Tina Rahimi: మెచ్చుకోలు, ఆశ్చర్యం, ప్రశ్నార్థకం కళ్లతో చూసినవారు ఆమెను మర్చిపోలేరు! ఎందుకు?

Interesting Facts About Australia Boxer Tina Rahimi - Sakshi

ఢిల్లీలో ఇప్పుడు మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. అందరి దృష్టి ఆస్ట్రేలియా బాక్సర్‌ టినా రహిమి మీద నిలిచింది. ఆమె ప్రపంచంలోనే బహుశా మొదటి హిజాబ్‌ బాక్సర్‌. ప్రిలిమినరిస్‌లోనే రహిమి ఓడిపోయినా హిజాబ్‌ గురించి ప్రపంచానికి ఉన్న దృష్టి మారడానికి పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను అని తెలిపింది.

‘ఏం పర్వాలేదు. నా మద్దతుదారులను నిరాశ పరిచాను. కాని 2024 ఒలింపిక్స్‌లో కచ్చితంగా గోల్డ్‌ మెడల్‌ సాధిస్తాను’ అంది 27 సంవత్సరాల టినా రహిమి.
ఆస్ట్రేలియా నుంచి తొమ్మిది మంది బాక్సర్ల బృందంతో ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌కు హాజరైన టినా గట్టి పోరాటం ఇచ్చి ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో వచ్చింది.

కాని మన టాలెంటెడ్‌ బాక్సర్‌ మనిషా మౌన్‌ చేతిలో ఓటమి పాలయ్యింది. రింగ్‌లో హిజాబ్‌ ధరించి తలపడిన ఆమెను మెచ్చుకోలు కళ్లతో, ఆశ్చర్యం కళ్లతో, ప్రశ్నార్థకం కళ్లతో చూసినవారు ఆమెను మర్చిపోవడం మాత్రం కష్టం.

‘అనుకూలంగానో ప్రతికూలంగానో నన్ను అందరూ చూస్తుంటారు. నేను ముస్లింని. నా మతానుసారం దుస్తులు ధరించే స్వేచ్ఛ నాకు ఉంది. నేను ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి అవి ఏమాత్రం అడ్డు కాకూడదని భావిస్తాను.

నన్ను చూసిన చాలామంది ముస్లిం యువతులు స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఈమె హిజాబ్‌తో ఏకంగా బాక్సింగ్‌ చేయగలిగితే చదువుకు, ఉద్యోగాలకు అది మనకు ఏం అడ్డం అనుకుంటారు. అలాగే అనుకోవాలని కోరుకుంటాను’ అంది రహిమి.

రహిమి 57 కేజీల విభాగంలో ఆస్ట్రేలియా తరఫున విజయాలు సాధిస్తూ ఉంది. 2022 కామన్‌వెల్త్‌ క్రీడల్లో (బర్మింగ్‌ హామ్‌) ఫెదర్‌ వెయిట్‌ విభాగంలో బ్రాంజ్‌ మెడల్‌ గెల్చుకునిఆ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా ముస్లింగా నిలిచింది. అలాగే కామన్‌వెల్త్‌ క్రీడల్లో హిజాబ్‌తో బాక్సింగ్‌ చేసిన మొదటి మహిళగా కూడా.

‘ఇప్పటి వరకూ నా హిజాబ్‌ గురించి ఎటువంటి అభ్యంతరం రాలేదు. అయితే హిజాబ్‌ను సమర్థించే వారు నేను గెలవాలని గట్టిగా కోరుకుంటారు. హిజాబ్‌తో గెలిచింది అని గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నాకు వొత్తిడి కలిగిస్తోంది’ అంటుందామె.

సిడ్నిలో స్థిరబడి ఆస్ట్రేలియన్‌ జాతీయత స్వీకరించిన ఈ ఇరానియన్‌ మహిళ అక్కడ మేకప్‌ ఉమెన్‌గా ఉపాధి పొందుతోంది. 
‘అయితే 2017లో జిమ్‌లో నేను, నా స్నేహితురాలు సరదాగా స్త్రీల బాక్సింగ్‌ క్లాసులకు అటెండ్‌ అయ్యాం. బ్యాగ్‌లను పంచ్‌ చేస్తుంటే మంచి కిక్‌గా అనిపించింది. ఆ సరదా కాస్త సీరియస్‌ ప్రాక్టీసుగా మారింది.

2018 నాటికి నేను క్వాలిఫైడ్‌ బాక్సర్‌గా మారాను’ అంటుంది రహిమి. ఆస్ట్రేలియాలో ముస్లిం అథ్లెట్లకు మంచి ప్రోత్సాహం ఉంది. ప్రతి ఏటా అక్కడ ‘ఆస్ట్రేలియా ముస్లిం అచీవ్‌మెంట్‌ అవార్డ్స్‌’ ఇస్తారు. గత సంవత్సరం రహిమికి ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించారు.
‘హిజాబ్‌ వారి వారి ఎంపిక. ఎంచుకున్న వారికి అది ఏ విధంగానూ అడ్డు కాదు’ అంటుంది రహిమి.

‘ఇప్పటి వరకూ నా హిజాబ్‌ గురించి ఎటువంటి అభ్యంతరంరాలేదు. అయితే హిజాబ్‌ను సమర్థించే వారు నేను గెలవాలని గట్టిగా కోరుకుంటారు. హిజాబ్‌తో గెలిచింది
అని గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నాకు వొత్తిడి కలిగిస్తోంది’ అంటుందామె. 

చదవండి: Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top