ప‌ట్టుద‌ల‌కు ప్ర‌తిరూపం పాయ‌ల్‌ | Indian Para Archer Payal Nag life journey | Sakshi
Sakshi News home page

Payal Nag: వి(ల్‌)ల్లు పవర్‌!

Apr 10 2026 8:18 PM | Updated on Apr 10 2026 8:22 PM

Indian Para Archer Payal Nag life journey

నిరాశ, నిస్పృహలు అనేవి ఓటమికి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఆశ, ఆత్మవిశ్వాసం అనేవి విజయానికి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. కాళ్లు, చేతులు లేని పాయల్‌ నాగ్‌ ఆశ, ఆత్మవిశ్వాసాలతో స్నేహం చేసింది. బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో స్వర్ణం గెలుచుకొని మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...

బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఫైనల్‌లో తన ఆరాధ్య దేవతలాంటి శీతల్‌దేవిని ఓడించి స్వర్ణం గెలుచుకుంది పద్దెనిమిదేళ్ల పాయల్‌ నాగ్‌. ఇది కేవలం విజయం మాత్రమే కాదు. క్రీడలకు అతీతమైన అనుభూతి.

ఒకప్పుడు శీతల్‌దేవి గురించి విని పాయల్‌ పులకించిపోయేది. ఆమె వీడియోలు అదేపనిగా చూసేది. ‘శీతల్‌దేవిలా పేరు తెచ్చుకోవాలి’ అని కల కనేది. ఆ కల నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అయితే అది అదృష్టంతో వచ్చిన విజయం కాదు. అంకితభావం, కష్టపడేతత్వంతో వచ్చిన విజయం...

అనాథాశ్రమంలో...
ఒడిశాకు చెందిన పాయల్‌ తండ్రి కూలి. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో నాలుగు అవయవాలను కోల్పోయింది పాయల్‌. పోషించే స్థోమత లేక తల్లిదండ్రులు ఆమెను అనాథాశ్రమంలో చేర్పించారు. దురదృష్టం సంగతి ఎలా ఉన్నప్పటికీ పాయల్‌ నిరాశ చీకట్లో మగ్గిపోలేదు. ఎప్పుడూ చురుగ్గా ఉండేది. పాయల్‌ తన నోటితో పెయింటింగ్‌ వేస్తున్న ఒక వైరల్‌ వీడియో కోచ్‌ కుల్దీప్‌ కుమార్‌ వేద్వాన్‌ దృష్టిని ఆకర్షించింది. పాయల్‌లోని ప్రతిభను గుర్తించి కత్రాలోని తన అకాడమీకి తీసుకువచ్చాడు. పాయల్‌ కోసం ప్రత్యేకంగా విల్లు తయారుచేయించాడు. ఆర్చరీలో ఆమెను తీర్చిదిద్దాడు.

భుజం, నోటితో...
విల్లును పట్టుకోవడానికి కాళ్లను ఉపయోగిస్తుంది శీతల్‌దేవి. ఆమెలా కాకుండా తన భుజం, నోటిని ఉపయోగించి విల్లును సంధిస్తుంది పాయల్‌. ఇదేమీ అంత సులువైన విషయం కాదు. బోలెడు కష్టపడాలి. సహనం ఉండాలి. ఆ రెండు పాయల్‌లో ఉండడం వల్లే ఆర్చరీలో అద్భుత ప్రతిభ చూపగలుగుతోంది.

బ్యాంకాక్‌లో పాయల్ పాల్గొన్న ఈవెంట్‌ తన మొదటి సీనియర్‌ అంతర్జాతీయ ఈవెంట్‌ అయినప్పటికీ శీతల్‌ను ఓడించడం ఇదే మొదటి సారి కాదు. జైపూర్‌లో 2025లో జరిగిన పారా ఆర్చరీ నేషనల్స్‌లో శీతల్‌ను స్వల్ప తేడాతో ఓడించింది.

ఇక బ్యాంకాక్‌ విషయానికి వస్తే...
శీతల్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా పాయల్‌ ప్రశాంతంగా విజయాన్ని కైవసం చేసుకుంది.

ఇద్దరి గురువు ఒకరే...
శీతల్‌తో పాటు, పాయల్‌ను ఆర్చరీలో తీర్చిదిద్దిన వ్యక్తి కుల్దీప్‌ కుమార్‌ వేద్వాన్‌. ఆయన ఒక రైతు కుమారుడు. ఆ రైతు ఎలాంటి వ్యక్తి అంటే... ‘నీ దగ్గర సంపద లేకపోవచ్చు. వనరులు లేకపోవచ్చు. నీ మీద నీకు మాత్రం గట్టి నమ్మకం ఉండాలి’ అని నమ్మిన వ్యక్తి.

తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్న వేద్వాన్‌ ఇతరులకు కూడా దారి చూపుతున్నాడు. శీతల్, పాయల్‌లాంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement