కన్నడ జానపద కథ
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అవ్వ ఉండేది. పేరు ‘కెంకమ్మ’. అవ్వ చాలా పేదది. కానీ దోసెలు మాత్రం అద్భుతంగా వేసేది. ఒక్క దోసె తింటే చాలు రెండు రోజులు ఆకలి వేయదు అనేవారు.
అదే ఊరిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. దాని పేరు ‘బూతయ్య’. దానికి పని చేయడం చేతకాదు. కానీ దొంగతనంగా తినడం బాగా వచ్చు. రోజూ కెంకమ్మ ఇంటి దగ్గరికి వచ్చి ‘అవ్వా, ఆకలి’ అని అడిగేది. అవ్వ జాలితో ఒక దోసె పెట్టేది. నక్కకు ఆ రుచి నచ్చింది. ‘రోజూ ఒక్క దోసె ఏం సరిపోతుంది? అన్నీ కావాలి’ అనుకుంది.
ఒకరోజు నక్క ఒక ప్లాన్ వేసింది. అవ్వ ఇంటి ముందు పడుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.
‘అయ్యో! నా కాలు విరిగిపోయింది. నడవలేను‘ అని దొంగ డ్రామా చేసింది. కెంకమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘అయ్యో పాపం’ అని ఇంట్లోకి తీసుకెళ్లింది. కట్టు కట్టింది. వేడి వేడి దోసెలు, నెయ్యి, బెల్లం పెట్టింది. నక్కకు పండగే పండగ. మూడు రోజులు అక్కడే తిని పడుకుంది.
నాలుగో రోజు అవ్వ చాపలు నేయడానికి బయటికి వెళ్లింది. ‘బూతయ్యా, తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండు’ అని చెప్పి వెళ్లింది. అంతే! నక్క లేచి ఒక్క గెంతు గెంతింది. వంటింట్లోకి వెళ్లి దోసె పిండి మూట, నెయ్యి డబ్బా, బెల్లం అన్నీ మూట కట్టుకుంది. పారిపోదాం అనుకుంది. కానీ కెంకమ్మ తెలివైనది. వెళ్లినట్టే వెళ్లి, కిటికీలోంచి చూస్తోంది. నక్క బయటికి రాగానే గబుక్కున దాని తోక పట్టుకుంది.
‘ఎక్కడికి రా దొంగా? కాలు విరిగిందన్నావ్, ఇప్పుడు కుందేలులా గెంతుతున్నావ్?‘ అని నవ్వింది.
నక్క సిగ్గుతో తల దించుకుంది. ‘అవ్వా, నన్ను క్షమించు. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను, దొంగతనం చెయ్యను’ అని బతిమిలాడింది. అవ్వ నవ్వి, ‘సరే, ఆకలితో ఉన్నావ్ కదా. పని చేస్తే దోసె పెడతా. నా పెరడులో బావి తవ్వు’ అంది. నక్క ఆ రోజు నుంచి పని చేసి, కష్టపడి తినడం నేర్చుకుంది.


