లైఫ్‌స్టైల్‌ ఇన్‌ప్లేషన్‌ : దీన్ని ఎదుర్కోవడం ఎలా? | Lifestyle inflation What is this and how to avoid | Sakshi
Sakshi News home page

Lifestyle Inflation అంటే ఏంటి? దీన్ని ఎదుర్కోవడం ఎలా?

Jul 12 2025 2:24 PM | Updated on Jul 12 2025 3:44 PM

Lifestyle inflation What is this and how to avoid

జీవనశైలి ద్రవ్యోల్బణంతో సామాన్యుల తిప్పలు 

జీతం పెరిగితే ఖర్చులూ పెంచేసుకుంటున్నారు 

అప్పులతో సతమతమవుతున్న సగటు ఉద్యోగి 

పొదుపు, ఆర్థిక క్రమశిక్షణలే అసలైన మందు..

మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులనూ పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెలనెలా మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం! జీతం పెరిగితే పొదుపు పెరగాలి. అలా కాకుండా, పెరిగిన జీతంతో సమానంగా.. పెట్టే ఖర్చూ పెరుగుతోందంటే మీ జీవన విధానం మీ చేయి దాటి పోయిందనే! ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడి పోయారనే! మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను  ఏ నెల చెక్‌ చేసినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందనే! దీనినే ‘లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లేషన్‌’ (Lifestyle Inflation) అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే.. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’!  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  

సాధారణంగా, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటాన్ని ‘ద్రవ్యోల్బణం’అంటారు. కానీ, ఈ ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది! జీతం పెరిగింది కదా అని, ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ పోతే సంభవించేది! ఇంకాస్త మెరుగైన తిండి. ఖరీదైన బట్టలు. సౌఖ్యమైన కారు. అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే – కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్‌ బ్రాండ్‌లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్‌ తప్పటమే జీవనశైలి ద్రవ్యోల్బణం.

‘పెరగటం’నిజం కాదు! 
మెరుగైన జీవితాన్ని కోరుకోవటం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగు పరుచుకోవటం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరు గుతాయి. మెల్లగా అప్పులు మొదలౌతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుంచి మనదేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదని ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’పేర్కొంది. దీన్నిబట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే... ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప, ఖర్చుపెట్టటానికి జీతం పెరగదని భావించి జాగ్రత్తగా ఉండాలని.  

ఏఐ భయం పొంచి ఉంది!  
జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండవలసిన ప్రధాన అంశం ఏఐ (కృత్రిమ మేధస్సు). ఏఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దీన్నిబట్టి ఉద్యోగ భద్రత, కెరీర్‌ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగటం, కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవటం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్షణంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించామని ఉద్యోగులు గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

పోల్చుకోవటం జీతానికి చేటు.. 
తోటివారితో పోల్చుకోవటం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎక్కు వ మంది సంపాదిస్తున్నారని, మెరుగ్గా జీవిస్తున్నారని, విలాసాలకు ‘అప్‌గ్రేడ్‌’అవుతున్నారని చెప్పి వాళ్లందరినీ అనుసరించటం అంటే.. పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవటమే. నిరంతర అశాంతి, అనారోగ్యాలు, రుణ భారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే ‘బోనస్‌’. చాలామంది.. విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి ‘స్థాయి’కి చేరుకోటానికి పరుగులు పెడుతుంటారు. నెలనెలా చెల్లింపులతో మన ల్ని కట్టిపడేసే ‘ఈఎంఐ’లతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతినెలా పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులూ ప్రబోధిస్తున్నారు.

చిక్కుకోకుండా ఉండాలి 
జీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్‌ ఫీజులు సరేసరి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్నచోటనే కొనసాగించాలి. అలాగే, అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లడానికి ప్రిస్టేజ్‌ అడ్డుపడుతుంది. ఇక ఈఎంఐలను అవి తీరేవరకు కట్టాల్సిందే. క్రెడిట్‌ కార్డులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుంచీ వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోటానికి ఈ అనుభవం పనికొస్తుంది కానీ, అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీతం పెరిగీ ప్రయోజనం ఉండదు.

ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్‌!

ముందస్తు హెచ్చరిక  సంకేతాలు..
జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని ముందుగా తెలియబరిచే హెచ్చరికలు కొన్ని ఉంటాయి. 
మొదటి హెచ్చరిక: మీ జీతం ఎంత పెరిగినా, అందులో కొంతైనా పొదుపు మొత్తంలో చేర్చలేకపోవటం. 
రెండో హెచ్చరిక: జీతం పెరిగిన నెల నుంచే మీరు బడ్జెట్‌ వేసుకోవటం మానేయటం.  
మూడో హెచ్చరిక : జీతం పెరిగిందన్న ధీమా మీ క్రెడిట్‌ కార్డు మినిమం బ్యాలెన్స్‌ను పెంచేయటం. 
నాలుగో హెచ్చరిక ‘ముందు కొనండి– తర్వాత చెల్లించండి’అనే స్కీములపై ఆధారపడటం.  
అయిదో హెచ్చరిక  ఇంటర్నెట్, ఓటీటీల  సబ్బ్‌ స్క్రిపషన్‌లు పెరగటం.

బయట పడే మార్గం  ఉంది.. 
జీవనశైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్‌కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్‌నెట్‌ స్ట్రీమింగ్‌ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కలి్పంచండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవని ఆర్థిక నిపుణుల ఉవాచ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement