
చిన్ననాటి విషాదాలను, పేదరికాన్ని జయించి సెయిలింగ్‌లో అద్భుత ప్రతిభను కనబరిచిన ముగ్గురు తెలుగు యువకులు భారత నౌకాదళంలోని స్పోర్ట్స్ కంపెనీలో చేరనున్నారు. ఈ ముగ్గురు నవీన్, సాత్విక్ ధోకి, రిజ్వాన్ మహమ్మద్.. వారి జీవితం ఎలా ఉన్నా అద్భుతమైన సెయిలింగ్ ప్రతిభతో భవిష్యత్ ప్రయాణాన్ని సుగమం చేసుకున్నారు. ఈ యువ హైదరాబాదీ సెయిలర్లు గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ (ఎంవైఎస్సీ)కి ఎంపికయ్యారు.
తార హోమ్ నుంచి యువ తారగా..
ప్రకాశం జిల్లాలోని లక్ష్మప్ప గ్రామానికి చెందినవాడు 13 సంవత్సరాల నవీన్. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తప్పిపోయి నగరంలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు దొరికాడు. అక్కడి నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా తార హోమ్ అనే అనాథ శరణాలయానికి చేరుకున్నాడు. ఇలాంటి దయనీయమైన గతం నుంచి ఈ తరం యువతకు స్ఫూర్తి నింపేలా తను భవిష్యత్తును రూపుదిద్దుకున్నాడు.
జాతీయ స్థాయి మేటి సెయిలర్‌గా..
15 ఏళ్ల రిజ్వాన్ మహమ్మద్ ప్రస్తుతం దేశంలోనే నెం.1 సెయిలర్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌లోని పాట్టిగడ్డ ప్రాంతంలో ఒక చిన్న గుడిసెలో నివసించే రిజ్వాన్ ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో వంట మనిషిగా పనిచేస్తుంది. కాసింత ప్రోత్సాహం అందితే చాలు అనుకునే పరిస్థితి నుంచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ సెయిలర్‌గా మారడంలో తన కృషి, నిబద్ధత, అంకితభావం ఎలాంటిదో ఊహించవచ్చు.
కూలీ కుటుంబం..
వరంగల్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామం నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందినవాడు 14 సంవత్సరాల సాత్విక్. అతని తండ్రి హైదరాబాద్ మోండా మార్కెట్‌లో కూలీగా, తల్లి ఓ ఇంటి పనిమనిషిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన సాత్విక్ భారత నౌకాదళంలో చేరనుండటం తనకే కాదు తన కుటుంబానికి సైతం గర్వకారణం.
నేనున్నాననీ..
ఈ ముగ్గురు యువకుల ప్రస్థానంలో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) కీలక పాత్ర పోషించింది. ఆరేళ్ల నవీన్ తప్పిపోయి అనాథ శరణాలయం ‘తార హోమ్’కు చేరుకున్న సమయంలో.. వైసీహెచ్ అతన్ని గుర్తించి సెయిలింగ్ శిక్షణ కోసం ఎంపిక చేసింది. నవీన్ లాగే, పేద కుటుంబాల నుంచి వచ్చిన సాత్విక్, రిజ్వాన్ కూడా వైసీహెచ్ మార్గ దర్శకత్వంలోనే శిక్షణ పొందారు.
కోచ్ సుహీమ్ షేక్ పర్యవేక్షణలో ఈ యువకులు సెయిలింగ్‌లో కఠోర శిక్షణ తీసుకున్నారు. అంకితభావం, పట్టుదల జాతీయ స్థాయి పోటీల్లో ఉన్నత స్థానాలకు చేర్చాయి. రిజ్వాన్ మహమ్మద్ అయితే స్థిరంగా పతకాలను సాధిస్తూ, అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈ యువకుల అసాధారణ ప్రతిభ, క్రీడా స్ఫూర్తిని గుర్తించిన నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ, వారిని తమ జట్టులోకి తీసుకుంది.
(చదవండి: గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా..)