హోమ్‌ వర్క్‌ శిక్ష కారాదు | Kids Home Work | Sakshi
Sakshi News home page

హోమ్‌ వర్క్‌ శిక్ష కారాదు

Jul 13 2025 7:47 AM | Updated on Jul 13 2025 7:47 AM

Kids Home Work

హోమ్‌ వర్క్‌ విషయంలో పిల్లలు మారాం చేస్తారు. తల్లిదండ్రులు కోప్పడతారు. చదువు ఘర్షణలా మారుతుంది. ఇది ప్రతిరోజూ, ప్రతి ఇంటిలోనూ జరిగే విషయం. చదువు పట్ల తల్లిదండ్రులకు ఉన్న అపోహే అందుకు కారణమంటే ఆశ్చర్యపోకండి. 

చదువు అంటే ‘గుర్తుపెట్టుకోవడం’ మాత్రమే అన్న నమ్మకం మన సమాజంలో చాలా బలంగా ఉంది. ఎక్కువసార్లు చదివినా, రాసినా మెదడులో నిలుస్తుందన్న అపోహలో ఉన్నాం. దాంతో హోమ్‌ వర్క్‌ను ఒక నిల్వ ప్రక్రియలాగా చూస్తున్నాం. పిల్లల మెదడు నిజంగా ఎలా నేర్చుకుంటుందో తెలుసుకోవడమే హోమ్‌ వర్క్‌ సమస్యకు అసలైన పరిష్కారం. 

దృక్పథం మారాలి
చదువు అంటే ఒత్తిడి కాదు, ఉత్సాహం. హోమ్‌ వర్క్‌ అంటే పనిభారం కాదు, పునఃచింతన. ఇది జరగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మానసిక దృక్పథమే మారాలి. హోమ్‌ వర్క్‌ను సరికొత్తగా చూడాలి. అది భావోద్వేగ అనుభూతి, ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, సంబంధాల మధ్య ఒక వారధిలా ఉండాలి. పిల్లల మెదడును డౌన్‌లోడ్‌ చేయడం కాదు, డెవలప్‌ చేయాలి. పరీక్షల కోసం కాదు, జీవితానికి నేర్చుకోవాలి.

⇒ మెదడు భావోద్వేగాల ద్వారా నేర్చుకుంటుంది, రిపిటీషన్‌ ద్వారా కాదని న్యూరో సై¯Œ ్స పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి నేర్చుకోవడాన్ని అడ్డుకుంటుంది. కాని, భావోద్వేగ సంబంధిత విషయాలు మెదడులో బలమైన న్యూరల్‌ కనెక్షన్లు ఏర్పరుస్తాయని డాక్టర్‌ జుడీ విల్లిస్‌ అనే న్యూరాలజిస్ట్‌  చెబుతున్నారు.

⇒ జాన్‌ స్వెల్లర్‌ కాగ్నిటివ్‌ లోడ్‌ థియరీ ప్రకారం ప్రతి పిల్లవాడికి వర్కింగ్‌ మెమరీ పరిమితంగా ఉంటుంది. మన మెదడు ఒక్కసారిగా 4–7 అంశాలు మాత్రమే హ్యాండిల్‌ చేయగలదు. ఈ పరిస్థితిలో, పెద్ద పెద్ద హోమ్‌ వర్క్‌లు ఇచ్చినప్పుడు వాళ్లు నేర్చుకోకపోగా; అలసటకు, నిరాశకు లోనై హింసలా భావిస్తారు.

⇒ ఒకేసారి గంటలకు గంటలు ఒత్తిడితో చేసే హోమ్‌ వర్క్‌ కన్నా, విరామం తీసుకుంటూ చదివినప్పుడు లేదా హోమ్‌ వర్క్‌ చేసినప్పుడు మెదడు ఎక్కువగా నేర్చుకుంటుందని డాక్టర్‌ రాబర్ట్‌ బిజోర్క్‌ చెబుతున్నారు. 

⇒మంచి నిద్ర జ్ఞాపకశక్తిని పెంచుతుందని డాక్టర్‌ మాథ్యూ వాకర్‌ అనే నిద్ర శాస్త్రజ్ఞుడు చెబుతున్నారు. మంచి నిద్ర లేని పిల్లలు ఎంత రాసినా, ఎంత చదివినా లాంగ్‌ టర్మ్‌ మెమరీలో నిలవదు. కాబట్టి పిల్లలకు మంచి నిద్ర ఉండేలా జాగ్రత్త తీసుకోండి. 

సంప్రదాయ హోమ్‌ వర్క్‌లో లోపాలు
⇒ప్రతి పిల్లవాడి శైలి వేరు. కొందరు వింటూ, మరికొందరు రాసుకుంటూ, ఇంకొందరు చూసి నేర్చుకుంటారు. ఎవరి శైలిలో వారిని చేయనివ్వాలి. ఒక్కటే హోమ్‌ వర్క్‌ మొత్తం క్లాస్‌కు ఇవ్వడమంటే అందరికీ ఒకే మందు ఇవ్వడం లాంటిది.

⇒అమెరికన్‌ సైకాలజికల్‌ అసోసియేషన్‌ ప్రకారం హోమ్‌ వర్క్‌ వల్ల ఉదాసీనత, నిద్రలేమి, ఫ్యామిలీ గొడవలుపెరిగాయి. ఇక మన దేశంలో హోమ్‌ వర్క్‌ మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. 

⇒ ‘క్లాస్‌ వర్క్‌ పూర్తిచేయకపోతే ఊరుకోం. డబుల్‌ హోం వర్క్‌ చేయాలి’ అని టీచర్లు, పేరెంట్స్‌ బెదిరిస్తుంటారు. దీని వల్ల పిల్లల మనసులో ‘చదువు = శిక్ష’ అనే భావన బలపడుతుంది. ఇది వారికి చదువుపై కోపం, భయం పెంచుతుంది.
 

హోమ్‌ వర్క్‌ ఎలా చేయించాలి?

⇒ పేజీలకు పేజీలు రిపీట్‌ చేసే బదులు ఒక ప్రశ్న ఇవ్వండి. ‘ఇవ్వాళ నువ్వు ఏం అర్థం చేసుకున్నావు?’, ‘ఇది నీ స్నేహితుడికి ఎలా చెప్తావు?’ అని అడగండి. అది వారి ఊహాశక్తిని, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ను పెంచుతుంది.


⇒ డ్యూక్‌ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం హోమ్‌ వర్క్‌ గరిష్ఠంగా ‘తరగతి నంబర్‌ 10 నిమిషాలు’ మాత్రమే ఉండాలి. 1వ క్లాస్‌ అంటే 10 నిమిషాలు, 5వ క్లాస్‌ అంటే 50 నిమిషాలు మించకూడదు.  


⇒ హోమ్‌ వర్క్‌ను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, చర్చగా మార్చండి. ఒక సబ్జెక్టును చర్చించాలంటే పిల్లలు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ‘ప్రాటిజీ ఎఫెక్ట్‌’ అనే అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది – నేర్పేటప్పుడు నేర్చుకునే శక్తి పెరుగుతుంది.

⇒హోమ్‌ వర్క్‌ ఎలా చేయాలనే విషయంలో పిల్లలకు స్వేచ్ఛనివ్వండి. ‘ఇది రాయాలని ఉందా? లేక చెప్పాలని ఉందా?’ అనే చాయిస్‌ ఇవ్వండి. ఈ ఎంపిక వల్ల మెదడులో డోపమైన్‌ విడుదల అవుతుంది. ఇది చదువు పట్ల ఆసక్తిని పెంచుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement