అశ్వత్థామ హతః  ధర్మరాజు చెప్పిన అబద్ధం  | Lord Krishna advised Pandavas in the war to tell lie that Ashwasthama died | Sakshi
Sakshi News home page

అశ్వత్థామ హతః  ధర్మరాజు చెప్పిన అబద్ధం 

Apr 6 2026 2:48 AM | Updated on Apr 6 2026 2:48 AM

Lord Krishna advised Pandavas in the war to tell lie that Ashwasthama died

భారత విజ్ఞానం

అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. యమధర్మరాజు అంశతో కుంతీదేవికి జన్మించినవాడు. ధర్మకోవిదుడు, నీతిపరుడు, సత్యవంతుడు... ఇన్ని సుగుణాలు కలిగిన ధర్మరాజు అబద్ధం ఆడాడా..?? అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఆపద్ధర్మం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అబద్ధం ఆడించాడు. 

లేకుంటే పాండవ వంశానికే ప్రమాదం వచ్చి ఉండేది. మహాభారత యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులు అతిరథ మహారధులని చెప్పుకోవచ్చు. వారిలో అశ్వత్థామ ఒకరు. అశ్వత్థామ మహారథి కోవకు చెందుతాడు. యుద్ధరంగంలో అడుగుపెట్టాడంటే ఏకకాలంలో ఏడు లక్షల 20 వేల మందితో యుద్ధం చేయగలడు. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుని కుమారుడు.

ద్రోణాచార్యుడు, కృపి దంపతులకు పరమేశ్వరుడి వరప్రసాదంగా జన్మించిన వాడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా ఉండడంతో ఆ బాలునికి అశ్వత్థామ అని పేరు పెట్టారని, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశ్వత్థామ నుదుటిపై శివుని మూడో కన్నులా అనిపించే ఒక దివ్యమైన మణి ఉండటం వల్ల అశ్వత్థామకు ఏ ఆయుధం వల్ల కానీ, ఎవరి వల్ల కానీ భయం, పరాజయం ఉండవని వరం.. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధంలో వీరవిహారం చేస్తూ పాండవ సైన్యాన్ని మట్టు పెడుతున్న సమయంలో ద్రోణాచార్యుని నిలువరించేందుకు ధర్మరాజుచే శ్రీ కృష్ణుడు అబద్ధం చెప్పిస్తాడు. 

ఎంతో సత్యవంతుడైన ధర్మరాజు చెప్తేనే అబద్ధాన్ని సైతం నిజమని నమ్ముతాడు ద్రోణాచార్యుడు. తాను అబద్దమాడనని ధర్మరాజు చెప్పినప్పటికీ ఆపద్ధర్మం కోసం అబద్ధమాడితే తప్పులేదని, శ్రీ కృష్ణు్ణడు ధర్మరాజుకు బోధించడంతో అయిష్టంగానే ధర్మరాజు అంగీకరిస్తాడు. ద్రోణాచార్యునికి వినబడేటట్లు అశ్వద్ధామ హతః... కుంజరహః అన్న సమయంలో కుంజరహః అనే మాట ద్రోణాచార్యునికి వినబడకుండా యుద్ధభేరీలు మోగించేటట్లు పథకం రూపొందించాడు శ్రీ కృష్ణుడు. ధర్మరాజు అన్న అశ్వత్థామ హతః అనే మాటను విన్న ద్రోణాచార్యుడు నిజంగానే తన కుమారుడైన అశ్వత్థామ మరణించాడని భావించి అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే అదునుగా భావించిన ధృష్ట్యద్యుమ్నుడు ద్రోణాచార్యుల తలనరికి అంతమొందిస్తాడు.

కాగా ధర్మకోవిదుడైన ధర్మరాజు ఒక చిన్నపాటి అబద్ధం ఆడటం వల్ల అప్పటివరకు మహాభారత యుద్ధంలో ధర్మరాజు పయనించిన రథం భూమికి నాలుగు అంగుళాలు పైన వెళ్లేదని, ఈ చిన్న అబద్ధం ప్రభావం వల్ల ధర్మరాజు రథం నేలను తాకిందని, మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు ఒకేఒక్కసారి నరకలోకాన్ని సందర్శించవలసి వచ్చిందని, ఆపై నేరుగా స్వర్గానికి వెళ్ళాడనే మరో కథనం కూడా వ్యాప్తిలో ఉంది.

కాగా ప్రస్తుత కలియుగంలో అశ్వత్థామ హతః కుంజరహః అనే మాటను రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రచారంలో వినియోగిస్తున్నారు. అంటే వారు ప్రజలకు ఇచ్చే హామీలలో కొన్ని మాత్రమే వినిపించేలా మిగిలినవి మెల్లగా చెప్తున్నప్పుడు ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌  

Advertisement
 
Advertisement
Advertisement