
శాంతి, అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు?. ఆయన దారిలో నడిచిన వారెందరినో వరించిన ఆ పురస్కారం.. ఆయన్నెందుకు వరించలేదు? కారణం.. నాథూరాం గాడ్సేనా?? గాంధీని చంపిన గాడ్సే.. ఆయనకు నోబెల్ దక్కే అవకాశాన్ని కూడా చంపేశాడా? అందుకే 1948లో నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదా? పైగా.. తగు యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరూ జీవించి లేనందున ఆ పురస్కారాన్ని ఇవ్వడం లేదన్న నోబెల్ కమిటీ ప్రకటన దీన్నే సూచిస్తోందా? అసలు.. గాంధీకి నోబెల్ రాకపోవడానికి గాడ్సేకు ఉన్న లింకేంటి?
1930ల్లో ఏం జరిగిందంటే..
నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ 5 సార్లు నామినేట్ అయ్యారు. 1937, 1938, 1939, 1947, 1948ల్లో ఆయన ఈ పురస్కారం దక్కే అవకాశం వచ్చింది. గాంధీ అహింసా మార్గం లేదా శాంతి మార్గం అన్నది తన దేశ స్వాతంత్య్రం కోసం తప్ప.. అంతర్జాతీయ శాంతి కోసం కాదని నోబెల్ కమిటీలోని కొందరు సభ్యులు ఆ టైంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడానికి ఆయన షరతులతో సమ్మతి తెలపడాన్ని వాళ్లు ఎత్తి చూపారు. నోబెల్ బహుమతులను ఇచ్చే నార్వే అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు అవార్డులు ఇవ్వకూడదని ఆ దేశం అనుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతారు.
1947 వచ్చేసరికి ఆ సమయంలో విభజన కారణంగా చెలరేగిన హింస.. మతపరమైన హింసను నిరోధించడానికి గాంధీజీ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాకపోవడం, విభజన హింస.. గాంధీ శాంతి సందేశాన్ని మరుగునపడేటట్లు చేసిందని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు. 1900 నుంచి 1960 వరకూ పురస్కారాలను గమనిస్తే మనకీ విషయం అర్థమవుతుందని గేర్ లూండెస్టాడ్ అన్నారు.
1948లో ఎందుకు రాలేదంటే..
1948లో గాంధీజీ మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ ఏడాది గాంధీ పేరును అమెరికాకు చెందిన శాంతి కార్యకర్త, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత ఎమిలీ గ్రీన్ బాల్చ్, బాంబే స్టేట్ తొలి సీఎం బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్, యునైటెడ్ ప్రావిన్సెస్ తొలి సీఎం గోవింద్ వల్లభ్ పంత్, లోక్‌సభ తొలి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మౌలాంకర్.. ఇలా ఎందరో ప్రముఖులు ప్రతిపాదించారు.
ఆ ఏడాది మహాత్మునికే శాంతి బహుమతి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు పేర్లతో షార్ట్ లిస్ట్ (గాంధీ పేరు ఈ జాబితాలోకి రావడం మూడోసారట) రెడీ అయ్యింది. అయితే, నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ల గడువు ఇంకో రెండ్రోజుల్లో ముగుస్తుందనగా.. జనవరి 30న మహాత్ముడిని గాడ్సే పొట్టనబెట్టుకున్నాడు. తద్వారా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేకుండా చేశాడు.
ఎందుకంటే.. ఆ సంవత్సరం ఎవరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం లేదని 1948, నవంబర్ 18న కమిటీ ప్రకటించింది. పైగా.. ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఆ అవార్డు పొందేందుకు తగు అర్హత కలిగిన వ్యక్తి ఎవరూ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్పటి నిబంధనల ప్రకారం.. మరణానంతరం నోబెల్ ఇచ్చే సంప్రదాయం లేదు. తర్వాతి కాలంలో దాన్ని సవరించారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మహాత్ముడు జీవించి ఉండి ఉంటే.. 1948 నోబెల్ శాంతి బహుమతి ఆయనకే దక్కి ఉండేదన్నది అత్యధికుల వాదన.
పైగా.. ‘గాంధీ ఈ పురస్కారాన్ని దాదాపుగా దక్కించుకునే దాకా వచ్చారు. అయితే, ఆయన మరణం దాన్ని దూరం చేసింది’ అని 1948 నోబెల్ కమిటీ రికార్డుల్లో నమోదై ఉండటం కూడా ఆ వాదనను మరింత బలపరిచింది. గాంధీకి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం అన్నది కమిటీ చరిత్రలో అతిపెద్ద తప్పిదమని గేర్ లూండెస్టాడ్ అన్నారు. తర్వాత నోబెల్ కమిటీ కూడా మహాత్ముడికి శాంతి బహుమతి దక్కకపోవడంపై 1989, 2006లలో విచారం వ్యక్తం చేసింది. గాంధీ గొప్పోడని చెప్పడానికి ఆయనకు నోబెల్ అక్కర్లేదు.. కానీ నోబెల్ గొప్ప అవార్డు అని చెప్పుకోవడానికి మాత్రం గాంధీ కావాలి! దట్సిట్..
(చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!)