అత్యంత విశిష్టత కలిగిన ప్రాంతం..కానీ అక్కడకు వెళ్లాలంటే..! | Nathu-La mountain pass in the Himalayas in East Sikkim district. | Sakshi
Sakshi News home page

Nathu-La: అత్యంత విశిష్టత కలిగిన ప్రాంతం..కానీ అక్కడకు వెళ్లాలంటే..!

Apr 12 2026 12:39 PM | Updated on Apr 13 2026 10:07 AM

Nathu-La mountain pass in the Himalayas in East Sikkim district.

పిల్లలూ! మన దేశంలో కేవలం చారిత్రక, పర్యాటక ప్రదేశాలే కాదు. విశిష్టత కలిగిన అనేక ప్రాంతాలున్నాయి. అందులో ఒకటి ‘నాథూ లా’.  ఇది హిమాలయాలలోని డోంగ్‌క్యా శ్రేణిలో, టిబెట్‌లోని చైనా యాడాంగ్‌ కౌంటీకి, భారత రాష్ట్రమైన సిక్కింకు మధ్య ఉన్న ఒక పర్వత మార్గం. 4,310 మీటర్లు అంటే సుమారు 14,140 అడుగులు ఎత్తులో ఈ మార్గం ఉంది. 1950లలో సిక్కిం రాజ్యంలో జరిగే వాణిజ్యం కోసం ఈ మార్గాన్ని వినియోగించేవారు. 1962 నాటి చైనా–భారత యుద్ధం తర్వాత చైనా, భారతదేశాలు దౌత్యపరంగా ఈ మార్గాన్ని మూసివేశాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. 

తర్వాతి కొన్ని దశాబ్దాల్లో రెండు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో 2006లో నాథూ లాను తిరిగి తెరిచారు. దీంతో కైలాస పర్వతం, మానస సరోవర యాత్రకు ఒక ప్రత్యామ్నాయ మార్గం లభించింది. అయితే భారీ మంచు కురవడం వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా సరిహద్దు వాణిజ్యం సంవత్సరానికి 7 నుండి 8 నెలల పాటు మాత్రమే సాధ్యమవుతుంది.  నాథూ లా భారత్‌–చైనా దేశాల సైన్యాల మధ్య ఉన్న ఐదు సరిహద్దు సిబ్బంది సమావేశ కేంద్రాలలో ఒకటి.

భారత్‌–చైనా మధ్య ఉత్తరాల బట్వాడా కూడా ఈ మార్గంలో సాగుతుంది. గురువారాలు, ఆదివారాలలో ఉదయం 8:30 గంటలకు కేవలం 3 నిమిషాల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది. నాథూ లాలోని షెరాతాంగ్‌ సరిహద్దు పోస్ట్‌ వద్ద ఆయా దేశాల తపాలా సిబ్బంది ఉత్తరాలను తీసుకుంటారు. 

ఈమెయిల్, ఇంటర్నెట్‌ రావడంతో ప్రస్తుతం ఉత్తరాలు రాసేవారి సంఖ్య తగ్గినా, మన దేశంలోని టిబెటన్‌ శరణార్థులు లేదా సరిహద్దుకు ఇరువైపులా బంధువులు ఉన్న స్థానికులు ఇంకా ఈ సేవల్ని వాడుతున్నారు. కొన్నిసార్లు ఏ ఉత్తరాలూ లేకపోయినా తపాలా సిబ్బంది ఖాళీ సంచులు అటూఇటూ మార్చుకుంటారు. 

ఈ ప్రదేశాన్ని చూడాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో ఒక రోజు ముందుగా అనుమతులు పొందిన తర్వాత, భారత పౌరులు మాత్రమే గురువారం నుంచి ఆదివారం వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించగలరు.  

Advertisement
 
Advertisement
Advertisement