
ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ మరొక మైలురాయిని చేరుకోబోతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.) ‘వరల్డ్ ఎకనా మిక్ అవుట్ లుక్ – 2025’ నివేదిక ప్రకారం 2025లో 4.187 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత్, 4.186 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2027 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకి చేరుకుంటుందనీ, 2028 నాటికి 5.58 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని కూడా అధిగ మించి అమెరికా, చైనాల తర్వాత మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనీ ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా మొదటి రెండు స్థానాలలో ఉన్న అమెరికా (30.5 ట్రిలియన్ డాలర్ల జీడీపీ), చైనా (19.2 ట్రిలియన్ డాలర్ల జీడీపీ)లకూ భారత్‌కూ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. అనేక అంశాలలో భారత్ దయనీయమైన స్థానాల్లో ఉంది. ఉదాహరణకు తలసరి ఆదా యంలో ప్రపంచంలో 141వ ర్యాంకు, మానవాభివృద్ధి సూచికలో (హెచ్‌డీఐ) 134వ ర్యాంకు,
ప్రపంచ ఆకలి సూచీలో 105వ ర్యాంకు, స్థూల సంతోష సూచీలో 118వ ర్యాంకుల్లో నిలిచింది. ప్రపంచంలో మొదటి పది పెద్ద ఆర్థిక వ్యవస్థలలో పదివేల డాల ర్లతో భారత్ మాత్రమే అతి తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. చైనా తలసరి ఆదాయం దరిదాపు 25 వేల డాలర్లు. భారత్ కంటే తక్కువ జీడీపీజపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ ఇటలీ, కెనడా, బ్రెజిల్‌లాంటి ఆరు దేశాలలో మొత్తం జనాభా కేవలం 57 కోట్లుగా ఉంటే... ఆ దేశాల సంపద 18 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఆరు దేశాల జనాభా కంటే భారత్ జనాభా రెండు రెట్లు ఎక్కువ.
‘ఆక్స్‌ఫామ్ ఇండియా రిపోర్టు–2024’ ప్రకారం భారతదేశంలో సంపద అసమానతలు పెరిగిపోతున్నాయి. 40 శాతం జాతీయ సంపద ఒక్క శాతం ధనికుల చేతిలో కేంద్రీకృతమై ఉంటే, 77 శాతం జాతీయ సంపద 10 శాతం ధనికుల చేతులలో ఉంది. ‘హురూన్ ఇండియా రిచ్ లిస్ట్– 2025’ ప్రకారం, భారత్‌లో 284 మంది బిలియనీర్లు ఉంటే వారి సంపద మొత్తం 98 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో మూడవ వంతు.
కోవిడ్ లాంటి విపత్కర పరిణామాల అనంతరం ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు నెలకొనే ఛాయలు కనిపించినప్పటికీ, స్థిరమైన వృద్ధిరేటు సాధిస్తున్న దేశంగా భారత్ నిలదొక్కుకోవటానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటమే కారణమని ఐఎంఎఫ్ భావిస్తోంది. కాబట్టి రాబోయే దశాబ్దంలో భారత్ మరిన్ని అద్భుత ఆర్థిక విజయాలు సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
– డా. తిరునహరి శేషు
అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం