
మీరు ఆస్ట్రేలియా వెళుతున్నారా? అయితే అక్కడి చట్టాలు, నియమ నిబంధనల గురించి కాస్తంత తెలుసుకుని ఆ తర్వాతే వెళ్లండి. ఎందుకంటే అక్కడ బ్యాగులో పూలు పెట్టుకోవడం కూడా తప్పే! మరీ ముఖ్యంగా బయటి నుంచి పూలు తీసుకువెళ్లామా... భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. ఇదెక్కడి చోద్యం... అంటారా? చోద్యం కాదు.. నిజం. ఎందుకంటే మలయాళ నటి నవ్యా నాయర్ విషయంలో అదే జరిగింది.
ఓనమ్ పండుగ వేడుకలలో పాల్గొనేందుకు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్, తండ్రి ప్రేమతో ఇచ్చిన మల్లెచెండులో కొంత తలలో పెట్టుకుని మిగిలింది తర్వాత పెట్టుకుందాం లే అని బ్యాగ్‌లో పెట్టుకుందట. మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ‘కష్టమ్స్’ అధికారులు ఆమె బ్యాగ్‌ను చెక్ చేసేటప్పుడు ఈ పూలమాల బయట పడిందట. అంతే! వారు ఆమె ఏదో ఘోర నేరం చేసినట్లు చూసింది చాలక, 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారట.
(మన రూపాయలలో అది దాదాపు లక్షా పద్నాలుగు వేలు) ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం బయటి నుంచి పూలు, మొక్కలు, విత్తనాల వంటివి తీసుకు రావడం నేరమట. ఎందుకంటే బయటినుంచి వచ్చే ఇటువంటి వాటివల్ల అంటువ్యాధులు, వాతావరణ కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉందట. అందుకే అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటారట.
ఈ విషయాన్ని నటి నవ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘‘మా నాన్న ఇచ్చిన మూరెడు పూల చెండు మూల్యం అక్షరాలా లక్షా పద్నాలుగు వేల పైమాటే’’ అని కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం మంచిదే అయింది.. లేకపోతే అది తెలియని మన వాళ్లు తలనిండా పూలు తురుముకుని బ్యాగులో మరికాసిని పెట్టుకుని ఆస్ట్రేలియా వెళితే మన కరెన్సీలో సంచెడు రూపాయలు చలానాగా కట్టాల్సి వస్తుంది!