సాగర ధీరలకు స్వాగతం | Naval women officers team set to complete historic circumnavigation | Sakshi
Sakshi News home page

సాగర ధీరలకు స్వాగతం

May 29 2025 6:04 AM | Updated on May 29 2025 6:04 AM

Naval women officers team set to complete historic circumnavigation

న్యూస్‌మేకర్‌

ఎనిమిది నెలలు ఒక సెయిలింగ్‌ వెసెల్‌. ఇద్దరే నావికులు... మూడు మహా సముద్రాలను నాలుగు ఖండాలను 50,000 కిలోమీటర్ల దూరాన్ని భీకర వాతావరణాన్ని
దాటి విజేతలుగా  నేడు (మే 29)న గోవాకు చేరుకోనున్నారు. వీరికి ఘన స్వాగతం చెప్పడానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ రానున్నారు. ఇండియన్‌ నేవీ ఆఫీసర్లు దిల్‌నా, రూపాలకు హర్షధ్వానాలతో స్వాగతం చెప్పాల్సిన సమయం ఇది.

భారత నౌకాయాన చరిత్రలో గతంలో స్త్రీల సాహసం ఎటువంటిదో నమోదు చేసే వివరాలు అంతగా తెలియదు. కాని వర్తమానంలో మన నారీశక్తి ఎంత గొప్పదో నిరూపించే ఘనయాత్రలను నావికా దళ మహిళా ఆఫీసర్లు పదే పదే నిరూపిస్తున్నారు. నావికాదళంలోని మహిళా నావికులు తమకు తాముగా సముద్రం మీద ప్రపంచ యాత్ర చేయగలరు అని చాటడానికి 2017–18లో ఆరుగురు మహిళా సిబ్బందితో ‘నావికా సాగర్‌ పరిక్రమ – 1’ జరిగింది. 40 వేల కి లోమీటర్లు ఐ.ఎన్‌.ఎస్‌.వి. తారిణిపై చుట్టివచ్చారు. ఆరుగురు సిబ్బంది అంటే ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ఉండే వెసులుబాటు ఎక్కువ. అయితే మనవాళ్లు అక్కడే ఆగిపోలేదు. 

కేవలం ఇద్దరు మహిళా ఆఫీసర్లతో ‘నావికా సాగర్‌ పరిక్రమ–2’ చేయ సంకల్పించారు. ఇందుకు తగిన ఆఫీసర్ల ఎంపికకే సంవత్సర కాలం పట్టింది. అనేక వడపోతల తర్వాత ఇద్దరు ఆఫీసర్లు ఈ సాహసయాత్రకు యోగ్యత పొందారు. వారే లెఫ్టినెంట్‌ రూపా, లెఫ్టినెంట్‌ దిల్‌నా. కేవలం ఇద్దరు ఆఫీసర్లు అనంత జలరాశిపై సెయిలింగ్‌ బోట్‌ మీద 50 వేల కిలోమీటర్లు చుట్టి రావాలంటే ఎంత ధైర్యం... సాహసం ఉండాలి? ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాలి? అసలు తిరిగి వస్తారో రారో అనే భయం అయినవాళ్లను పీడించకుండా ఉంటుందా? అయినప్పటికీ అవన్నీ దాటి ఆ ఇద్దరు ధీరవనితలు తమ సాగర పరిక్రమను దిగ్విజయంగా ముగించారు. ఎనిమిది సుదీర్ఘ నెలలు సముద్రంతో చెలిమి, చెలగాటం చేసి తిరిగి మన జలాలలోకి చేరుకున్నారు. నేడు వారికి ఘనస్వాగతం గోవాలో లభించనుంది.

అక్టోబర్‌ 2, 2024నప్రారంభం
నావికా సాగర్‌ పరిక్రమ–2 అక్టోబర్‌ 2, 2024న గోవాలో మొదలైంది. ఇద్దరు నావికా ఆఫీసర్లు దిల్‌నా, రూపాలు అంతకుముందే ఐ.ఎన్‌.ఎస్‌.వి.తారణిలో చిన్న చిన్న దూరాలున్న సముద్ర యాత్రలు చేసి ఆ రిహార్సల్స్‌తో సర్వసన్నద్ధం అయ్యారు. వీరు ఎనిమిది నెలల పాటు తారణిలో ఉండాలి. 50 వేల కిలోమీటర్లు పడవ నడపాలి. మూడు మహా సముద్రాలు– ఇండియన్, పసిఫిక్, అట్లాంటిక్‌ గుండా ప్రయాణించాలి. నాలుగు ఖండాలు ఆసియా, ఆస్ట్రేలియా, సౌత్‌ అమెరికా, ఆఫ్రికాలను చుట్టాలి. కేవలం నాలుగు చోట్ల వీరు బ్రేక్‌ తీసుకునే ఏర్పాటు చేశారు. అవి– ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫాక్‌ల్యాండ్, కేప్‌టౌన్‌. తారిణిలో అత్యాధునిక సిగ్నెలింగ్‌ వ్యవస్థ ఉంటుంది. తీరం నుంచి నావికాదళం వీరితో అనుసంధానమై ఉండి వీరి యాత్రను గమనిస్తూ ఉంటుంది. అయినా సరే నడిసముద్రంలో నావ ఉన్నప్పుడు వీరు ఇరువురు మాత్రమే ఉంటారు. వీరితోపాటు నావ. ఎదురుగా అనంత జలరాశి.

గాలే కీలకం
లెఫ్టినెంట్‌ దిల్‌నా, రూపా ప్రయాణిస్తున్న తారిణి ఒక సెయిలింగ్‌ వెస్సెల్‌. అంటే గాలివాటుతో ప్రయాణించాల్సిన తెరచాప పడవ. దీనికి 25 మీటర్ల ఎత్తు తెరచాపలు ఉన్నాయి. గాలి అదుపులో ఉంటే పడవ దూసుకెళుతుంది. ‘ఒక్కోసారి సముద్రం మీద రోజుల తరబడి గాలి ఉండదు. నావ కదలదు. మన సహనం పరీక్షకు గురవుతుంది’ అన్నారు దిల్‌నా, రూపా. అదే సమయంలో కేప్‌ హార్న్స్, కేప్‌ టౌన్, డ్రీక్‌ పాసేజ్‌ వంటి చోట ఇదే గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తే పడవను అదుపు చేయడంప్రాణాంతకం అవుతుంది. గ్రీక్‌ పాసేజ్‌ దగ్గర అలలు ఐదు మీటర్ల ఎత్తుకు ఎగిరిపడుతూ పడవను ముంచెత్తుతాయి. కాగితం పడవను ఊపినట్టు ఊపేస్తాయి. అంతేకాదు కొన్నిచోట్ల అతి శీతల గాలులు... వణికించే చలి... గడ్డకట్టినంత చల్లగా ఉండే సముద్రనీరు ఉంటాయి... వీటన్నింటిని తట్టుకోవడం వల్లే దిల్‌నా, రూపాలను ధీరలని, సాహస నావికులని అనాలి. ముఖ్యంగా ‘కేప్‌ హార్న్‌’ను జయించే అదృష్టం అందరికీ దక్కదు. అది దాటిన వారికి ‘కేప్‌ హార్నర్స్‌’ అనే బిరుదును ఇస్తారు. ఇప్పుడు దిల్‌నా, రూపాలకు కూడా ఆ బిరుదు దక్కింది.

నీమొ పాయింట్‌
సముద్ర ధ్రువంగా భావించే నీమొ పాయింట్‌ను లెఫ్టినెంట్‌ దిల్‌నా, లెఫ్టినెంట్‌ రూపాలు ఈ సాగర పరిక్రమలో టచ్‌ చేయడం పెద్ద విశేషంగా చెప్పాలి. దాదాపుగా ఈ పాయింట్‌ దగ్గరకు నావికులు వెళ్లరు. దీనికి దగ్గరి భూభాగమే 2,688 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే ఆలోచించుకోవచ్చు. ఈ పాయింట్‌కు భూమిపై ఉండే మనుషుల కంటే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉండే మనుషులే దగ్గర. ఆ పాయింట్‌ను దాటిన క్షణం చారిత్రాత్మకంగా దిల్‌నా, రూపా భావిస్తున్నారు. ఆ పాయింట్‌ దగ్గర ఇద్దరూ సంబరం జరుపుకున్నారు.

ఆకాశమూ, అగాథాలూ
గడప లోపలే ఉండిపోయినా స్త్రీ ఆకాశాలనూ అగాధాలనూ అందుకుంటూ ప్రయాణం సాగిస్తున్నది. సునీతా విలియమ్స్‌ ఆకాశానికి ఉన్న హద్దును చెరిపేస్తే దిల్‌నా, రూపాలు అగాథాల పట్ల ఉన్న భయాలను తొలగించారు.
సాహస వనితలు, చరిత్రలో నిలిచిపోయిన మహిళా నావికులు దిల్‌నా, రూపాలు గోవాకు నేడు చేరుకుంటున్న సందర్భంగా అందరూ ఉత్సవాలు జరపాలి. వీరి గాథను పాఠాలుగా చెప్పాలి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement