ముగ్గురూ పాసయ్యారు

Mustafa And his Wife Passed Intermediate Along With His Son At Kerala - Sakshi

కొడుకు పాఠాలు చెప్పే మాస్టర్‌ అయ్యాడు. తల్లిదండ్రులు స్టూడెంట్స్‌ అయ్యారు. ముగ్గురూ ఇంటర్‌లో పాస్‌ అయ్యి విన్నవారి పెదాల మీద చిర్నవ్వు, కళ్లల్లో ప్రశంస పుట్టిస్తున్నారు. కేరళ మలప్పురంలో జరిగింది ఇది. ఆ ఊరి ముస్తఫా టెన్త్‌ పాసయ్యాక చదువు మానేసి ఆ పనులూ ఈ పనులూ చేసి అబూదాబీ వెళ్లాడు. అక్కడ ఒక హాస్పిటల్‌లో పని చేస్తూ తిరిగి వచ్చి పదోక్లాసు చదివిన నుసైబాను పెళ్లి చేసుకుని తిరిగి అబూదాబీ వెళ్లిపోయాడు. కొడుకు పుడితే వాణ్ణి మలప్పురంలోనే చదివించారు.

ఐదేళ్ల క్రితం కేరళ వచ్చేసిన ఈ దంపతులిద్దరూ చిన్నపాటి వ్యాపారం చేస్తూ ఆపేసిన చదువును కొనసాగించడం ఎలా అని ఆలోచించారు. ఈలోపు కొడుకు ఇంటర్‌కు వచ్చాడు. కొడుకుతో పాటు తాము ఇంటర్‌ చదివితే బాగుంటుందని అనుకున్నారు. కాని వారిని నేరుగా చేర్చుకునే కాలేజీలు లేవు. అయితే కేరళ సాక్షరతా మిషన్‌ వారి ఇంటర్‌ సమాన కోర్సు ఉందని తెలుసుకుని అందులో చేరారు. కొడుకు రెగ్యులర్‌ కోర్సు చేస్తుంటే వీరు సండే క్లాసెస్‌ ద్వారా ఇంటర్‌ చదివారు. ‘మా అబ్బాయి షమాస్‌ మంచి స్టూడెంట్‌. వాడు తనతోపాటు మేము కూడా చదువుతుంటే ఎగ్జయిట్‌ అయ్యాడు. మాకు టీచరై డౌట్స్‌ తీర్చాడు. ప్రశ్నలు అడిగి ఎంకరేజ్‌ చేశాడు’ అన్నాడు ముస్తఫా. మొన్నటి పరీక్షల్లో ముగ్గురూ పరీక్షలు రాశారు.

కొడుకు షమాస్‌ ఏ ప్లస్‌లో పాస్‌ అయ్యాడు. తల్లి నుసైబాకు 80 శాతం మార్కులు వచ్చాయి. తండ్రి ముస్తఫాకు ఫస్ట్‌ క్లాస్‌ వచ్చింది. ‘బిజినెస్‌ ట్రిప్పుల వల్ల కొన్ని క్లాసులు మిస్‌ అయ్యాను. లేకుంటే నాకూ మంచి మార్కులు వచ్చేవి’ అని మొహమాటంగా నవ్వాడు ముస్తఫా. ‘ముందు ఇదంతా మా బంధువుల నుంచి దాచిపెడదామనుకున్నాం. ఈ వయసులో చదువంటే ఏమనుకుంటారో అని. కాని ఇప్పుడు అందరూ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అన్నారు తల్లిదండ్రులు. అయితే కథ ఇంతటితో అయిపోలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ బి.కామ్‌ చదవాలని నిశ్చయించుకున్నారు. కొడుకు సి.ఏ చేద్దామనుకుంటున్నాడు. మొత్తం మీద ‘చదివితే ఎదుగుతావు’ అని సందేశం ఇస్తున్నారు ఈ ముగ్గురు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top