Falguni Nayar: నైకా నాయిక

Nykaa highlights unapologetic relationship of womans - Sakshi

నైకా... సౌందర్య సాధనాల దిగ్గజం.. అందంతో పాటు మహిళా సాధికారత కూడా ఈ కంపెనీ లక్ష్యం... చిన్నస్థాయిలో ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రారంభించి, కొన్ని కోట్ల టర్నోవర్‌ స్థాయికి ఎదిగారు నైకా సిఈవో ఫల్గుణీ నాయర్‌.

‘పెద్దగా ఆలోచించు, చిన్నగా ప్రారంభించు’ అనే వ్యాపార సూత్రాన్ని ఆచరించి చూపారు నైకా కంపెనీ సిఈవో ఫల్గుణీ నాయర్‌. బ్యూటీ ప్రాడక్ట్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచారు. ‘మంచి శిక్షణ, ఉన్నత విద్య, అండగా నిలిచేవారు... ఈ మూడు అంశాలు ఒక స్త్రీని ఉన్నత స్థానం మీద కూర్చోబెడతాయి’ అంటారు ఫల్గుణీ నాయర్‌. చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించిన ఫల్గుణీ, అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల టర్నోవర్‌ స్థాయికి తీసుకువెళ్లారు. ఫల్గుణీ నాయర్‌ ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశాక, 19 సంవత్సరాల పాటు కొటక్‌ మహీంద్రా గ్రూప్‌కి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేశారు.

2005లో ఆ బ్యాంక్‌కి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్‌. ‘‘నాకు మేకప్‌ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్‌ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్‌ మార్కెట్, ట్రేడ్‌ గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు.

బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్‌ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. యుటీవీకి చెందిన రోనీ స్క్రూవాలా, పీవీఆర్‌ సినిమాస్‌కి చెందిన అజయ్‌ బిజిలీల నుంచి నాయకత్వ లక్షణాలతో పాటు, ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి కావలసిన ఆత్మవిశ్వాసం అలవర్చుకున్నారు.

విజయగాథ...
ఎవరు ఏ ఉత్పత్తులు వాడితే మంచిదనే విషయాన్ని వివరిస్తూ 2012లో నైకా స్థాపించారు ఫల్గుణీ నాయర్‌. ఈ ఆలోచన రావటానికి కారణం... పలురకాల ఉత్పత్తులు తయారుచేస్తున్న సెఫోరా కంపెనీ. ఎన్నడూ సౌందర్య సాధనాలు ఉపయోగించని ఫల్గుణీ, వారి ఉత్పత్తులను వాడటం ప్రారంభించారు. అప్పుడే తను కూడా ఒక కంపెనీ ప్రారంభించి, భారతదేశ సౌందర్య సాధనాలను ప్రపంచానికి చూపాలనుకున్నారు. అదేవిధంగా భారతీయ మహిళలు ఆత్మవిశ్వాసంతో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడాలని కలలు కన్నారు. ‘‘ఉత్తమ సౌందర్య సాధనాలు తయారుచేస్తూ, భారతదేశాన్ని సౌందర్య సాధనాలకు ప్రతిరూపంగా చూపుతూ, వినియోగదారులకు వాటి మీద అవగాహన కలిగించాలనుకున్నాను’’ అంటారు ఫల్గుణీ నాయర్‌.

అందంగా కనిపించాలనే కోరిక ఉన్న మహిళలకు ఈ  సాధనాలు ఉపయోగపడాలనుకున్నారు. అలా వారంతా నైకాకి అతి త్వరగా కనెక్ట్‌ అయ్యారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు దూసుకుపోవాలి.. అంటారు ఫల్గుణీ నాయర్‌.

నైకా ప్రారంభించినప్పుడు అదొక ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ మాత్రమే. ఇప్పుడు ఈ కంపెనీ మహిళా సాధికారతకు కావలసిన అంశాలను వివరించటం మీద దృష్టి పెట్టింది. ‘బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌’ మీద ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల బ్యూటీ అడ్వైజర్‌ కావటానికి అవకాశం ఉంటుంది... అంటారు ఫల్గుణీ నాయర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top