Cyber Crime: ఫోన్‌లోనే పరిచయం, చాటింగ్‌.. అమెరికా వెళ్దామని..

Matrimonial Fraud: Woman Loses Rs 10 Lakhs Be Aware - Sakshi

పెళ్లి ‘కళ’ ముంచేసింది

పెళ్ళి సంబంధాలు చూసే క్రమంలో మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో తన పేరు రిజిస్టర్‌ చేసుకుంది  లావణ్య (పేరు మార్చడమైనది). వచ్చిన వాటిలో మధు (పేరు మార్చడమైనది) ప్రొఫైల్‌ నచ్చింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఫార్మాలో ఉద్యోగం చేస్తున్నానని, ప్రస్తుతం కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నానని, అమెరికాలో స్థిరపడాలన్నది తన ఆలోచనగా చెప్పాడు మధు. లావణ్య కూడా తన వివరాలన్నీ తెలిపింది. ఇద్దరి అభిరుచులూ కలిశాయి. ఫోన్‌లో మాట్లాడుకోవడం, చాటింగ్‌ మొదలైంది.
∙∙ 
మధు విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి అమ్మానాన్నలు మాట్లాడుతారంటూ మధుకి ఫోన్‌లో చెప్పింది లావణ్య. ఫోన్‌లోనే పరిచయాలు అయ్యాయి. ‘అబ్బాయి మాటతీరు, వారి వివరాలన్నీ బాగున్నాయి. మంచి రోజు చూసుకొని రమ్మని చెబుదాం’ అంది లావణ్య తల్లి. ‘అలాగేనమ్మా!’ అంది ఆనందంగా లావణ్య. కూతురి సంతోషం చూసిన తల్లి ‘మా అమ్మాయికి పెళ్లి కళ వచ్చేసిందీ..’ అంది మురిపెంగా! 
∙∙ 
తెల్లవారు జామున మోగుతున్న ఫోన్‌ని నిద్రమత్తులోనే ఎత్తింది. అవతలి నుంచి మధు గొంతు కంగారుగా ఉండటంతో ఏమైందని అడిగింది లావణ్య. ‘మా నాన్నకు హార్ట్‌ ఎటాక్‌. రేపు మీ కుటుంబసభ్యులను కలిసి, పెళ్లి సంబంధం మాట్లాడుదామనుకున్నాం. ఇంతలో ఇలా జరిగింది’ అన్నాడు మధు. ‘ముందు మామయ్యగారి ఆరోగ్యం ముఖ్యం. అడ్రస్‌ చెబితే మేం హాస్పిటల్‌కి వచ్చేస్తాం’ అంది లావణ్య. ‘లావణ్యా మీరుండేది హైదరాబాద్‌లో... మేం ఉండేది వైజాగ్‌లో. ఎందుకు హైరానా? ఏదైనా ఉంటే నేను చెబుతాలే’ అన్నాడు మధు. ‘సరే’ అంది లావణ్య.
∙∙ 
రోజూ మధు తండ్రి ఆరోగ్యం గురించి కనుక్కుంటూనే ఉంది లావణ్య. ‘ఇప్పుడు బాగానే ఉంది లావణ్య. పెళ్లయ్యాక ఎలాగూ మనం అమెరికా వెళ్లాలి. ఇప్పుడే వీసా ప్రకియ మొదలుపెట్టాలి. నా డాక్యుమెంట్స్‌ అన్నీ రెడీగా ఉన్నాయి. నీవు ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసి, కొంత మనీని ట్రాన్స్‌ఫర్‌ చేయి. నీ వీసా ప్రక్రియ కూడా మొదలుపెడతాను’ అన్నాడు మధు.

అతను చెప్పిన వివరాలతో అంతర్జాతీయ బ్యాంక్‌లో ఆధార్, పాన్‌కార్డ్‌.. అన్నీ జత చేసి వాటిని మధుకు పంపించింది. మరుసటి రోజు మధు ఫోన్‌ చేసి ‘మా నాన్న అకౌంట్‌ నుంచి నీ అకౌంట్‌లోకి రూ.10 లక్షల రూపాయలు వస్తాయి. వాటిని వెంటనే తిరిగి నా అకౌంట్‌కు పంపు’ అన్నాడు మధు. అలాగేనంటూ మధు చెప్పిన అకౌంట్‌కు మనీని ట్రాన్స్‌ఫర్‌ చేసింది. 

‘వీసా ప్రక్రియ పూర్తికాగానే, అందరం కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పాడు’ మధు. సంతోషంగా సరే అంది లావణ్య. 
మరుసటి రోజు నిద్రలేచిన లావణ్యకు ఫోన్‌ లో మధు నుంచి ఎలాంటి మెసేజ్‌ లేకపోవడంతో తనే మెసేజ్‌ చేసింది. ఎంతకీ రిప్లై లేదు. ఏమై ఉంటుందీ... అని ఫోన్‌ చేసింది.

మధు ఫోన్‌ స్విచ్డాఫ్‌ వస్తోంది. వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగాలేదుగా పాపం. మళ్లీ ఏమైనా ప్రమాదం ముంచుకొచ్చిందేమో అనుకుంది. మధ్యాహ్నం అయ్యింది, సాయంత్రం అయ్యింది. రాత్రి అయ్యింది. వారం గడి చింది. మధు నుంచి ఎలాంటి ఫోన్‌ లేదు. తను ఫోన్‌ చేస్తే స్విచ్డాఫ్‌. 

నెల రోజులు గడిచాయి. 
ఇంతలో బ్యాంక్‌ నుంచి తీసుకున్న 10 లక్షల రూపాయలకు ఈఎమ్‌ఐ చెల్లించాలంటూ మెసేజ్‌ వచ్చింది. 
తన పేరుతోనే మధు లోన్‌ తీసుకుని, ఆ అమౌంట్‌నే తన తండ్రి అకౌంట్‌నుంచి వచ్చినట్టుగా నమ్మబలికి చేసిన మోసం గురించి అప్పుడర్థమైంది లావణ్యకు. తనకు జరిగింది మోసం అని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. మధు అనే వ్యక్తి వైజాగ్‌లోనే లేనట్టు తెలిసి, మరింత షాకైంది లావణ్య.                        
 
వెనకడుగులోనూ బలం ఉండాలి
నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించి పెళ్లి కావలసిన అమ్మాయిలకు కాబోయే వరుడిగా నటిస్తూ, స్నేహం చేస్తారు. ఇంటి బాధ్యతలు, తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారిలా నమ్మబలుకుతారు. ఏదో ఒక అత్యవసర పరిస్థితిని సృష్టించి, బ్యాంకు నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయమని అడుగుతారు. డబ్బు బదిలీ కాగానే, అదృశ్యమవుతారు. వీరు వ్యక్తిగతంగా కలవడానికి ఇష్టపడరు. ఆస్తులు, ఆదాయం గురించి విచారిస్తారు.

పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌చేసిన తర్వాతనే ముందడుగు వేయాలి. అవతలి వ్యక్తి మిమ్మల్ని ఏ విషయాల్లోనైనా త్వరపెడుతున్నట్టుగా అనిపిస్తే వెనకడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నగదు బదిలీ చేయవద్దు. మీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను యాక్సెస్‌ చేయడానికి సరైన URLని మీ విండో బ్రౌజర్‌లో టైప్‌ చేయండి. ఎస్సెమ్మెస్, వాట్సప్‌ ద్వారా అవతలి వ్యక్తి పంపిన ‘షార్ట్‌’ లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు. 
– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

నిజనిర్ధారణ తప్పనిసరి
మ్యాట్రిమోని సైట్‌లలో ఉన్న ప్రొఫైల్స్‌ పైనే ఆధారపడకుండా, అవతలి వ్యక్తి చిరునామా నిజమైనదేనా అనేది నిర్ధాణ చేసుకోవాలి. అతను/ఆమె చేస్తున్న ఉద్యోగాల గురించి వాకబు చేయాలి. ఇలాంటి వాటిల్లో ఆర్థిక మోసం ఒకటైతే, తమ వాంఛ తీర్చుకోవడానికి వలపన్నే వారుంటారు. మంచిగా ఉంటూనే నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించి వాటిని పోర్న్‌సైట్స్‌లో పెట్టి, బెదిరించి డబ్బులు లాగుతారు. మోసాలు ఎలా జరుగుతాయో తల్లిదండ్రులు పెళ్లీడు పిల్లలకు వివరించాలి. పొరపాటున కూడా బ్యాంకు వివరాలు షేర్‌ చేయకూడదు. ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 
– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌. 

చదవండి: Cow Dung: పేడంటే పేడా కాదు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top