
గ్రేట్ లెగసీ
‘మా ముత్తాత నాన్న... మిలిటరీ; మా ముత్తాత... మిలిటరీ. మా తాత... మిలిటరీ; మా నాన్న మిలిటరీ. మా అన్న మిలిటరీ. కట్... చేస్తే... ఇప్పుడు నేను కూడా మిలిటరీ. మా వంశవృక్షం... ట్రీ... మిలిటరీ’... ఇదేమీ సినిమా డైలాగ్ కాదు. లెఫ్టినెంట్ పారుల్ ధడ్వాల్ గురించి చెప్పే సగర్వ డైలాగ్.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ గర్వించిన దగిన సందర్భం. ఈ పరేడ్‌లో 155 మంది ఆఫీసర్ క్యాడెట్స్ పాల్గొన్నారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరు భారత సైన్యంలో విధులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసలు సిసలు విశేషం... పారుల్ ధడ్వాల్, తమ సైనిక కుటుంబంలో అయిదవ తరానికి చెందిన తొలి మహిళా ఉమెన్ ఆఫీసర్ పారుల్. అద్భుత ప్రతిభ, అంకితాభావంతో రాష్ట్రపతి చేతుల మీదుగా సువర్ణపతకం అందుకుంది.
పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలోని జనౌరీ గ్రామానికి చెందిన పారుల్ అయిదో తరం మిలిటరీ వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. పారుల్ ముత్తాత, తాతలు హర్‌నామ్‌సింగ్ (సుబేదార్), ఎల్.ఎస్.ధడ్వాల్ (మేజర్), దల్జిత్‌సింగ్ ధడ్వాల్ (కల్నల్), నాన్న బ్రిగేడియర్ జగత్ జమ్వాల్ (బ్రిగేడియర్) మిలిటరీలో పనిచేశారు. సోదరుడు ధనుంజయ్ ధడ్వాల్ కెప్టెన్ హోదాలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో చేరిన అయిదవ తరానికి చెందిన తొలి మహిళగా తన ప్రత్యేకతను నిలుపుకుంది పారుల్.
‘ఇన్ఫినిటీ ప్రైడ్–ఏ లెగసీ ఆఫ్ ఫైవ్ జనరేషన్’ కాప్షన్‌తో ‘ఎక్స్’ వేదికగా పారుల్ ధడ్వాల్ కుటుంబానికి అభినందనలు తెలియజేసింది ఇండియన్ ఆర్మీ.