
నిర్మల్ కొయ్యబొమ్మలు ఎప్పుడైనా చూశారా? చూసేందుకు ముచ్చటగా, అందంగా ఉన్న ఈ బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలకూ చాలా నచ్చుతాయి. మరి వీటి గురించి తెలుసుకుందామా?
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారు చేసే బొమ్మలనే ‘నిర్మల్ బొమ్మలు’ అంటారు. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది. ఈ బొమ్మలను తయారు చేసేవారిని ‘నకాషీలు’ అంటారు. వీటిని పొనికి కొయ్య(కర్ర)తో తయారు చేస్తారు. కాబట్టే వీటికి ఆ అందం వస్తుంది.
1830లో ఈ ప్రాంతాన్ని దర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా గొప్పగా రాశారు. 1955లో అప్పటి ప్రభుత్వం నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బొమ్మల తయారీలో వనమూలికలు, సహజమైన రంగులు ఉపయోగిస్తారు. అడవుల్లో దొరికే ఆకు పసర్లు ఉపయోగించి బంగారు రంగును తయారు చేస్తారు. అందుకే వీటిలో జీవకళ ఉట్టిపడుతుంది.
ఈ బొమ్మలు మనదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించాయి. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మల్లో పక్షులు, జంతువులు, కూరగాయలు, ద్రాక్షపండ్లు, లవంగాలు, యాలకులు, అగ్గిపెట్టె తదితరమైనవి ప్రసిద్ధి పొందాయి. దీంతోపాటు ఇక్కడి కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నిర్మల్ కళాకారుల దేవతా చిత్రాలు ఎంతో పేరు పొందాయి.
చదవండి: ఏడేళ్లకే ఆపరేషన్ చేసిన బాలమేధావి