ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో!

Kerala man managed to hide his lover in his room for ten years - Sakshi

ప్రేమ కోసం లైలా, పార్వతి, జూలియెట్‌లు పడిన బాధ, వేదన వారిని కాలంతోపాటు నిలబెట్టింది. కేరళకు చెందిన సజిత ఇప్పుడు వీరి సరసన చేరనుంది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన సజిత తన ఇంటి పదిళ్ల అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత పదేళ్లుగా దాక్కుంది. ఆమె తన గదిలో ఉన్నట్టు ప్రేమికుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఈ ప్రేమ కథ బయటపడి అంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రేమకు కుల మతాలు అడ్డుగా ఉంటాయని భయపడినంత కాలం ఇలాంటి ప్రేమికులు తారసపడుతూనే ఉంటారు.

సలీమ్‌ను ప్రేమించిన అనార్కలీని సలీమ్‌ నుంచి విడగొట్టడానికి అక్బర్‌ పాదుషా చీకటి గుహల్లోకి ఆమెను పంపించాడని ఒక కథనం. అయితే ఇక్కడ సలీమ్‌ ఉన్నాడు. అనార్కలీ కూడా ఉంది. అతని ప్రేమ కోసం ఆమె ఒక గదిలో చాటులో ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు ఉండిపోయింది. రెండు రోజుల క్రితం కేరళలో ఈ ఘటన బయటపడింది.

2010లో
ఫిబ్రవరి 2, 2010న పాలక్కాడ్‌ జిల్లాలోని అలియూర్‌ అనే పల్లెలో వేలాయుధన్‌ అనే వ్యక్తి 18 ఏళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సజితను వెతకడం ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న కుర్రాళ్లను పిలిచి ఎంక్వయిరీ చేశారు. ఏమీ క్లూ దొరకలేదు. మరోవైపు సజిత తల్లిదండ్రులు అలుపెరగకుండా సజితను వెతికారు. కాని ఆమె కనిపించలేదు. ఏళ్లు గడిచే కొద్ది వారు ఆమెపై ఆశ వదులుకున్నారు. మెల్లగా ఆమె చనిపోయిందనే నిర్థారణకు వచ్చారు. రేషన్‌ కార్డులో ఆమె పేరు తీయించేశారు కూడా. కాని ఆమె బతికే ఉంది. వాళ్లింటికి పదిళ్ల అవతలే ఉంది.

నాలుగు గోడల గదిలో
సజిత తన వీధిలోనే ఉన్న రహమాన్‌ను ప్రేమించింది. అతను చిన్నపాటి ఎలక్ట్రీషియన్‌. పెయింటర్‌. అయితే ఇరువురి మతాలు వేరు కాబట్టి పెళ్లికి ఇద్దరి పెద్దలు అడ్డం పడతారని వాళ్లకు సందేహం వచ్చింది. మరోవైపు సజితకు పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. సొంతంగా పారిపోయి బతికే ధైర్యం రహమాన్‌కు లేదు. అలాగే ఆర్థికంగా ఆమెను పోషించే స్థితిలో లేడు. కనుక వాళ్లిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఫిబ్రవరి 2, 2010న ఎవరూ లేని సమయంలో ఆమె అతని ఇంటికి వచ్చేసింది. ఆ ఇంట్లో అతనికి ప్రత్యేకం ఒక గది ఉంది. ఆ గదిలో ఉండిపోయింది. ఆ గది లో ఆమె ఉన్నట్టు రహమాన్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు. రహమాన్‌ తండ్రి అబ్దుల్‌ ఘని, అతని భార్య డైలీ లేబర్స్‌. వాళ్లు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. రహమాన్‌కు ఒక చెల్లెలు ఉంది. ఆమె ఇంట్లో ఉండేది. అయినప్పటికీ గత పదేళ్లుగా సజిత రహమాన్‌ గదిలో దాక్కుని ఉండిపోయింది.

రహమాన్‌కు ముక్కోపం. అదీగాక సజితను తన గదిలో దాచాక కావాలని తిక్క తిక్కగా వ్యవహరించేవాడు. దాంతో అతనికి కొంచెం స్క్రూలూజ్‌ అని అతని జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. అతను ఇంట్లో ఉంటే గదిలో ఉండేవాడు. బయటకు వెళితే గదికి తాళం వేసుకొని వెళ్లేవాడు. ఆ తాళం ఎవరూ తీయకుండా ప్రత్యేకంగా చేయించాడు. ఆ గదిలోనే అన్నం తీసుకెళ్లి తినేవాడు. ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ లేదు. అందుకని కిటికీ ఊచలను తొలగించి అవి అవసరం ఉన్నప్పుడు తీసి పెట్టుకునేలా ఏర్పాటు చేశాడు. సజిత తన టాయిలెట్‌ అవసరాలను ఆ కిటికీ గుండా రాత్రిళ్లు బయటకు వెళ్లి తీర్చుకునేది. గదిలో సజిత ఉన్నందున రహమాన్‌ తక్కువగా పనికి వెళ్లేవాడు. ఎక్కువగా ఇంట్లో లేదా గదిలో ఉండేవాడు. ఆమె లోపలే ఉండిపోయేది. ఒక టీవీ ఉంది ఆ గదిలో. అదే ఆమె కాలక్షేపం.

ఎలా బయటపడింది?
మూడు నెలల క్రితం రహమాన్‌ ఇంట్లో వాళ్లతో గొడవపడ్డాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దాంతో రహమాన్‌ అన్న (మరో ఊరిలో ఉంటాడు) పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాడు. అయితే పోలీసులు ఇతణ్ణి వెతకలేకపోయారు. నాలుగు రోజుల క్రితం రహమాన్‌ అన్న ఏదో పని మీద దాపునే ఉన్న ‘నెమర’ అనే చిన్న టౌన్‌కి వెళితే అక్కడ మోపెడ్‌ మీద వెళుతున్న రహమాన్‌ కనిపించాడు. వెంటనే అన్న పోలీసులకు చెప్తే వాళ్లు అతణ్ణి పట్టుకున్నారు. ఆ సమయంలోనే అతను సజితతో ఒక అద్దె ఇంట్లో జీవిస్తున్నాడని తెలిసింది.

ఇద్దరూ విముక్తులు
పోలీసులు ఇద్దర్నీ కోర్టులో హాజరు పరిచారు. జడ్జి సజితను ‘ఎక్కడ ఉంటావమ్మా’ అని అడిగితే రహమాన్‌తోనే అని చెప్పింది. కోర్టు ఇద్దరినీ పంపించేసింది. అయితే ఈ సంగతి విన్న ఊరి వాళ్లు ఇరు పక్షాల పెద్దలు దిగ్భ్రమలో ఉండిపోయారు. పోలీసులు వీరి కథనాన్ని ఏ మాత్రం నమ్మలేదు. రహమాన్‌ను విడిగా, సజితను విడిగా ప్రశ్నిస్తే ఒకే కథ చెప్పారు ఇద్దరూ. వారు ఉన్న గదిని చూసి ఇంత చిన్న గదిలో ఇన్నాళ్లు ఈమె ఎలా ఉందా అని పోలీసులు ఆశ్చర్యపోయారు.

సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. ఏ వ్యక్తికీ అన్ని రోజులు అలా ఒక గదిలో ఉండటం సాధ్యం కాదు. బహుశా ప్రేమ ఆమెకు ఆ శక్తి ఇచ్చిందేమో.
ప్రస్తుతానికి వీరి కథ సుఖాంతం.
వీరి ప్రేమను విడగొట్టాలనే సాహసం ఇంత కథ విన్నాక ఏ పెద్దలూ చేయరేమో.

సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top