రుతుక్రమం వైకల్యం కాదు | Karnataka approved 12 menstrual leaves for womens | Sakshi
Sakshi News home page

రుతుక్రమం వైకల్యం కాదు

Apr 4 2026 3:53 AM | Updated on Apr 4 2026 6:20 AM

Karnataka approved 12 menstrual leaves for womens

కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన బహిష్టు సెలవుల ఉత్తర్వు చట్టపరమైన చర్చకు దారితీసింది. దీనిని సవాలు చేస్తూ 15 మంది మహిళా వృత్తి నిపుణులు హైకోర్టు మెట్లెక్కారు. రుతుక్రమ సెలవును ‘కపట వివక్షగా’ అభివర్ణించారు. ఇది బంగారు పంజరం లాంటిదని.. పైకి మహిళల మేలు కోసమే అన్నట్లుగా కనిపించినా.. ఇలాంటివి వారి కెరీర్‌ని దెబ్బతీస్తాయని వారు వాదించారు. మూసధోరణులకు ముగింపు పలకాలన్నారు.

ఉత్తర్వు ఏం చెబుతుంది?
కర్ణాటక ప్రభుత్వం బహిష్టు సెలవు విధానాన్ని నవంబర్‌ 2025లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రవేశపెట్టారు. ఇది మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవును తప్పనిసరి చేస్తుంది. అంటే ఏడాదికి 12 రోజులు. ఈ ఉత్తర్వు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ రంగాలకూ వర్తిస్తుంది. అంటే ఐటీ సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేసే 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసులో ఉన్న  అవసరం గల ప్రతి మహిళా సెలవు తీసుకోవచ్చు. దీనికి మెడికల్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు. అయితే ఉపయోగించని సెలవులను తదుపరి నెలకు బదిలీ చేయడం సాధ్యపడదు.

మూసధోరణుల్ని ప్రోత్సహించడమే
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ‘బహిష్టు సెలవు’పై ప్రశ్నిస్తూ ఉన్నత హోదాల్లో ఉన్న 15 మంది మహిళలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది మృదువైన వివక్షకు నిదర్శనమన్నారు. సమానత్వాన్ని పెం పొందించడానికి బదులుగా, ఈ విధానం దానికి విరుద్ధమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటువంటి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల నియామక ప్రక్రియలలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని, యజమానులు మహిళలను పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలవారిగా చూసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ చర్య ఆనాటి మూస పద్ధతులను బలపరిచే ప్రమాదం ఉందని, వారి ఎదుగుదలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ సెలవు మహిళలను బలహీనులుగా చిత్రీకరిస్తుందని, తద్వారా సమానత్వ చట్టాల అసలు ఉద్దేశ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని వారు వాదించారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో మహిళలు ప్రత్యేక రాయితీలు, నిర్బంధ సెలవులు కోరుకోవడం లేదు, కేవలం సమాన అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కోరుతున్నారు. రుతు క్రమాన్ని ఒక వైకల్యంగా మార్చడం తమ వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం’’ అని ఈ మహిళల వాదన.

పని ప్రదేశాల్లో ఈ రకమైన వివక్షను గుర్తించడం కష్టం, ఎందుకంటే ఇది ప్రేమ,  మర్యాద రూపంలో వస్తుంది. ఈ బంగారు పంజరం నుంచి బయటపడాలంటే, మహిళలను కేవలం రక్షించాల్సిన వ్యక్తులుగా కాకుండా, సమాన సామర్థ్యం గల భాగస్వాములుగా గుర్తించడం నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement