Cow Dung: ఆవు పేడతో వ్యాపారమా? అని నవ్వి ఊరుకున్నాను.. కానీ, ఇప్పుడు

Chhattisgarh to buy cow dung from farmers - Sakshi

పాడి లేని ఇల్లు, పేడ లేని చేను లేదు...అనేది పాత సామెత. ‘పేడ ఉన్న చోట పేమెంట్స్‌ ఉండును’ అనేది సరికొత్త సామెత. దీని లోతు తెలుసుకోవాలంటే ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాకు వెళ్లాల్సిందే. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ జిల్లా ఇప్పుడు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది.

చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్‌... ఇలా రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ఆవు పేడ అనేది ఆదాయ వనరుగా మారింది. మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి విగ్రహాలు, మొబైల్‌ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్‌... ఒక్కటనేమిటీ తమ సృజనాత్మకతకు పదును పెట్టి రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ఒకప్పుడు వీటి మార్కెట్‌ జిల్లా సరిహద్దులకే పరిమితం. ఇప్పుడు మాత్రం ఇ–కామర్స్‌ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయస్థాయికి చేరింది. రోజురోజుకు ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఊపందుకోవడం విశేషం.

‘మా పొరుగింటి ఆవిడ పేడ వ్యాపారం గురించి చెప్పగానే నవ్వి ఊరుకున్నాను. అలాంటి నేను ఇప్పుడు ఆవు పేడతో రకరకాల వస్తువులు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నాను’ అంటుంది అంబగోర్‌ గ్రామానికి చెందిన సబిత. ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌... మొదలైన రాష్ట్రాల నుంచి మహిళలు బృందాలుగా వస్తుంటారు.

‘ఈ వ్యాపారం రాబోయే కాలంలోగ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి ఊతం ఇస్తుంది’ అని చెప్పారు మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఒక ఉన్నతాధికారి. ఉత్తరప్రదేశ్‌లో అపర్ణ అనే లాయర్‌ తన వృత్తికి స్వప్తి పలికి పేడ వ్యాపారంలోకి దిగారు. గౌతమబుద్ధనగర్‌ జిల్లాలో పది ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తున్నారు. ఇందులో 120 వరకు ఆవులు ఉన్నాయి. ఈ గోశాల నుంచి వచ్చే పేడతో రకరకాల వస్తువులు తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

‘ఇది వ్యాపారమే కాదు. ఆవుపేడ ద్వారా అదనపు ఆదాయాన్ని అర్జించవచ్చు...అనే సందేశం ఇవ్వడం కూడా’ అంటున్న అపర్ణ వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలకు ‘ఆవుపేడతో ఎలాంటి వస్తువులు తయారుచేయవచ్చు?’ ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ ‘మార్కెట్‌ ఎలా చేయాలి?’ ‘పేడ నుంచి వర్మీ కంపోస్ట్‌ ఎలా తయారు చేస్తారు’... మొదలైన విషయాల్లో సలహాలు ఇస్తుంటారు. పంజాబ్‌లోని బులందపూర్‌లాంటి ఎన్నో గ్రామాల్లో ఆవుపేడను ఊరవతల వేసే అలవాటు ఉండేది. ఇప్పుడు ఆ అలవాటు మానుకొని పేడను జాగ్రత్త చేస్తున్నారు. పదిమంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలో ఎన్నో మహిళాబృందాలు పయనిస్తున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top