నారి కొత్త సభ్యుడిగా / సభ్యురాలిలా ఇంట్లోకి రావడం ఎంతో సంతోషదాయకమైన విషయం. అయితే అప్పటివరకూ ప్రసవవేదన అనుభవించిన ఆ తొలిచూలు తల్లుల్లో కొందరికి మాత్రం అదో భయానకమైన అనుభవం. ప్రసవం అయ్యాక కొంతమంది తల్లుల్లో ఆ అనుభవం కొంత కుంగుబాటు (డిప్రెషన్‌) రూపంలో కనిపిస్తుంది. కొత్తగా అమ్మ అయిన చాలామందిలో కనిపించే ఆ డిప్రెషన్‌ ప్రభావాలు చాలామందిలో తక్కువగానే ఉన్నా మరికొందరిలో మాత్రం... చిన్నారి పట్ల తల్లి చూపాల్సిన కేర్‌కు అడ్డంకిగా మారేంత పెద్దవిగానూ ఉండవచ్చు. 

ఇలా ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్‌ను పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌’ (పీపీడీ) అంటారు. ఒక అంచనా ప్రకారం ప్రసవం తర్వాత తల్లికి డిప్రెషన్‌ వచ్చే కేసులు చాలావరకు గుర్తింపునకు కూడా నోచుకోకపోవడంతో ఆ తల్లులు తమ వేదనను నిశ్శబ్దంగా అనుభవిస్తూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, పర్యవసానాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. 

బిడ్డపైనా ప్రభావం... తల్లి తన బిడ్డను దగ్గరికి తీసుకోకపోవడం, తన పాలు పట్టించడానికి సుముఖంగా లేకపోవడం, బిడ్డ పట్ల విముఖతతో సమయానికి పీడియాట్రీషియన్‌ దగ్గరికి తీసుకెళ్లకపోవడం వంటి అంశాలతో తల్లి తాలూకు డిప్రెషన్‌ ప్రభావం బిడ్డపైనా పడేందుకు అవకాశం లేకపోలేదు.

కొత్తగా పాపాయి పుట్టిన సంతోషం కూడా ఆ తల్లుల్లో కనిపించకుండా చేసే ఈ పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌కు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు గర్భధారణ ప్రక్రియలో అప్పటివరకు వారు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న సవాళ్లూ, ప్రసవం తర్వాతి ఉద్వేగపూరితమైన వెల్లువ, హార్మోన్లపరంగా దేహంలో వేగంగా జరుగుతున్న మార్పులు, కొన్నిసార్లు వాళ్ల సామాజిక, ఆర్థిక అంశాలూ ఇవన్నీ ‘పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌’కు కారణాలవుతాయి. అయితే అది తమ తప్పు కాదనీ, తమకు తెలియని కారణాల వల్ల అలా జరుగుతోందోని తెలియని తల్లులు అపరాధభావనకు లోనవుతూ మరింతగా కుంగి΄ోతుంటారు.

కారణాలు... 
హార్మోన్ల తగ్గుదల : గర్భధారణ సమయంలో మునపటి కంటే దాదాపు పదింతలు పెరిగిన ఈస్ట్రోజెన్, పప్రొజెస్టెరాన్‌ హార్మోన్లు ప్రసవం కాగానే ఒకేసారి తగ్గి΄ోవడం. ప్రసవం జరిగిన మూడోరోజుకే అవి పదింతలు (ప్రీ–ప్రెగ్నెన్సీ స్థాయులకు) తగ్గి΄ోవడం ∙ప్రసవం సమయంలోని శారీరక శ్రమ, నిద్రలేమి, భవిష్యత్తులో పేరెంటింగ్‌ గురించి బెంగ... ఈ అంశాలన్నీ ΄ోస్ట్‌΄ార్టమ్‌ డిప్రెషన్‌కు కారణమవుతాయి.

పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌లో రకాలు... 
తల్లులుఎదుర్కొనే భావోద్వేగాల తీవ్రతలను బట్టి వీటిని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. 

1) పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌ / బేబీ బ్లూస్‌ : పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌లో 50% నుంచి 75% వరకు ఈ రకమైనవే ఎక్కువ. ఈ రకం డిప్రెషన్‌ సాధారణంగా ప్రసవం తర్వాత మొదటివారంలో (మరీ ముఖ్యంగా మొదటిరోజు నుంచి మొదలుకొని నాలుగు రోజుల్లో) కనిపిస్తుంది. మొదట్లో కొత్త తల్లిని బాధించే లక్షణాలు చికిత్స తీసుకోకపోయినప్పటికీ రెండువారాల్లో తగ్గిపోతాయి. తల్లిలో ఈ డిప్రెషన్‌ కనిపించినప్పుడు భర్త, కుటుంబసభ్యులు సపోర్ట్‌ ఇస్తే చాలు. 

2) పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ : ఇది మొదటిదానికంటే కాస్త ఎక్కువ తీవ్రతతో కనిపిస్తుంది. మొదటిసారి పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌ కనిపించిన తల్లికి అటు తర్వాతి ప్రసవాల్లోనూ (దాదాపు 30% కేసుల్లో) ఇది రావచ్చు. సాధారణంగా కొన్ని నెలలు మొదలుకొని, ఏడాది వరకూ లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. కొద్దిపాటి సైకోథెరపీ  అవసరమవుతుంది. 

3) పోస్ట్పార్టమ్‌ సైకోసిస్‌ : పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌లో అత్యంత తీవ్రమైన దశ ఇది. ప్రతి వెయ్యి ప్రసవాల్లో ఒకరిలో కనిపిస్తుంది. ఇది కూడా కొన్ని నెలలు మొదలుకొని ఏడాది వరకూ తల్లిలో దీని తాలూకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. నిద్రలేమి, విపరీతమైన కోపం, అయోమయం లాంటివి అత్యంత తీవ్రంగా ఉంటాయి.

చివరగా... కేవలం ప్రసవం తర్వాతనే కాకుండా కొంతమంది మహిళల్లో ప్రసవం ముందు... అంటే గర్భధారణ సమయంలోనూ డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని గమనించిన కుటుంబ సభ్యులు ఫాలో అప్‌ సమయంలో ఆ విషయాన్ని డాక్టర్‌కు తెలపాలి. లేదా ఒక్కోసారి పేషెంట్‌ మాటలను బట్టి డాక్టర్లే ఆ విషయాన్ని పసిగడతారు. అలాంటప్పుడపు అవసరాన్ని బట్టి ఆ పేషెంట్‌కు సైకియాట్రీ చికిత్స లేదా కౌన్సెలింగ్‌ను డాక్టర్లు సూచిస్తారు.                               

లక్షణాలు...  
పై మూడు రకాల డిప్రెషన్‌లలోనూ కొత్త తల్లి కనబరిచే లక్షణాలు స్వల్పమైనవిగా మొదలుకొని, రకాన్ని బట్టి ఓ మోస్తరు నుంచి చాలా తీవ్రంగా కూడా ఉండవచ్చు. అవి... 

కారణం లేకుండానే తీవ్రమైన దుఃఖం, చాలా ఎక్కువగా ఏడ్వటం 

పాపాయి మీద ఏమాత్రం ఆసక్తికరబరచకపోవడం. (కొన్ని సందర్భాల్లో చిన్నారిపైనా ఉద్రిక్తంగా వ్యవహరించడం, డిప్రెషన్‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కొందరు పాపాయిపై దాడి చేయడం, గాయపరచడానికి ప్రయత్నించడం) ∙చాలా విచారంగా ఉండటం 

దేనిపైనా ఆసక్తి లేక΄ోవడం, గతంలో తనకు సంతోషాన్ని ఇచ్చిన వ్యాపకాలపైనా ఆసక్తి ఉండక΄ోవడం

అతి చురుకుగా లేదా అతిగా ఉండే ప్రవర్తన 

ఆకలి తగ్గడం 

నిద్రపట్టడంలో ఇబ్బంది / నిద్రలేమి (కొద్దిగా మొదలుకొని తీవ్రంగా) 

మూడ్స్‌ త్వరత్వరగా మారిపోవడం 

ఎప్పుడూ నిస్పృహతోనూ విచారంగా ఉండటం, అపరాధభావన (గిల్ట్‌) 

దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఏకాగ్రత లోపించడం 

పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న కొందరు ఆత్మహత్యకూ యత్నించడం. 

నిర్ధారణ... 
ఈ సమస్య నిర్ధారణకు నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షా లేదు. అయితే బాధితురాలిని క్షుణ్ణంగా పరిశీలించడం, లక్షణాల గురించి బాధితురాలి భర్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.

చికిత్స...  

బాధితురాలి సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ప్రధానంగా కౌన్సెలింగ్‌ ద్వారా చికిత్స అందిస్తారు. ఇలాంటి చికిత్సలో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ లాంటి వారి భూమిక చాలా కీలకం. 

తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారికి తప్పనిసరి అయితే యాంటీ యాంగ్జైటీ మందులు లేదా యాంటీ డిప్రెసెంట్స్‌ వంటి మందులను సూచిస్తారు. ఎంతకీ తగ్గనంత తీవ్రత ఉన్నప్పుడు కొందరికి ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ (ఈసీటీ) అని పిలిచే షాక్‌ ట్రీట్‌మెంట్‌ కూడా ఇస్తారు. 

అయితే కొందరు సాధారణ ప్రజల్లో దీని పట్ల అ΄ోహలు ఉన్నప్పటికీ ఇది ఏమాత్రం హాని కలిగించనిదీ, చాలా సురక్షితమైనదని అందరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరముంది.  

(చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్‌ గురు'..)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement