పట్టుదలే..ముందడుగు | Namita Banka: BioLoo treats waste generated in toilets | Sakshi
Sakshi News home page

పట్టుదలే..ముందడుగు

Sep 20 2025 4:44 AM | Updated on Sep 20 2025 4:44 AM

Namita Banka: BioLoo treats waste generated in toilets

నమిత

ఢిల్లీలో మెటల్‌ డిజైనింగ్‌లో మాస్టర్స్‌ చేసిన నమిత సూరత్‌లో ఎనిమిదేళ్లు ఆభరణాలను డిజైన్‌ చేసింది. అయితే ఉన్నట్లుండి ఆమె విజయవంతమైన కెరీర్‌ను వదిలి హైదరాబాద్‌కు మారి  సామాజిక, పారిశుధ్య సమస్యలపై అవగాహన పెంచుకొని పర్యావరణం కోసం పనిచేస్తోంది. 

రైల్వేలతో పాటు దేశంలో శానిటేషన్‌ అవసరం ఉన్న ప్రాంతాలలో బయో డైజెస్టర్‌ టాయిలెట్‌లను నిర్మించి  పారిశుధ్య కార్మికులు, గ్రామీణ మహిళలకు వందలాది ఉద్యోగాలను సృష్టించింది. పర్యావరణం కోసం పనిచేయడానికి ఆసక్తి చూపే అనేక స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో పాల్గొంది. హెల్త్‌ కేర్, వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ అవార్డుతోపాటు అనేక ప్రశంసలను పొందిన నమిత బంకా కథ ఇది.

‘తలపెట్టిన పనిని నూటికి నూరుపాళ్లు పూర్తిచేయడానికి కృషి చేయాలని నమ్ముతాను’ అంటారు నమిత. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ కు బదిలీ కావడంతో ఇక్కడే సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో వివిధ కోర్సుల్లో చేరారు. దాంట్లో భాగంగా ఇండియన్‌ రైల్వేలో టెండర్లు వేయడం మొదలుపెట్టారు. తనకున్న పరిచయాల ద్వారా పెద్ద సమస్యలలో ఒకటైన పారిశుధ్యం గురించి తెలుసుకుని, రైల్వేలో టాయిలెట్‌ తయారీదారులకు లైసెన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి, మార్కెట్‌ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలోని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ ఇండస్ట్రియల్‌ పార్క్‌ వద్ద శానిటేషన్‌ నిర్వహణ వ్యవస్థ ఏర్పరిచి, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీలో రాణిస్తున్నారు. బంకా బయో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూపకల్పన చేసి, దానిని సంస్థాగతంగా వెలుగులోకి తీసుకు
వచ్చారు.  

వ్యర్ధాల శుద్ధి
మన దేశంలో పారిశుధ్య సమస్యల గురించి నమిత వివరిస్తూ –‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది ప్రజలు బహిరంగంగా మలవిసర్జన చేస్తుంటారు. ఈ పద్ధతి ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. పర్యావరణ సమస్యలను పెంచుతుంది. నీటి కాలుష్యానికి దారితీస్తుంది. మేం టాయిలెట్‌ ను మాత్రమే కాకుండా ‘ఆన్‌–సైట్‌‘ వ్యర్థాల శుద్ధి సౌకర్యాన్ని కూడా అందిస్తాం. వీటి ట్యాంక్‌లో బయో–డైజెస్టర్‌లు అమర్చి ఉంటాయి. సంప్రదాయ టాయిలెట్‌లతో పోలిస్తే తక్కువ సమయం లో 99 శాతం వ్యర్థాలు కుళ్ళిపోతాయి. 

సంప్రదాయ సెప్టిక్‌ ట్యాంకులను బయో–ట్యాంకులుగా మార్చడానికి మేం కృషి చేస్తున్నాం. ఇది మెరుగైన పర్యావరణాన్ని, ఆరోగ్య పరిస్థితులను సృష్టిస్తుంది. రైలు పట్టాలను వ్యర్థ పదార్థ రహిత ట్రాక్‌లుగా మార్చడానికి భారతీయ రైల్వేలకు, కుటుంబాలకు బయో–టాయిలెట్లు, పబ్లిక్‌– కమ్యూనిటీ, పాఠశాలలు, సంస్థలకు బయో–
టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న సెప్టిక్‌ ట్యాంకులను బయో–ట్యాంకులుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 

సమాజంలో పారిశుధ్యం విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితి గురించి నాకు తెలుసు. మొదట ఈ విషయంలో రైల్వే అధికారులను సంప్రదించినప్పుడు, రైళ్లలో టాయిలెట్‌ టెక్నాలజీలను మెరుగుపరచడంలో వారు నాతో సహకరించారు. పారిశుధ్య ప్రమాణాలను పెంచడానికి అక్కడ ఒక బలమైన అవకాశాన్ని చూశాను. తరువాత సమాజం కోసం కూడా దీనిని ఉపయోగించడం ప్రారంభించాను.

ధైర్యంతో పాటు దృఢ సంకల్పమే తోడు 
కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యంతో పాటు తలపెట్టిన పని పూర్తిచేయాలనే దృఢ సంకల్పం ఉండాలి. నేను అదే చేశాను. సాంస్కృతిక అడ్డంకులెన్నో నాకు అడ్డంకిగా నిలిచాయి కానీ ఆగిపోలేదు.  సమాజం పట్ల నా విధులను సక్రమం గా నిర్వర్తించాలన్న నా సంకల్పం, పారిశుధ్యం, పర్యావరణం పట్ల శ్రద్ధే నన్ను నడిపిస్తున్నాయి. ఔత్సాహిక బృందం నాతో కలిసి రావడం అదృష్టం. మొదట ముగ్గురు సభ్యులతో మొదలుపెట్టాం. 2013 చివరి నాటికి మా సంఖ్య 80కి పెరిగింది. వివిధ విభాగాలతో ఖర్చుతో కూడుకున్న పారిశుధ్య పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తున్నాం. 

సంకల్ప్‌ సమ్మిట్, యాక్షన్‌ ఫర్‌ ఇండియా వంటి కార్యక్రమాలలో పాల్గొన్నాం. అక్కడి అనుభవాలు మమ్మల్ని మేము మరింతగా మెరుగుపరచుకోవడానికి సహాయ పడ్డాయి. దీనికితోడు బ్యాంకు క్రెడిట్, ప్రైవేట్‌ రుణ నిధులు ఉండనే ఉన్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని ప్రయోజనాలను అందించింది. ఒక మహిళా వ్యవస్థాపకురాలిగా ప్రతి దశలోనూ మనల్ని మనం నిరూపించుకోవాలి. రకరకాల సామాజిక మనస్తత్వాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడే సక్సెస్‌ సాధించగలుగుతాం’’ అని చె΄్పారు నమిత. 

దేశంలో టాయిలెట్‌ సౌకర్యం అందుబాటులో లేని ప్రదేశాలలో బయోడైజెస్టర్‌ టాయిలెట్ల నిర్మాణానికి, తయారీకి, సరఫరాకు నమిత బంకా కృషి చేస్తున్నారు. దాదాపు పది మిలియన్ల మందికి ఆమె సేవలు చేరుకున్నాయి. ఇండియన్‌ రైల్వేస్, షాపూర్జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టి, వోకార్డ్‌ ఫౌండేషన్, తెలంగాణ, ఎ.పి ఎడ్యుకేషన్‌ – వెల్ఫేర్‌ ఇన్‌ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఇస్రో .. వంటివి బంకా బయోకు ఉన్న ముఖ్యమైన క్లయింట్లు. ఈ కంపెనీ ప్రతిష్టాత్మక సంకల్ప్‌ హెల్త్‌కేర్, వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement