హేమకాంతుడి వైశాఖధర్మం | Kids Story On Funday | Sakshi
Sakshi News home page

హేమకాంతుడి వైశాఖధర్మం

May 10 2026 12:35 PM | Updated on May 10 2026 12:35 PM

Kids Story On Funday

కృతయుగంలో వంగదేశాన్ని కుశకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి కుమారుడు హేమకాంతుడు. ఒకనాడు హేమకాంతుడు కొందరు భటులను వెంటబెట్టుకుని, వేట కోసం అడవికి వెళ్లాడు. అది వైశాఖమాసం. హేమకాంతుడు అడవిలో అనేక మృగాలను వేటాడాడు. మధ్యాహ్నవేళ ఎండ నడినెత్తికి వచ్చేసరికి అతడు బాగా అలసిపోయాడు. విశ్రాంతికి తగిన చోటు కోసం వెదుకులాడుతూ, అడవిలోనే ఉన్న మునుల ఆశ్రమ ప్రదేశానికి చేరుకున్నాడు.అక్కడ ఉండేవారు శతర్చినులు అనే మునులు. వారు అతిథి సత్కారాల వంటి విప్రకృత్యాలను ఎరుగరు. వారెరిగిన కర్మ తపశ్చర్య మాత్రమే! హేమకాంతుడు ఆ ఆశ్రమ ప్రదేశంలో అడుగుపెట్టే వేళకు శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. 

బాహ్యస్పృహను మరచి సమాధి స్థితిలో ఉన్న వారికి హేమకాంతుడి ఆగమనం తెలియలేదు. హేమకాంతుడు సమీపానికి వచ్చినా, వారు అతడి రాకను గుర్తించలేదు. రాజైన తనను మునులు పట్టించుకోనందున హేమకాంతుడు ఆగ్రహం చెందాడు. వారిని చంపాలని నిశ్చయించుకుని, వారిపైకి కత్తి దూశాడు. హేమకాంతుడి దూకుడు గమనించిన శతర్చినుల శిష్యులు అక్కడకు పరుగు పరుగున వచ్చారు. ‘‘ఓరీ దురాత్ముడా! మా గురువులైన శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహలో లేని వారిపైకి కత్తి దూయడం తగని పని. మునులను వధించబూనడం మహాపాతకం, పాపాత్ముడా!’’ అని పలికారు.

ముని శిష్యుల మాటలకు హేమకాంతుడు ‘‘విప్రులారా! నేను వేట కోసం ఈ అడవిలోకి వచ్చాను. వేటలో అలసిపోయి, ఇక్కడకు చేరుకున్నాను. మీ గురువులకు వీలు లేకపోతే, మీరైనా నాకు భోజనం పెట్టండి’’ అన్నాడు.‘‘రాజా! మేము గురువులు పెట్టిన భిక్ష తిని బతుకుతున్నాము. వారి అనుమతి లేకుండా ఏ పనీ చేయలేము. వారి ఆజ్ఞ లేనిదే నీకు అతిథి సత్కారాలు చేయడం మాకు కుదరని పని’’ అని పలికారు ముని శిష్యులు. వారి మాటలకు హేమకాంతుడు మండిపడ్డాడు. వారి చంపడానికి విల్లు సంధించాడు. 

‘‘దుర్మార్గమైన దొంగలు, క్రూరమృగాలు లేకుండా ఈ అరణ్యాన్ని చక్కదిద్దాను. మీకు భయం లేకుండా చేశాను. మీరు మా వలన అగ్రహారాది సత్కారాలను, ఉపకారాలను పొందారు. ఈ మునులు చేసిన మేలు మరచి, నేను ఇక్కడకు వచ్చినా, నా వంక చూడటం లేదు. ఆకలి దప్పులతో అలసి సొలసి వచ్చిన నాకు అన్నం పెట్టడానికి మీరు వెనుకాడుతున్నారు. మీలాంటి క్రూరులను సంహరించినా పాపం ఉండదు’’ అని పలికి, బాణం విడిచాడు.

హేమకాంతుడు ఆగ్రహంతో బాణం సంధించేసరికే ముని శిష్యులు భయభ్రాంతులై అడవిలోకి పారిపోయారు. కోపం చల్లారని హేమకాంతుడు వారిని వెంబడించి, వారిపై బాణ ప్రయోగం చేశాడు. అతడి బాణాలకు మూడువందల మంది శిష్యులు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు.ఈ కలకలం సద్దుమణిగాక, హేమకాంతుడి ఆజ్ఞపై రాజభటులు ఆశ్రమాల్లోకి చొరబడి, దొరికిన వంట పదార్థాలను తీసుకొచ్చారు. అందరూ వాటిని ఆరగించాక, కాసేపు విశ్రమించి, సాయంత్రం ఇంటికి బయలుదేరారు.అడవిలో తన కొడుకు హేమకాంతుడు చేసిన దుష్కార్యం తెలుసుకుని, కుశకేతుడు దుఃఖించాడు. కొడుకును నిందించాడు. ‘‘నీవంటి దుర్మార్గుడు రాజ్యపాలనకు తగడు’’ అని పలికి అతడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు.

తండ్రి ఆజ్ఞతో హేమకాంతుడు ఇల్లు వదిలి, కీకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ అతడు బ్రహ్మహత్యా పాతకంతో బాధపడుతూ కిరాతునిలా దొరికిన పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసం తింటూ జీవించసాగాడు. హేమకాంతుడు అలా ఇరవై ఎనిమిదేళ్లు ఆ అరణ్యంలోనే గడిపాడు. ఒక వైశాఖ దినాన త్రితుడు అనే ముని తీర్థయాత్రలకు బయలుదేరి ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ, మధ్యాహ్న వేళ ఎండ వేడికి తాళలేక మూర్ఛపోయాడు. అదృష్టవశాత్తు హేమకాంతుడు మూర్ఛిల్లిన మునిని గమనించి, అతడికి మోదుగు ఆకుల గొడుగు నీడ కల్పించి, శైత్యోపచారాలు చేశాడు. ముని స్పృహలోకి వచ్చాక అతడికి సొరకాయ బుర్రలో ఉన్న నీరు ఇచ్చి, దప్పిక తీర్చాడు. 

మార్గాయాసంతో మూర్ఛిల్లిన మునికి శైత్యోపచారాలు చేయడం వల్ల హేమకాంతుడి బ్రహ్మహత్యా పాతకం నశించింది. అతడి మనసు నిర్మలమైంది. అప్పటి నుంచి అతడు సదా శ్రీహరిని స్మరించసాగాడు. కొంతకాలానికి హేమకాంతుడు వ్యాధిగ్రస్థుడై మరణించాడు. అతడిని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి, యమదూతలను అడ్డుకున్నారు. హేమకాంతుడు వైశాఖ ధర్మాలను నెరవేర్చాడని, అందువల్ల అతడి పాపాలన్నీ నశించాయని, అతడిని వైకుంఠానికి తీసుకు రమ్మని శ్రీహరి ఆజ్ఞ అని చెప్పి, యమదూతలను తరిమేశారు. విష్ణుదూతలతో కలసి హేమకాంతుడు వైకుంఠానికి చేరుకున్నాడు.
∙సాంఖ్యాయన 

Advertisement
 
Advertisement
Advertisement