తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు | Parenting: Anantha Lakshmi Guiding Children 2025 Parenting Tips | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు

May 24 2026 8:59 AM | Updated on May 24 2026 11:20 AM

Parenting: Anantha Lakshmi Guiding Children 2025 Parenting Tips

ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్‌ అనంతలక్ష్మి పిల్లల పెంపకంలో ‘ఒత్తిడి, పోటీ, అతిగా పట్టుకోవడం అనే సమస్యను నేటి తరం ఎదుర్కొంటోంది’ అని చెబుతున్నారు. అధ్యాపకురాలిగా తన జీవితపు తొలినాళ్లలో ముగ్గురు కూతుళ్ల పెంపకం ఎలా సాగించారో చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే...

‘‘నేడు పిల్లల పెంపకం కష్టంగా మారలేదు. కష్టం అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తమ సుఖానికి, సంతోషానికి పిల్లలు అడ్డు వస్తారని కొందరు భావిస్తే, తాము ఎక్కువ డబ్బు కట్టి చదువులు చెప్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నారు. నిజానికి ర్యాంకుల ఒత్తిడిలో తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు. 

సర్దుబాట్లు లేవు
మా అమ్మనాన్నలు మమ్మల్ని, మేం మా పిల్లల్ని పెంచినప్పుడు కష్టం అనిపించలేదు. ఈ రోజుల్లో ‘అతి గారాబం’ చూస్తున్నాం. పెంచడం కష్టం అని ఒక్కరిని కనడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆ ఒక్కరికి అన్నీ అమర్చాలనే ఆదుర్దాలో ఎలా పెంచాలో మర్చిపోతున్నారు. దీంతో ఆ పిల్లలు కొద్దిగా కూడా సర్దుకుపోవడం లేదు. ఒకప్పుడు పిల్లలతో సమాజంలోని నలుగురితో ఎలా కలిసిమెలిసి ఉండాలో చెప్పేవాళ్లం. ఇప్పుడవి బాగా తగ్గిపోయాయి.

సమాన బాధ్యత
రైల్వే డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేసేదాన్ని. టైమ్‌ ప్రకారం ఉద్యోగం కాబట్టి పెద్ద సమస్య లేదు. మాది ఉమ్మడి కుటుంబం. అందరూ అందరి బాధ్యతే అన్నట్టుగా ఉండేవారు. అయినా ముగ్గురు కూతుళ్లు పుట్టాక ‘ఉద్యోగం చేయను. పిల్లలను చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటాను’ అని చెప్పాను. కానీ, మా అత్తగారు ‘పిల్లల్ని నేను చూసుకుంటానులే నువ్వు ఉద్యోగానికి వెళ్లమ్మా’ అనేది. అలాగని నా ఆదాయంతో కుటుంబం గడుస్తుందని కాదు. 

మావారు కూడా గవర్నమెంట్‌ ఉద్యోగి. కానీ, చదువుకున్న చదువుకు న్యాయం చేయమని చెప్పేవారు. కుటుంబం విషయంలో నేనూ, మావారు ఇద్దరం సమానంగా బాధ్యత తీసుకున్నాం. నా డ్యూటీ పూర్తయ్యేవరకు సాయంత్రం 5 అయ్యేది. పిల్లలు మూడు గంటలకు స్కూల్‌ అయిపోయేది. ఇలాంటప్పుడు మా వారు పిల్లలను తీసుకొచ్చి, వారికి స్నాక్స్‌ పెట్టి, నన్ను పికప్‌ చేసుకోవడానికి కాలేజీ దగ్గరకు వచ్చేవారు. లంచ్‌ బ్రేక్‌ తను అలా సెట్‌ చేసుకున్నారు. 

పొదుపుగా జీవనం
మా చిన్నతనంలో పిల్లలకు డబ్బులు చేతికి ఇవ్వడం అనేది లేదు. ఏడాదికోసారి పుస్తకాలు కొనుక్కోమని పది రూపాయలు ఇస్తే అణాపైసలతో లెక్కరాసి చూపేవాళ్లం. మా పిల్లల విషయంలోనూ అదే నియమం పాటించాను. చదువులోనూ పెద్ద భారం అనిపించలేదు. ముగ్గురివీ గవర్నమెంట్‌ బడి చదువులే. 

ప్రొఫెషనల్‌ కోర్సులు కూడా గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లోనే చేశారు. పిల్లలు ఎవరైనా ‘మెడిసిన్‌ చేయాలనుంది, కానీ, మా అమ్మనాన్నలు డొనేషన్‌ కట్టలేక చదవలేకపోయాం’ అనుకోకూడదని జాగ్రత్తపడ్డాం. అందుకు తగినట్టు డబ్బు పొదుపు చేసేవాళ్లం. పిల్లల ఇష్టప్రకారం ఏది చదువుతారో దాని వరకు మా పొదుపు మొత్తాలు ఉండేలా జాగ్రత్తపడ్డాం. అయితే, ఆ డబ్బును వాడే అవసరం రాలేదు. 

బంధాలు పదిలం 
‘మమ్మల్ని ఎలా భరించావు అమ్మా’ అని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అడుగు తుంటారు నా కూతుళ్లు. ‘ఎలా భరించాం అనేది తర్వాత విషయం. మీరు హ్యాపీగా ఉన్నారా..’ అని అడుగుతాను. ‘నువ్వు సూపర్‌విజన్‌ చేసి, మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చావు. చాలా హ్యాపీగా ఉన్నాం’ అంటారు. మానవ సంబంధాలలో ఎన్నో చికాకులు వస్తుంటాయి. కానీ, అందరితో కలుపుగోలుగా ఎలా ఉండాలో పిల్లలకు చెబుతుండాలి. 

తల్లిని కాబట్టి నేను ఎలా ఉన్నా మీరు నా దగ్గరకు వస్తారు. కానీ, మీ బంధువులు, చుట్టుపక్కల వాళ్లతోనూ రిలేషన్స్‌ను పదిలపరచుకోవాలి అని చెబుతాను. బంధాలను ముందుగానే కాపాడుకోవాలి. పెద్దలు బంధాల గురించి బాధ్యతగా ఉంటే పిల్లలూ నేర్చుకుంటారు. పిల్లల చిన్నప్పుడు మా మాట వినేలాగా పెంచాలనుకున్నాం. కానీ, పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారి ఆలోచనలూ పంచుకుంటూ ముందుకు వెళ్లాం’’ అని వివరించారు ఈ ఆధ్యాత్మికవేత్త.

పిల్లలతో కలిసి చదువు
పిల్లలతో పాటు చదువుకుంటూ నేనూ పీహెచ్‌డీ చేశాను. సాహిత్యం గురించి చర్చించుకునేవాళ్లం. మావారు ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదివేవారు. అలా పిల్లలు కూడా సాహిత్యాభిలాషులు అయ్యారు. కాలేజీ టీమ్స్‌లో పాటలు పాడేవాళ్లు. థియేటర్‌ ఆర్ట్‌లో నంది అవార్డ్స్‌ తెచ్చుకున్నారు. ముగ్గురూ మంచి చదువులు చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తూనే, కుటుంబ జీవనాన్ని గడుపుతున్నారు. 

మా పెద్దమ్మాయి మైత్రేయి, రెండో అమ్మాయి రాధాకృష్ణవేణి, మూడో అమ్మాయి గార్గి కనకదుర్గ. రెండో అమ్మాయి స్పీచ్‌ పాథాలజీ అండ్‌ ఆడియాలజీ చేసింది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్, మూడో అమ్మాయి వరంగల్‌ ఎన్‌ఐటీలో చదువుకుంది. కాలేజీలో ఎన్‌సీసీ తరపున ఢిల్లీ పెరేడ్‌లో పాల్గొంది. ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌కు వెళ్లి, మేజర్‌ స్థాయికి చేరుకుంది.   
నిర్మలారెడ్డి

(చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement